భేష్‌.. గెలిచారు!.. మరి మీ ఐదో బౌలర్‌ ఎవరు? | Who was fifth: Shreyas Iyer Questioned Playing XI Call Vs ZIM 1st T20I | Sakshi
Sakshi News home page

భేష్‌.. గెలిచారు!.. మరి మీ ఐదో బౌలర్‌ ఎవరు?

Jul 24 2026 4:01 PM | Updated on Jul 24 2026 4:15 PM

Who was fifth: Shreyas Iyer Questioned Playing XI Call Vs ZIM 1st T20I

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఎట్టకేలకు విజయాల  ఖాతా తెరిచాడు. అతడి నాయకత్వంలో జింబాబ్వేతో తొలి టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఏడు మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ తొలిసారి గెలుపు రుచిచూశాడు.

హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా గురువారం నాటి టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే.. 125 పరుగులకే పరిమితమైంది.

ఏడు వికెట్ల తేడాతో
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ మూడు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినప్పటికీ తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరి మీ ఐదో బౌలర్‌ ఎవరు?
‘‘జట్టులో కేవలం నలుగురు బౌలర్లు.. పేసర్లు ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌, అశోక్‌ శర్మ.. స్పిన్నర్‌ రవి బిష్ణోయి మాత్రమే ఉన్నారు. మరి మీ ఐదో బౌలర్‌ ఎవరు?.. దీనికి జవాబు శివం దూబే అంటారేమో!.. మరి ఆరో బౌలర్‌?.. ఎవరూ లేరు.

ఆరో బౌలర్‌ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. నిజానికి శివం దూబే ఆల్‌రౌండర్‌ కదా!.. అతడు ఈసారి బంతితో కాస్త మెరుగ్గానే రాణించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. 

నిజంగా ఇది పెద్ద విషయమే
మంచి క్యాచ్‌ కూడా పట్టాడు. ఏదేమైనా నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేయించడం ద్వారా యాజమాన్యం అతడిపై పూర్తి విశ్వాసం కనబరిచింది. నిజంగా ఇది పెద్ద విషయమే.

సరైన నిర్ణయం
ఇక మయాంక్‌ యాదవ్‌తో బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించి కెప్టెన్‌ శ్రేయస్‌ మంచి పని చేశాడు. అశోక్‌ శర్మను కూడా ముందుగానే పంపించడం సరైన నిర్ణయం. ఏదేమైనా వీళ్లిద్దరిని జట్టులో చూడటం ఎంతో బాగుంది. ముఖ్యంగా మయాంక్‌ గాయం నుంచి కోలుకుని రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. నిలకడగా బౌలింగ్‌ చేశాడు’’ అని కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. 

కాగా యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్‌ చేతిలో 2-0, ఇంగ్లండ్‌ చేతిలో 4-0తో టీమిండియా వైట్‌వాష్‌ అయింది.

చదవండి: పిల్లాడినే.. నాకు ఆ అర్హత లేదు: వైభవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement