PC: BCCI X
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కొలంబో వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో లంక బౌలర్ విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో.. దిలుమ్ సుదీరకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
ఈ నేపథ్యంలో లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో జైసూ వైఫల్యం మరోసారి బయటపడింది. తన టెస్టు కెరీర్‌లో జైస్వాల్ ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడి 2535 పరుగులు సాధించి మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి.
కేవలం 200 పరుగులు
అయితే, ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో జైస్వాల్ ముందు నుంచే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో లెఫ్టార్మ్ సీమర్ల బౌలింగ్‌లో జైసూ కేవలం 200 పరుగులు చేసి.. తొమ్మిది సందర్భాల్లో అవుటయ్యాడు. సగటు 22.2గా ఉంది. రైటార్మ్ సీమర్ల బౌలింగ్‌లో మాత్రం జైసూ సగటున 42 పరుగులతో ఏకంగా 1184 పరుగులు రాబట్టాడు.
నిజానికి లెఫ్టార్మ్ పేసర్ల యాంగిల్ కారణంగా రైటార్మ్ బ్యాటర్లు ఇబ్బంది పడతారు. కానీ లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూ ఇలా వీరి బౌలింగ్‌లో ఇబ్బంది పడటం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే అని విశ్లేషకులు అంటున్నారు.
వారి బౌలింగ్‌లో మరీ కష్టం
కాగా లెఫ్టార్మ్ సీమర్లలో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జైసూ 133 పరుగులు చేసి.. మూడు సార్లు అవుటయ్యాడు. సగటు 44.3. అయితే, సౌతాఫ్రికా స్టార్లు మార్కో యాన్సన్, నండ్రీ బర్గర్ మాత్రం జైసూను మరింత ఇబ్బంది పెట్టారు. యాన్సెన్ బౌలింగ్‌లో జైసూ 42 పరుగులు చేసి మూడుసార్లు అవుట్ కాగా.. బర్గర్ బౌలింగ్‌లో కేవలం 21 పరుగులే చేసి మూడుసార్లు పెవిలియన్ చేరాడు.
కేవలం టెస్టుల్లోనే కాదు టీ20 ఫార్మాట్లోనూ జైస్వాల్ లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటికి వారి బౌలింగ్‌లో 135 పరుగులు చేసి ఐదుసార్లు అవుటయ్యాడు.
నెట్స్‌లో గంట ప్రాక్టీస్
కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూకు లెఫ్టార్మ్ పేసర్ వేసే బంతి భిన్నమైన కోణంలో వస్తుంది. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన మూమెంట్ మీదే అతడు ఎలాంటి షాట్ ఆడాలన్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
ఏదేమైనా జైస్వాల్ మరోసారి లెప్టార్మ్ పేసర్ చేతికి దొరికిపోయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో డకౌట్ అయిన వెంటనే నెట్స్‌లో తిరిగి ప్రాక్టీస్‌కు వెళ్లిన 24 ఏళ్ల జైస్వాల్.. గంటపాటు అక్కడే శ్రమించినట్లు తెలుస్తోంది.
చదవండి: పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు


