కొకైన్ సరఫరా తగ్గడంతో ఎండీఎంఏ, మెఫెడ్రోన్ (ఎండీ), నల్లమందు వైపు పెడ్లర్ల చూపు
గుట్టుచప్పుడు కాకుండా చిన్న చిన్న ల్యాబ్‌లలో సింథటిక్ డ్రగ్స్ తయారీ
దేశీయంగా తయారు చేస్తూ ముఠాల అంతర్రాష్ట్ర దందా
విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయ నెట్‌వర్క్‌ల విస్తరణ
ఎండీ డ్రగ్‌ను గుట్కాతో కలిపి తీసుకుంటున్న విద్యార్థులు
మెఫెడ్రిన్‌తో అత్యంత ప్రమాదమంటున్న నిపుణులు
ఈ ముఠాల కట్టడికి ఫోకస్ పెంచిన ఈగల్ ఫోర్స్
త్వరలో భారీఆపరేషన్స్ నిర్వహిస్తాం
ఈగల్ ఫోర్స్ డైరెక్టర్‌సందీప్ శాండిల్య
పోలీసులు బాటసింగారం ప్రాంతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో గత జూన్ 12న ఎండీ డ్రగ్ తయారీ ముఠాను పట్టుకున్నారు. వీరివద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్‌తోపాటు రూ.50 లక్షల విలువైన డ్రగ్ తయారీ యూనిట్, రసాయనాలు స్వాదీనం చేసుకున్నారు. కీలక సూత్రధారి అయిన సూర్యాపేట జిల్లాకు చెందిన కీసరి మత్స్యగిరి అలియాస్ నరేశ్ మోత్కూరు సమీపంలోని ఓ మామిడి తోటలో రహస్యంగా డ్రగ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. గతంలో కెమిస్ట్‌గా పనిచేసిన మత్స్యగిరి గుజరాత్‌కు చెందిన కొందరితో మెఫెడ్రోన్ తయారీని నేర్చుకుని, సొంతంగా ల్యాబ్ పెట్టి ఎండీ డ్రగ్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
షాద్‌నగర్‌లోని ఒక అద్దె ప్రాంగణాన్ని రహస్య డ్రగ్ ల్యాబ్‌గా మార్చి మెఫెడ్రోన్ (ఎండీ) తయారు చేస్తున్న ముఠాను గత మార్చిలో ఈగల్ ఫోర్స్ ఛేదించింది. 17 కిలోల మెఫెడ్రోన్, 300 కిలోల ప్రీకర్సర్ కెమికల్స్‌ను స్వాధీనం చేసుకుంది. షాద్‌నగర్ కేంద్రంగా తయారు చేసిన ఎండీనిఇక్కడ విక్రయించడంతోపాటు రాజస్తాన్‌కు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
సాక్షి, హైదరాబాద్: ఈగల్‌ఫోర్స్, పోలీస్, ఎక్సైజ్ శాఖల ముప్పేట దాడులతో కొకైన్‌ను సరఫరా చేసే ఆఫ్రికా దేశాలకు చెందిన డ్రగ్ సరఫరా ముఠాలు హైదరాబాద్ వైపు వచ్చేందుకు సాహసించడం లేదు. దీంతో రాష్ట్రంలో కొకైన్ సరఫరాకు దాదాపుగా అడ్డుకట్ట పడింది. విదేశాల నుంచి వచ్చే కొకైన్ సరఫరా తగ్గడంతో డ్రగ్స్ ముఠాలు రూటు మారుస్తున్నాయి. డ్రగ్ పెడ్లర్లు యువతను, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకాల మత్తు పదార్థాల విక్రయాలు విస్తరిస్తున్నారు.
గంజాయి, నల్లమందు, ఎండీఎంఏతోపాటు ప్రధానంగా ఎండీ డ్రగ్‌ను యువత గుట్కాలో కలిపి తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. మెల్లగా గుట్కాలో కొద్దికొద్దిగా కలిపి విద్యార్థులకు అలవాటు చేస్తున్న మత్తుముఠాలు నెమ్మదిగా వారిని బానిసలుగా మారుస్తున్నాయి. తొలుత తక్కువ రేటుకే మత్తుపదార్థాలను విద్యార్థులకు చేరవేసి.. తర్వాత వారిని బానిసలుగా మారుస్తున్నారు. డ్రగ్ పెడ్లర్లు కొకైన్ కాకుండా కొత్త మత్తు పదార్థాలపై దృష్టి సారిస్తున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
ప్రధానంగా మెఫెడ్రోన్ (ఎండీ), మరో సింథటిక్ డ్రగ్ ఎండీఎంఏ, నల్లమందు (ఓపియం) వంటి మత్తు పదార్థాల వైపు స్థానిక డ్రగ్ నెట్‌వర్క్‌లు మళ్లుతున్నాయి. ఇటీవల వరుసగా ఎండీఎంఏ, మెఫెడ్రోన్, ఓపియం సరఫరాదారుల అరెస్టులు, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న స్థానిక డ్రగ్ తయారీ యూనిట్లు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

దేశీయంగా తయారు చేస్తూ...
అంతర్జాతీయంగా సరఫరా అవుతున్న డ్రగ్స్‌పై నిఘా పెరగడంతో కొన్ని ముఠాలు దేశీయంగానే కొన్నిరకాల డ్రగ్స్ తయారీకి తెరతీశాయి. గుట్టుచప్పుడు కాకుండా చిన్న చిన్న ల్యాబ్‌లలో సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేసి.. అంతర్రాష్ట్ర లింక్‌లతో దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఇటీవల జరిపిన కొన్ని సోదాల్లో ప్రధానంగా రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఎండీ డ్రగ్ తెలంగాణకు వస్తున్నట్టుగా ఈగల్ ఫోర్స్ అధికారులు గుర్తించి నిఘా పెంచారు.
రాజస్తాన్‌కు చెందిన డ్రగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న రెండు మెఫెడ్రోన్ తయారీ కేంద్రాలను ఇటీవలే గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. అదేవిధంగా గత జూన్‌లోనూ బాటసింగారం ప్రాంతంలో మత్స్యగిరి అనే వ్యక్తి మామిడి తోటలో రహస్యంగా ఏర్పాటు చేసిన ఎండీ డ్రగ్ తయారీ యూనిట్‌ను ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ తరహా డ్రగ్స్ రాజస్తాన్‌కు చెందిన ముఠాలే నగరానికి సరఫరా చేస్తుండడంతో నిఘా పెంచిన ఈగల్ అధికారులు 2023 ఇప్పటి వరకు 78 సార్లు ఈ ముఠాలను అడ్డుకున్నట్టు పేర్కొన్నారు.
విద్యార్థులు, యువత టార్గెట్‌గా..
మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులను డబ్బుకోసం, మత్తుపదార్థాల కోసం డ్రగ్ పెడ్లర్లుగా మార్చుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. పిల్లలు, యువత ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో డ్రగ్ నెట్‌వర్క్‌ల కార్యకలాపాలను తెలంగాణ పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. క్వాంటమ్ లీప్ స్కూల్ కేసు నేపథ్యంలో విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్ సరఫరా, విక్రయాలపై మరింత నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యార్థులు, కమ్యూనిటీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
అంతర్రాష్ట్ర డ్రగ్ మాఫియాను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు చేపడుతున్నారు. స్థానిక పెడ్లర్ నుంచి అంతర్రాష్ట్ర సరఫరాదారు వరకు మొత్తం గొలుసును ఛేదించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. పూర్తి సాంకేతికతను వాడుకుంటూ దాడులు చేస్తున్నారు. విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం ఉపేక్షించబోమని, ఇలాంటి నెట్‌వర్క్‌లపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటామని ఈగల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
‘ఎండీ’తో తీవ్ర ఆరోగ్య ముప్పు
మెఫెడ్రోన్ (ఎండీ) అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ సైకోయాక్టివ్ డ్రగ్‌గా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, తీవ్ర ఆందోళన, భయాందోళనలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తరచూ వినియోగిస్తే దీనికి బానిసగా మారి వ్యసనానికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. తీవ్రమైన మత్తు ప్రభావంలో దూకుడు ప్రవర్తన, భ్రాంతులు, ఫిట్స్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎండీ మత్తులో కొందరు తమకు తామే తీవ్రంగా గాయపరుచుకోవడం, ప్రమాదకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.
తయారీ కేంద్రాలపై నిఘా పెంచాం
మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను, పెడ్లర్లను కట్టడి చేయడంతో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేసేలా ఈగల్ ఫోర్స్ విస్తృతంగా పనిచేస్తోంది. అదేవిధంగా ఎండీ, ఇతర డ్రగ్స్ తయారీ కేంద్రాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇటీవల కాలంలో రాజస్తాన్‌తోపాటు తెలంగాణ కేంద్రంగా ఎండీ డ్రగ్ తయారీ కేంద్రాలపై నిఘా పెంచాం. ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లను మూయించాం.
అదేవిధంగా రాజస్తాన్ నుంచి వివిధ పనుల కోసం తెలంగాణకు వస్తున్న యువతలో ఈ మత్తుపదార్థాలు అలవాటు ఉన్న వాళ్ల ద్వారా ఇక్కడికి ఎండీ, నల్లమందు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించాం. డ్రగ్స్ వాడితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని నమ్మించి ఇక్కడి యువతకు దీన్ని అలవాటు చేస్తున్నారు. మనకు ఎక్కువగా రాజస్తాన్ ముఠాల నుంచే వస్తున్నాయి. కానీ అక్కడి వాళ్లను అరెస్ట్ చేసేందుకు రాజస్తాన్‌కు వెళ్లిన సమయంలో మన ఫోర్స్‌పై దాడులు జరిగిన ఘటనలు ఉంటున్నాయి. త్వరలో రాజస్తాన్ పోలీసుల సహకారంతో భారీ ఆపరేషన్స్ చేస్తాం. – సందీప్ శాండిల్య, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్
రూ.54 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత
యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురి అరెస్ట్
భువనగిరి (బీబీనగర్): కారులో తరలిస్తున్న మాదక ద్రవ్యాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ ఆదివారం బీబీనగర్ పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. వివరాలు ఇలా... బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద శనివారం స్థానిక పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో సుమారు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల నిషేధిత మెఫెడ్రోన్‌తోపాటు డ్రగ్స్ తయారీలో ఉపయోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్‌ను గుర్తించారు.
కారులో ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన చేతన్ మధుకర్ మెప్రామ్, ఆకాశ్ అశోక్ గవాండే, అస్సాంలోని మారిగావ్‌కు చెందిన ముజుమాల్ హక్, హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన ఉపద్రష్ట రమణమూర్తిని అరెస్టు చేశారు. వారిని విచారించగా కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్‌లో మెఫెడ్రోన్ తయారుచేసినట్లు అంగీకరించారు. డ్రగ్స్‌ను కొండమడుగు నుంచి నాగపూర్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
అనంతరం పోలీసులు వేటుకూరి ల్యాబ్‌కు వెâళ్లి తనిఖీలు చేశారు. పట్టుబడిన డ్రగ్స్‌తోపాటు ల్యాబ్‌లో డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్న రియాక్టర్, సెంట్రీఫ్యూజ్, ఇతర పరికరాలు, 6 సెల్‌ఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నాగపూర్‌కు చెందిన చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా, హైదరాబాద్ మేడిపల్లికి చెందిన ల్యాబ్ యాజమాని వేటుకూరి రామరాజును పట్టుకునేందుకు పోలీస్ బృందాలను నియమించినట్లు చెప్పారు.


