అజేయ శతకం సాధించిన బ్యాటర్
రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ
భారత్ తొలి ఇన్నింగ్స్ 357/6
ఎస్‌ఎల్‌సీ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (164 బంతుల్లో 142 నాటౌట్; 18 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా సాయి సుదర్శన్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి తప్పుకోగా... తుది జట్టులో అతడి స్థానంలో పడిక్కల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో శనివారం రెండో రోజు ఆట ముగిస సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
పడిక్కల్ భారీ శతకంతో కదం తొక్కగా... రవీంద్ర జడేజా (117 బంతుల్లో 63; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. గిల్ స్థానంలో ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ (40; 5 ఫోర్లు, 1 సిక్స్), మానవ్ సుతార్ (41; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో గుర్‌నూర్ బ్రార్ (18 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐదు బంతుల వ్యవధిలో నాలుగు సిక్స్‌లు కొట్టడం విశేషం. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్, అసాంక మనోజ్ చెరో రెండు వికెట్లు తీశారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... ఇరు జట్లు చెరో 45 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయనున్నాయి.

జైస్వాల్, పంత్ విఫలం...
ఓవర్‌నైట్ స్కోరు 363/8 వద్దే శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) రెండో బంతికే అవుటయ్యాడు. ఈ దశలో రాహుల్‌తో కలిసి పడిక్కల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ అవుట్ కాగా... నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చక్కటి డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
ప్రత్యర్థి బౌలర్లు ఎంత ప్రయత్నించినా పడిక్కల్, జడ్డూ జోడీని విడదీయలేకపోయారు. హాఫ్ సెంచరీ అనంతరం జడేజా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా... రిషభ్ పంత్ (2) విఫలమయ్యాడు. ధ్రువ్ జురేల్ (1) కూడా త్వరగానే అవుట్ కాగా... మానవ్ సుతార్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పడిక్కల్ పకడ్బందీ డిఫెన్స్, పక్కా టైమింగ్‌తో షాట్‌లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
సుదర్శన్ అవుట్
ఈ నెల 15 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యాడు. జట్టు ఎంపిక సమయంలోనే బుమ్రా, సుదర్శన్ ఫిట్‌నెస్ సాధిస్తేనే సిరీస్‌లో ఆడించనున్నట్లు సెలక్టర్లు ప్రకటించగా... ఇప్పుడు ఆ ఇద్దరూ జట్టుకు దూరమయ్యారు. గత నెల భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో ఆడుతున్న సమయంలో సుదర్శన్ కాలి వేలికి గాయమైంది. అప్పటి నుంచి సుదర్శన్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)లో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు.
‘సుదర్శన్ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్య బృందం తెలిపింది’ అని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆంధ్ర ఆటగాడు రషీద్ ఖాన్, మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరిని భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది.


