19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50
తొలి టి20లో జింబాబ్వేపై 7 వికెట్లతో గెలిచిన భారత్
రాణించిన మయాంక్, ప్రిన్స్
రేపు రెండో టి20
హరారే: టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఎట్టకేలకు ఈ ఫార్మాట్‌లో భారత్ మరో మ్యాచ్‌లో గెలుపు రుచి చూసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌లో ఆరు టి20ల్లో ఓడిన టీమిండియా ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో బోణీ చేసింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఇదే మొదటి విజయం. గురువారం జరిగిన తొలి టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
వెస్లీ మదెవెరె (34 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మరుమని (20 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ర్యాన్ బర్ల్ (35 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో జింబాబ్వే స్కోరు 64/5 కాగా...మదెవెరె, మరుమని ఆరో వికెట్‌కు 37 బంతుల్లో 58 పరుగులు చేసి ఆదుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ యాదవ్ (2/18), ప్రిన్స్ యాదవ్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు.
అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేయగా, రెండో టి20 శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది.
స్వల్ప స్కోరుకే...
దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన పేసర్ మయాంక్ ఘనంగా పునరాగమనం చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే బెన్నెట్ (0)ను అవుట్ చేసి జింబాబ్వే పతనానికి శ్రీకారం చుట్టాడు. మైయర్స్ (6) వికెట్ కూడా అతని ఖాతాలోకే చేరగా, ప్రిన్స్ తన తొలి ఓవర్లో బెన్ కరన్ (10) వికెట్ తీశాడు. పవర్‌ప్లేలో జింబాబ్వే స్కోరు 26/3కి చేరింది. కీలక బ్యాటర్ సికందర్ రజా (4)ను దూబే పెవిలియన్‌కు పంపగా, బర్ల్ వికెట్ బిష్ణోయ్‌కు దక్కింది. ఈ దశలో మదెవెరె, మరుమని పోరాటంతో స్కోరు 100 పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో జింబాబ్వే మరో 2 వికెట్లు చేజార్చుకుంది.
దూకుడైన బ్యాటింగ్...
అభిషేక్ శర్మ (1) ఆరంభలోనే వెనుదిరగ్గా... కెరీర్ తొలి 3 మ్యాచ్‌లలో విఫలమైన వైభవ్ ఈసారి తనపై ఉన్న అంచనాలకు తగినట్లుగా చెలరేగాడు. ఐదు నెలల క్రితం ఇదే మైదానంలో అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేసిన అతను స్వేచ్ఛగా ఆడాడు. ఎన్‌గరవా ఓవర్లో వరుసగా 6, 4, 6 కొట్టిన అతను, ఇవాన్స్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. ముజరబాని ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన వైభవ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తర్వాతి బంతికే అతను అవుటైనా... మరోవైపు కిషన్ కూడా ధాటిగా ఆడాడు. 62 బంతుల్లో జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. కిషన్ అవుటైనా... అయ్యర్, తిలక్ వర్మ (6 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు.
అశోక్ శర్మ@123
రాజస్తాన్ పేసర్ అశోక్ శర్మ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 123వ ప్లేయర్‌గా అతను నిలిచాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్ (154.2 కి.మీ.) వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే రోజు పుట్టిన పేసర్లు అశోక్, మయాంక్ (17/06/2002) ఈ మ్యాచ్‌లో తొలి బంతిని పంచుకోవడం విశేషం.
15 ఏళ్ల 118 రోజులు
అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
స్కోరు వివరాలు
జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి) ఇషాన్ (బి) మయాంక్ 0; బెన్ కరన్ (సి) వైభవ్ (బి) ప్రిన్స్ 10; మైయర్స్ (సి) దూబే (బి) మయాంక్ 6; రజా (సి) (సబ్) సూర్యాంశ్ (బి) దూబే 4; బర్ల్ (సి) తిలక్ (బి) బిష్ణోయ్ 26; మదెవెరె (రనౌట్) 39; మరుమని (నాటౌట్) 27; ఇవాన్స్ (సి) అయ్యర్ (బి) ప్రిన్స్ 0; న్యూమన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–20, 4–32, 5–64, 6–122, 7–122. బౌలింగ్: మయాంక్ యాదవ్ 4–0–18–2, అశోక్ శర్మ 4–0–29–0, ప్రిన్స్ యాదవ్ 4–0–19–2, శివమ్ దూబే 4–0–32–1, రవి బిష్ణోయ్ 4–0–24–1.
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఇవాన్స్ (బి) ముజరబాని 1; వైభవ్ (సి) బెన్ కరన్ (బి) ఎన్‌గరవా 50; ఇషాన్ కిషన్ (సి) మైయర్స్ (బి) ముజరబాని 35; అయ్యర్ (నాటౌట్) 28; తిలక్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (13.2 ఓవర్లలో 3 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–23, 2–68, 3–114. బౌలింగ్: ముజరబాని 4–0–26–2, ఎన్‌గరవా 2.2–0–30–1, ఇవాన్స్ 2–0–26–0, న్యూమన్ 2–0–30–0, రజా 3–0–14–0.


