PC: BCCI Twitter
టీ20ల్లో టీమిండియా ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్ధేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మెన్ ఇన్ బ్లూ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలో ఊదిపడేసింది.
యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో 50 పరుగులు సాధించి భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ కమ్‌బ్యాక్ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తన కెప్టెన్సీలో జట్టు తొలి విజయం సాధించడం సంతోషంగా ఉందని అయ్యర్ అన్నాడు.
"ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైనది. కెప్టెన్‌గా తొలి గెలుపును అందుకోవడం సంతోషాన్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అందరూ అద్భుతంగా రాణించారు. తొలుత మా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుందని నేను ముందే పసిగట్టాను.
అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. మయాంక్ యాదవ్ సంచలన స్పెల్ బౌలింగ్ చేశాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధరణ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి ఏ మాత్రం భయం లేదు.
వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా అత్యద్భుతం. హరారే పిచ్‌పై అతడికి బాగా అవగాహన ఉంది. ఇదే గ్రౌండ్‌లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు సాధించాడు. ఆ అనుభవమే ఈ మ్యాచ్‌లో అతడికి పనికొచ్చింది. రాబోయో రెండు మ్యాచ్‌లలో కూడా ఇదే జోరును కొనసాగించి సిరీస్ క్లీన్ చేస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు.


