ఇంగ్లండ్ లయన్స్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వైదొలిగాడు. బిగ్ బాష్ లీగ్‌లోని 'సిడ్నీ థండర్' జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడంతో ఫ్లింటాఫ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సెప్టెంబర్ 2024లో లయన్స్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఫ్లింటాప్.. దాదాపు రెండేళ్ల పాటు యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు.
"ఇంగ్లండ్ లయన్స్ హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగుతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. దేశంలోని యువ క్రికెటర్లతో పనిచేసే అవకాశం రావడం, వారు అత్యుత్తమ ఆటగాళ్లగా ఎదగడంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది.
నాకు అండగా నిలిచిన సపోర్ట్ స్టాఫ్‌కు, నాపై నమ్మకం ఉంచిన ఇంగ్లండ్ క్రికెట్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మేనెజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. త్వరలోనే సిడ్నీ థండర్‌తో నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ఫ్లింటాఫ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
'ఫ్రెడ్డీ' స్ధానంలో స్ధానంలో మైక్ యార్డీ లయన్స్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ కూడా ఇంగ్లండ్ సీనియర్ క్రికెట్ జట్టు వైపు దూసుకొస్తున్నాడు. రాకీ తండ్రి శిక్షణలోనే రాటుదేలాడు. యువ పేసర్ జోష్ హల్ ఇంగ్లండ్ సీనియర్ జట్టుకు ఎంపిక కావడంలో కూడా ఫ్లింటాఫ్‌ది కీలక పాత్ర.


