పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న కేసీఆర్
నల్లబెల్లిలో సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మకు హాజరైన కేసీఆర్
ఆత్మీయుడి కుటుంబాన్ని ఓదార్చుతూ భావోద్వేగానికి గురైన మాజీ సీఎం
సాక్షి, వరంగల్: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆత్మీయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి వరంగల్ జిల్లా నల్లబెల్లికి మధ్యాహ్నం 3.50 గంటలకు వచ్చారు. తొలుత పెద్ది చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పెద్ది భార్య స్వప్న, పిల్లలు, తల్లి అమృతమ్మ, అన్నదమ్ములు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. పిల్లలను అక్కున చేర్చుకుని కాసేపు దుఃఖించారు. విషణ్ణ వదనంతో మౌనంగా ఉండిపోయారు. పెద్ది కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ‘పెద్ది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎలాంటి ఆందోళన చెందొద్దు. ధైర్యం కోల్పోవద్దు. కుటుంబానికి పెద్దదిక్కుగా నేనున్నా. పార్టీ అండగా ఉంటుంది’అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తల్లి అమృతమ్మ, భార్య స్వప్నకు ధైర్యం చెప్పిన ఆయన... పిల్లలు బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు.
ఉద్యమ సహచరుడిని తలచుకొని..
తెలంగాణ ఉద్యమం..బీఆర్‌ఎస్ పార్టీ నిర్మాణంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పోషించిన కీలక పాత్రను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పెద్ది చేసిన కృషిని, తనతో ఆయనకున్న సుదీర్ఘ ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో, కల్మషం లేని హృదయంతో అందరితో కలిసిపోయే పెద్ది ఇక లేరనే బాధతో కేసీఆర్ కొద్దిసేపు మాటలు రాక మౌనంగా ఉండిపోయారు. పరిస్థితిని గమనించిన పార్టీ ముఖ్య నేతలు ఆయన్ను అనునయించడంతో కొంత తేరుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమారుడు నిదర్శన్‌రెడ్డి, కుమార్తె ధరి్మష్ఠకు రూ.కోటి చొప్పున రూ.2 కోట్ల చెక్కులు, పెద్ది తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చెక్కును అందించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.


