PC: BCCI X
దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు మయాంక్ యాదవ్. ఐపీఎల్‌లో సత్తా చాటిన ఈ ‘ఫాస్టెస్ట్’ బౌలర్.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత గాయాల కారణంగా కనుమరుగైపోయాడు. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భగా మయాంక్ రీఎంట్రీ ఇచ్చాడు.
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తొలి బంతికే జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను డకౌట్ చేసిన మయాంక్.. వన్‌డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను కూడా అవుట్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటాలో 24 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
Aate hi kaam shuru kar diye 🔥💪
Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026
గొప్పగా అనిపించింది
తద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘రెండేళ్లు జట్టుగా దూరంగా ఉండటం నా జీవితంలో అత్యంత కష్టకాలం. అప్పుడు నాకు 22-23 ఏళ్ల మధ్య వయసు. అంత చిన్నవయసులోనే గాయాల వల్ల సుదీర్ఘకాలం ఆటకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది.
అయితే, దేశానికి ఆడటం గొప్ప విషయం. అదే స్ఫూర్తిగా ముందుకు సాగి సవాళ్లను అధిగమించాను. జింబాబ్వేలో పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయని విన్నాను. నేను హరారేలో ఆడటం ఇదే మొదటిసారి. గొప్పగా అనిపించింది. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ
అదే విధంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై మయాంక్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడి కెప్టెన్సీలో ఆడటం ఇదే తొలిసారి. మ్యాచ్‌కు ముందు మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా!.. అయితే, మ్యాచ్ సమయంలో బౌలర్లపై అతడు పూర్తి నమ్మకం ఉంచాడు.
నాకు నచ్చినట్లుగా బౌలింగ్ చేయమని చెప్పాడు. అతడూ కొన్ని సలహాలు ఇచ్చాడు. సారథి ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు సాగాను. అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపించింది’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌తో 2024 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: నేనింకా పిల్లాడినే.. క్రెడిట్ నాకు ఇవ్వొద్దు: వైభవ్


