Photo Credit: X/@YorkshireCCC
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటాడు. దేశీ వన్డే కప్ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. యార్క్‌షైర్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో చివరగా వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు కుల్దీప్.
మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు
అయితే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఈ చైనామన్ స్పిన్నర్‌కు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనా ఒక్క వన్డేలోనూ ఆడించకుండా.. కుల్దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా లార్డ్స్‌లో చివరిదైన, నిర్ణయాత్మక మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ పార్ట్ టైమ్ స్పిన్నర్ల సేవల్ని ఉపయోగించుకుని గెలుపొంది.. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం పొందలేని కుల్దీప్ యాదవ్.. ఆ వెంటనే కౌంటీ ఫ్రాంఛైజీ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రాయల్ వన్డే కప్-2026లో భాగంగా శుక్రవారం గ్లామోర్గాన్‌తో యార్క్‌షైర్ తరఫున కుల్దీప్ అరంగేట్రం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు కుల్దీప్. మొత్తంగా పది ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మొదటి తొమ్మిది ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, తన ఆఖరి ఓవర్లో అలెక్స్ హోర్టాన్, జేమీ మెక్‌రాయ్ వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 39 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
యార్క్‌షైర్ విజయం
ఇక యార్క్‌షైర్‌కు చెందిన మీడియం పేసర్ బెంజమిన్ క్లిఫ్ కేవలం 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా గ్లామోర్గాన్ 186 పరుగులకే పరిమితం కాగా.. లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మరోవైపు.. నార్తాంప్టన్ తరఫున కెంట్ జట్టుపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కూడా రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించుకున్నాడు!


