ఇంగ్లండ్‌కు చెందిన 33 ఏళ్ల జేక్ లిబ్బీ అనే అనామక బ్యాటర్ బ్యాటింగ్ దిగ్గజమైన విరాట్ కోహ్లి, టీమిండియా బ్యాటింగ్ సంచలనం రుతురాజ్ గైక్వాడ్ రికార్డులను బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్ల జాబితాలో వీరిద్దరిని అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు వోర్సెస్టర్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించే లిబ్బీ.. వన్డే కప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించి, లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు
జేక్ లిబ్బీ- 61.4 (18 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు, 2456 పరుగులు)
రుతురాజ్ గైక్వాడ్- 58.61 (20, 21, 5334)
సామ్ హెయిన్- 58.18 (18, 10, 3084)
మైకేల్ బెవాన్- 57.86 (116, 13, 15103)
విరాట్ కోహ్లి- 57.8 (88, 59, 16591)
లిబ్బీ తాజా సెంచరీ విషయానికొస్తే.. సర్రేపై 334 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన లిబ్బీ, 96 బంతుల్లో అజేయమైన 109 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఈ సెంచరీతో లిబ్బీ లిస్ట్-ఏ సగటు ఏకంగా 61.40కి చేరింది. లిస్ట్-ఏ చరిత్రలో కనీసం 2400 పరుగులు చేసిన బ్యాటర్లలో 60 సగటు దాటిన తొలి బ్యాటర్‌గానూ లిబ్బీ చరిత్ర సృష్టించాడు.
వరుసగా మూడు సెంచరీలు
లిబ్బీ ప్రస్తుతం జరుగుతున్న వన్డే కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సర్రేపై 109 పరుగులతో పాటు అంతకుముందు ససెక్స్, మిడిల్సెక్స్, ఎసెక్స్‌పై కూడా సెంచరీలు సాధించాడు. వన్డే కప్‌లో లిబ్బీ ఇప్పటివరకు ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలతో, 91.50 సగటున, 366 పరుగులు చేశాడు. తాజా ప్రదర్శనలతో లిబ్బీ ఇంగ్లండ్ వన్డే జట్టులోకి వస్తాడేమే చూడాలి.


