ఏఐ రాకతో మారబోతున్న శ్రామిక శక్తి స్వరూపం
సాంకేతిక మార్పులతో పెరుగుతున్న అవకాశాలు
అభ్యర్థుల్లో ప్రత్యేక నైపుణ్యాలకే కంపెనీల ప్రాధాన్యం
ఉద్యోగాల సృష్టిలో ఆసియాలోనే టాప్‌లో భారత్
ఐటీలో కొత్త చర్చకు దారితీసిన నొమురా నివేదిక
ఉత్పాదకతను పెంచుకుంటేనే ఉద్యోగులకు ఉన్నతస్థాయి ప్రాజెక్టులు లభిస్తాయంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కోల్పోతున్న ఉద్యోగాల కంటే కొత్తగా పుట్టుకొస్తున్న ఉద్యోగాల సంఖ్యే భారత్‌లో చాలా ఎక్కువగా ఉంది. ఆసియాలో ఉపాధి పరిణామాలను విశ్లేషిస్తూ అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన సంస్థ నొమురా రూపొందించిన తాజా నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి ఒక ఉద్యోగం నష్టపోతుంటే, దానికి బదులుగా 2.6 కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను కొల్లగొడుతుందనే ఆందోళనల నడుమ ఈ రిపోర్ట్ రావడం దేశీయ ఐటీ రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది. నొమురా ఆర్థిక నిపుణులు సోనాల్‌వర్మ, సీఇంగ్‌టో నేతృత్వంలో ఆసియాలో 2002 నుంచి 2026 ఆగస్ట్ వరకు ఉపాధి మార్పులపై సుదీర్ఘ అధ్యయనం సాగింది. ఈ పరిశోధన ప్రకారం భారత్‌లో సాంకేతిక మార్పుల కారణంగా 31,921 మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇదే సమయంలో కొత్తగా 83,100 మందికి ఏఐ, అనుబంధ రంగాల్లో నియామకాలు జరిగాయి. అంటే నికరంగా దాదాపు 51,000 పైగా అదనపు ఉపాధి అవకాశాలు లభించాయి. ఆసియాలో ఈ సాంకేతికత ఆధారిత నియామకాలు, ఉద్యోగాల తొలగింపుల్లో భారతదేశమే అత్యధిక వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.
భారత్ ప్రధాన కేంద్రం..
ప్రపంచవ్యాప్త దిగ్గజ సంస్థలకు భారత్ ఒక ప్రధాన సేవా కేంద్రంగా (గ్లోబల్ బ్యాక్ ఆఫీస్) విరాజిల్లుతోంది. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ కేర్ సేవలు వంటి నిర్వహణ పనుల కోసం ఇక్కడి అపారమైన మానవ వనరులపై అంతర్జాతీయ సంస్థలు ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధస్సు ప్రభావం కూడా ఇక్కడే అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ఉపాధి మార్పులను అధ్యయనం చేయడానికి భారత్‌ను ప్రధాన కేంద్రంగా నొమురా అభివర్ణించింది.
సవాల్‌గా నైపుణ్యాల కొరత..
ఉపాధి సంఖ్య పెరిగినా, పాత ఉద్యోగాలు కోల్పోతున్న వారే కొత్త ఉద్యోగాలను పొందుతున్నారా అంటే లేదనే సమాధానం వస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది స్థానంలో స్వయంచాలక చాట్‌బాట్‌లు వచ్చి చేరుతున్నాయి. దీనివల్ల సాధారణ సేవల సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. మరోవైపు ఐటీ కంపెనీలు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని నిర్వహించడానికి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం గల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. దీనివల్ల మార్కెట్‌లో నైపుణ్యాల మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడుతోంది.
కొత్త గ్రాడ్యుయేట్లపై ప్రభావం..
సాధారణంగా కళాశాల విద్య పూర్తి చేసుకొని వచ్చే యువతకు ప్రారంభంలో సాధారణ కంపెనీ నిర్వహణ పనులు నేర్చుకుంటూ పైస్థాయికి ఎదిగే అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు నియామకాల శైలిని పూర్తిగా మార్చేశాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత శిక్షణ ఇవ్వడం కంటే ముందే ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుండగా, కింది స్థాయి ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
భవిష్యత్ మార్గం ఏమిటి?
ఈ మార్పులు కేవలం ఉద్యోగాల తొలగింపునకు సంకేతం కాదు. ఉపాధి అవసరాల వేగవంతమైన పునర్నిర్మాణాన్ని ఇవి సూచిస్తున్నాయి. ఏఐ విప్లవంలో భారతీయులు తమ ఉత్పాదకతను పెంచుకుంటే, అంతర్జాతీయ మార్కెట్లో మరిన్ని ఉన్నత స్థాయి ప్రాజెక్టులను దక్కించుకునే అవకాశం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా శ్రామిక శక్తినంతటినీ నూతన సాంకేతిక రంగాల వైపు మళ్లించడం, వారికి తగిన శిక్షణ అందించడమే ప్రస్తుతమున్న అతిపెద్ద సవాల్.
1. అత్యధిక డిమాండ్ ఉన్న ప్రధాన రంగాలు..
– ఏఐ
– మెషీన్ లెర్నింగ్
– డేటా అనలిటిక్స్
– సైబర్ సెక్యూరిటీ
– క్లౌడ్ కంప్యూటింగ్
2. నైపుణ్యాలను ఇలా పెంపొందించుకోవాలి..
– పైథాన్, జావా స్క్రిప్ట్ వంటివి నేర్చుకోవడం ఏఐ రంగంలోకి అడుగుపెట్టడానికి తొలి అడుగు.
– అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యా వేదికల ద్వారా తాజా సాంకేతిక కోర్సులు పూర్తి చేసి ధృవీకరణ పత్రాలు సాధించాలి.
– లైవ్ ప్రాజెక్టులు చేయడం, ఉచిత కోడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో భాగస్వామ్యం కావాలి.
– సాంకేతిక నైపుణ్యాలతో పాటు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి, ఇతరులతో కలిసి పనిచేసే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి.


