నేరాల స్వరూపం మారుతోంది | DGP CV Anand at a media conference | Sakshi
Sakshi News home page

నేరాల స్వరూపం మారుతోంది

Aug 10 2026 4:21 AM | Updated on Aug 10 2026 4:21 AM

DGP CV Anand at a media conference

మావోయిజం ముగిసింది.. ఇక డ్రగ్స్, సైబర్, ఆర్థిక నేరాలే సమస్య 

మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌ 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఒకప్పుడు నక్సలైట్ల కదలికలు, కూంబింగ్‌ ఆపరేషన్లతో పోలీసులకు సవాల్‌గా ఉన్న తెలంగాణలో ఇప్పుడు నేరాల స్వరూపం పూర్తిగా మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. మావోయిజం పూర్తిగా అంతరించిన నేపథ్యంలో డ్రగ్స్, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఆర్థిక నేరాలే కొత్త సవాళ్లుగా మారాయని చెప్పారు. టీ–ఈగల్‌ ఫోర్స్, సీసీటీఎన్, ట్రాఫిక్, సీఐడీ, సైబర్‌ క్రైం తదితర విభాగాలకు చెందిన అధికారులతో కలిసి బృందంగా జిల్లాల పర్యటన చేస్తున్నామన్న ఆయన.. డ్రగ్స్, ఆర్థిక నేరగాళ్లపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 

ఆదివారం వరంగల్‌ నిట్‌లో అధికారులతో సమీక్షించిన అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సైబర్‌ నేరాల బారినపడి ప్రజలు సుమారు రూ.1,750 కోట్లు నష్టపోయారని చెప్పారు. అయితే ఈ తరహా నేరాల అదుపులో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. పట్టణాలకే పరిమితమైన మత్తు పదార్థాలు ఇప్పుడు గ్రామాలకూ చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్‌ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని, విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ తీసుకునే వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 

నక్సల్‌ బాధిత కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ‘టీజీ వీర్‌’అప్లికేషన్‌ ప్రారంభించామని చెప్పారు. మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకంగా ఉండేవారని డీజీపీ పేర్కొన్నారు. వారు ఉన్న సమయంలో గంజాయి సరఫరా చేసేందుకు ఎవరూ ధైర్యం చేసేవారు కాదని తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించి, మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడినట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక బ్యూరోను తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. 

భద్రత తగ్గింపుపై రాజకీయం వద్దు..  
నక్సల్స్‌ సమస్య ఉన్న సమయంలో రాజకీయ నేతలకు భద్రత కల్పించామని, ఇప్పుడు ఆ అవసరం తగ్గిన నేపథ్యంలో భద్రతను సమీక్షిస్తున్నామని డీజీపీ ఆనంద్‌ చెప్పారు. కొందరికి భద్రత తగ్గించామని, దీనిని రాజకీయ కోణంలో చూస్తూ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌ మూడు వాహనాలకు తగ్గించుకున్నారని, తాను కూడా తన భద్రతను తగ్గించుకున్నానని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఎన్‌.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్‌ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement