సర్‌.. నేడే ఆఖరు | SIR-2026 list will become crucial for citizens in the future | Sakshi
Sakshi News home page

సర్‌.. నేడే ఆఖరు

Aug 10 2026 2:17 AM | Updated on Aug 10 2026 2:17 AM

SIR-2026 list will become crucial for citizens in the future

రాత్రి 12 గంటల వరకు ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకోవాలని బీఎల్‌ఓలకు ఆదేశం

ఫారం ఇవ్వకుంటే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు తొలగింపు 

భవిష్యత్తులో పౌరులకు కీలకంగా మారనున్న సర్‌–2026 జాబితా   

తుది జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్తులో చిక్కులు 

మళ్లీ కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలంటే తిప్పలు

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 కార్యక్రమంలో భాగంగా మీ ఎన్యూమరేషన్‌ ఫారాన్ని పూరించి మీ ప్రాంత బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)కి ఇంకా సమర్పించలేదా? అయితే త్వరపడండి. పూరించిన ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్‌ఓలకు సమర్పించడానికి గడువు నేటితోనే ముగియనుంది. ఫారం ఇవ్వకుంటే ఈ నెల 17న ప్రచురించనున్న సర్‌ ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరును తొలగించనున్నారు. ఒకవేళ ముసాయిదా జాబితాలో పేరు తొలగిస్తే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోక తప్పదు. దీనికితోడు సర్‌–2002 ఓటర్ల జాబితాలో ఉన్న మీ ఓటు లేదా మీ బంధువుల ఓట్ల వివరాలను స్వీయధ్రువీకరణ ఫారంలో నింపి ఇవ్వాల్సి ఉంటుంది. సర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుతోపాటు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 

ఈ వ్యవధిలో ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారికి ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(ఈఆర్వో) నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. విచారణకు హాజరై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని పుట్టిన తేదీ, నివాస చిరునామాగా చూపించాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులను తప్పించుకోవాలంటే నేడు (సోమవారం) మీ ఎన్యూమరేషన్‌ ఫారాన్ని పూరించి మీ ప్రాంత బీఎల్‌ఓకు అప్పగించాలి. భవిష్యత్తులో సర్‌–2026 ఓటర్ల జాబితా పౌరులకు కీలక ఆధారంగా మారనుంది. అక్టోబర్‌ 19న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో పేరు రాకుంటే భవిష్యత్తులో చిక్కులు ఎదురయ్యే అవకాశ ఉంది.  

ఆదివారం 19వేల ఫారాలే దరఖాస్తు 
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 2,64,30,494 మంది (78.14 శాతం) ఓటర్లు తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించారు. ఆదివారం 19,376 మంది మాత్రమే ఫారాలు సమర్పించారు. చివరి రోజు సోమవారం రాత్రి 12 గంటల వరకు ఫారాలు తీసుకోవాలని బీఎల్‌ఓలకు ఆదేశించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఫారాలు సమర్పించడానికి గడువు ముగియనుంది. ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకున్న వారిలో ఇంకా 4,88,532 మంది ఓటర్లు వాటిని పూరించి బీఎల్‌ఓలకు సమర్పించాల్సి ఉంది. ఫారాలు తీసుకోని వారిని సైతం పరిగణలోకి తీసుకుంటే మొత్తం 73,95,954 మంది (21.86 శాతం) ఓటర్లు ఇంకా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించలేదు.  

వరుస సెలవులతో ఇబ్బందులు  
రెండో శనివారం, ఆదివారం, సోమవారం (బోనాలు) వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌ఓలు తమ విధులకు డుమ్మాకొట్టారని రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. బోనాలు, రంగం సందర్భంగా 9, 10వ తేదీల్లో ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకోబోమని బీఎల్‌ఓలు చెప్పినట్టు తమకు అనేక ఫిర్యాదులు అందాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆదివారం ‘ఎక్స్‌’లో ఆరోపించారు. ‘సర్‌’ షెడ్యూల్‌ ప్రకారం 10వ తేదీ వరకు ఫారాలు స్వీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement