బ్రిడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి అఫ్గాన్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 47 ఓవర్లకు 47 ఓవర్లకు కుదించారు.
ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (84) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు సెదికుల్లా అటాల్(45)తో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఆ తర్వాత కెప్టెన్ రహమత్ షా(30), ఆజ్మతుల్లా ఒమర్‌జాయ్(33), హష్మతుల్లా షాహిదీ (36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐరీష్ బౌలర్లలో జై ముంద్రా, మార్క్ అడైర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు గావిన్, క్యాంఫ్‌హార్, హ్యారీ టెక్టర్ చెరో వికెట్ తీశారు.
రషీద్ స్పిన్ మ్యాజిక్
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతడి స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఐరీష్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఐర్లాండ్ పవర్‌ప్లేలో 65/1తో నిలిచినప్పటికి.. మిడిల్ ఓవర్లలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. రషీద్ దెబ్బకు ఆతిథ్య జట్టు టాపార్డర్ కుప్పకూలింది.
మొత్తంగా రషీద్ ఖాన్ 7.4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా ఐర్లాండ్ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది.
ఇరు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది. కాగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో అఫ్గానిస్తాన్ గెలిస్తే 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే సిరీస్ సమమవుతోంది.


