మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో నిర్వహణ.. పాల్గొననున్న సీఎం రేవంత్
108 మంది రుత్వికులతో ప్రత్యేక క్రతువు
11 హోమగుండాలతో విజయవిహార్‌లో వైదిక కార్యక్రమం
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ /హైదరాబాద్: రాష్ట్రంతోపాటు కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సోమవారం నాగార్జునసాగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం వరుణయాగం నిర్వహించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనుండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఈ యాగంలో పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదులకు స్థిరమైన ప్రవాహాలు రావాలని, జలాశయాలు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, వ్యవసాయానికి సమృద్ధిగా నీరు అందాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితులు, ఆలయ సిద్ధాంతితో సంప్రదింపుల అనంతరం ఆగస్టు 10న వరుణయాగం నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు.
నాగార్జునసాగర్‌లోని పర్యాటక శాఖ అతిథి గృహం విజయవిహార్ ప్రాంగణంలో 11 హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు. 108 మంది రుత్వికులు, అర్చకులు, వేదపండితులు రోజంతా ప్రత్యేక వైదిక క్రతువులు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.45 గంటలకు సాగర్ హిల్‌కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి విజయవిహార్ ప్రాంగణంలో యాగం జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సాగర్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. విజయవిహార్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్, యాగశాల, వేదిక తదితర ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, నీటిపారుదల తదితర శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు.


