బోనమెత్తిన పాతబస్తీ | Laldarwaja Bonalu is a feast for the eyes in Telangana | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన పాతబస్తీ

Aug 10 2026 1:40 AM | Updated on Aug 10 2026 1:40 AM

Laldarwaja Bonalu is a feast for the eyes in Telangana

ఆదివారం హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి తరలివచ్చిన భక్తజనం

కన్నుల పండువగా లాల్‌దర్వాజా బోనాలు

మొదటి బోనం సమర్పించిన దేవేందర్‌ గౌడ్‌ కుటుంబం 

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్,పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ 

బంగారు బోనమెత్తిన కొండా సురేఖ.. అలరించిన పోతరాజులు

చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం కనుల పండువగా కొనసాగాయి. మహిళా భక్తులు సంప్రదాయ వ్రస్తధారణతో బోనాలను తీసుకురాగా....యువకులు పోతరాజు వేషధారణలో భక్తులను విశేషంగా అలరించారు. శివసత్తుల చిందులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. జోగినీలు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు మాజీ మంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ తనయుడు వీరేందర్‌ గౌడ్‌ దంపతులు అమ్మవారికి దేవి మహాభిషేకాన్ని నిర్వహించి మొదటి బోనం సమర్పించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం వరకు కొనసాగింది. బోనాలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌లు పట్టు వ్రస్తాలు సమర్పించగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు ఎం.అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎంపీలు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, దానం నాగేందర్, పైడి రాకేష్‌ రెడ్డి, రాజ్‌ ఠాకూర్, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ ముదిరాజ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక ఆల, సినీ నటులు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, బేబి సినిమా ఫేం వైష్ణవి చైతన్య, దర్శకుడు వంగ సందీప్‌ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గద్వాల విజయ లక్ష్మీ, బీసీ కమిషన్‌ సలహాదారుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీలు అంజన్‌ కుమార్‌ యాదవ్, తలసాని సాయికిరణ్‌ యాదవ్, నగర పోలీస్‌ కమిషనర్‌ వీ.సీ.సజ్జనార్‌ తదితరులు అమ్మవారిని దర్ళించుకున్నారు. 

అరకొర నిధులు కేటాయించారు 
రాష్ట్ర జనాభాలో 80 శాతం ఉన్న హిందువుల పండుగలకు ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడం దుర్మార్గం. హిందువులంతా జాగృతమై సంఘటిత శక్తిగా మారి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ప్రశ్నించాలి. 2029లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అప్పుడు లాల్‌దర్వాజా బోనాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తాం.ఆలయాన్ని రూ.20 కోట్లతో అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్‌ మాట నిలబెట్టుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్‌కూడా హిందువులను విస్మరిస్తోంది.  
–బండి సంజయ్, కేంద్ర మంత్రి 

అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు  
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా, పాడిపంటలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించా. బోనాల జాతరకు విచ్చేసే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర ప్రభుత్వంపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించా. 
–పొన్నం ప్రభాకర్, రవాణ శాఖ మంత్రి 

అందరినీ చల్లగా చూడాలి 
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతిబింబంగా నిలుస్తుంది. అందరిని చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నా. ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా బోనాలు జరుపుకునేలా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాటు చేశాం.  
–కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి 

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి 
ఎంతో భక్తి శ్రద్దల నడుమ బోనాలు నిర్వహిస్తున్న భక్తులందరికి పండుగ శుభాకాంక్షలు. తెల్లవారుఝాము నుంచే మహిళా భక్తులు బారులు తీరి అమ్మవారికి బోనాలు సమర్పించడం హర్షణీయం. అమ్మవారి దయతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలి.  
– కేటీఆర్, మాజీ మంత్రి. 

అమ్మవారి దయతోనే వర్షాలు 
అమ్మవారి దయతోనే ఎలినెనో ఎఫెక్ట్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుల, మతాలకతీతంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నా. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పాలనలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు కొనసాగుతుండడం హర్షణీయం. 
– బొమ్మ మహేష్‌ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement