అబ్బురపరుస్తున్న ఘటన.. నడిరోడ్డుపై గిఫ్ట్‌, చిన్నారుల కేరింతలు | Man Spots Excited Schoolchildren On Bus Surprises Them | Sakshi
Sakshi News home page

అబ్బురపరుస్తున్న ఘటన.. నడిరోడ్డుపై గిఫ్ట్‌, చిన్నారుల కేరింతలు

Aug 9 2026 3:10 PM | Updated on Aug 9 2026 3:10 PM

 Man Spots Excited Schoolchildren On Bus Surprises Them

స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారుల ఉత్సాహాన్ని గమనించిన ఓ లంబోర్ఘిని యజమాని వారికి ఊహించని విధంగా ఆనందాన్ని పంచాడు. రెండు లగ్జరీ కార్లను దగ్గరగా చూసే అవకాశం ఇవ్వడమే కాకుండా, వాటిని పరిశీలించేలా, డ్రైవర్ సీట్లో కూర్చునేలా, ఫొటోలు దిగేలా చేసి ఆ క్షణాన్ని మరపురాని అనుభూతిగా మార్చాడు.

ఈ వీడియోను రాకేశ్‌ కుమార్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. వీడియోలో కుమార్ తన నలుపు రంగు లంబోర్ఘిని నడుపుతుండగా, స్కూల్ బస్సులో ఉన్న చిన్నారులు కిటికీల్లోంచి అతని కారును చూస్తూ ఆనందంగా కేరింతలు కొడుతున్నట్టు కనిపించింది.

వారి ఉత్సాహాన్ని చూసిన కుమార్.. బస్సు పక్కనే కారు నడుపుతూ కిటికీ అద్దాన్ని కిందకు దించి వారికి చేతులు ఊపాడు. ఆ తర్వాత సూపర్‌కార్‌ను దగ్గరగా చూసేలా తాను కారును ఆపేందుకు అనువైన చోటుకు దారి చూపాలని సరదాగా విద్యార్థులను కోరాడు.

కారు ఆపిన తర్వాత కుమార్ స్కూల్ బస్సులోకి ఎక్కి చిన్నారులతో మాట్లాడాడు. తన కారు ఏదో గుర్తుపట్టగలరా అని అడగగా, అది లంబోర్ఘినినని విద్యార్థులు ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బస్సు నుంచి దిగివచ్చి కారును దగ్గరగా చూడాలని వారిని ఆహ్వానించాడు. చిన్నారులు కారును తాకుతూ, లోపల పరిశీలిస్తూ, ఒక్కొక్కరిగా డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అలాగే కారుతో ఫొటోలు కూడా దిగారు.

ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలని భావించిన కుమార్, తన ఫోన్‌లో “పప్పు డ్రైవర్” పేరుతో సేవ్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి మరో లగ్జరీ కారును అక్కడికి తీసుకురావాలని కోరాడు. కొద్దిసేపటి తర్వాత ఎరుపు రంగు సూపర్‌కార్ అక్కడికి చేరుకుని, నలుపు రంగు లంబోర్ఘిని, పసుపు రంగు స్కూల్ బస్సు పక్కనే ఆగింది. రెండు సూపర్‌కార్లను చూసిన చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. వారు కేరింతలు కొడుతూ, డ్యాన్స్ చేస్తూ, కార్ల చుట్టూ చేరి మరిన్ని ఫొటోలు దిగారు.

వీడియోను పంచుకుంటూ కుమార్.. కొంతమంది పిల్లలు కార్ల గురించి కలలు కంటారని, తాను కూడా అలాంటి వారిలో ఒకడినని రాశాడు. బస్సు నిండా ఉన్న చిన్నారులకు ఆ కలను అనుభవించే అవకాశం ఇచ్చానని తెలిపాడు. అక్కడ రెండు సూపర్‌కార్లు, ఎన్నో చిరునవ్వులు, చిన్ననాటి కలను నెరవేర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడని పేర్కొన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement