భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక విజ్ఞప్తి తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్‌లో ఇంటి స్థలం కోరుతూ శుక్రవారం అర్ధరాత్రి పుష్కర్ సింగ్‌ను ట్యాగ్ చేస్తూ పంత్ ట్వీట్ చేశాడు. అయితే రిషబ్ చేసిన ట్వీట్‌పై పుష్కర్ సింగ్ ధామీ సానుకూలంగా స్పందించారు. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.
"ప్రియమైన రిషభ్. నువ్వు ఉత్తరాఖండ్‌కు గర్వకారణం. నీ అద్భుతమైన ఆటతో దేవభూమికి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చావు. మాతృభూమిపై నీకున్న ప్రేమ, ఇక్కడికి వచ్చి సేవ చేయాలనే నీ సంకల్పం ఎంతో ప్రశంసనీయం. ఈ విషయం గురుంచి సంబంధిత అధికారులకు తెలియజేశాను. వారు త్వరలోనే నిన్ను సంప్రదించి నిబంధనలకు లోబడి మీకు సహకారం అందిస్తారు" అని ఆయన రిప్లే ఇచ్చారు.
కాగా ఆర్ధ రాత్రి 12.46 గంటలకు పోస్ట్‌లు పెట్టడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పోస్ట్‌లో ఉన్న వ్యాకరణ దోషాలు చూసి అభిమానులు మొదట్లో పంత్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందేమోనని అనుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్దేశిత ధరకే స్థలాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, గత మూడేళ్లుగా అనువైన స్థలం లభించక ఇబ్బంది పడుతున్నందునే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పంత్ మరో పోస్ట్‌లో స్పష్టం చేశాడు.
పంత్ ట్వీట్స్‌లో ఏముందంటే?
పుష్కర్ సింగ్ ధామీ సార్ ఎలా ఉన్నారు? ఉత్తరాఖండ్ స్థానికుడిగా నేను ఇక్కడికి తిరిగివచ్చేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ఇళ్లు కట్టుకునేందుకు అనువైన, విశాలమైన స్థలం దొరకడం లేదు. నా ఉత్తరాఖండ్ అంటే ఎంతో ఇష్టం.
ఈ భూసేకరణ విషయంలో దయచేసి నాకు సహాయం చేయండి. గతంలో రాష్ట్ర ప్రచారకర్తగా ఉన్నప్పుడు నాకు రావాల్సిన స్థలం కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ విషయం పక్కన పెడితే నాకు ఉత్తరాఖండ్‌కు వచ్చి నివాసముండాలని ఉంది.
మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా నాకు స్థలం దొరకడం లేదు. దయచేసి నాకు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఇప్పించండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ పంత్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
అయితే కాసేపటికే పంత్ మరో పోస్ట్ చేశాడు. "అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నందుకు ప్రభుత్వం తనకు ఆ స్థలాన్ని గిప్ట్ ఇస్తే బాగుంటుందని లేదా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేసేందుకు తను సిద్దంగా ఉన్నానని" తెలిపాడు.
చదవండి: బంగ్లాదేశ్‌కు తిరిగొస్తా.. కానీ వన్ కండీషన్: షకీబ్


