Photo Credit: BCCI Twitter
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో బౌలర్లు రాణించగా, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీ సాధించడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయంలో తన పాత్రేమి లేదని, నిజానికి బౌలర్లే మ్యాచ్ విన్నర్లంటూ వైభవ్ పేర్కొన్నాడు. తానింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని.. గెలుపునకు అర్హుడిని కాదని వెల్లడించాడు.
మ్యాచ్ విజయం తర్వాత బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్పగా బ్యాటింగ్ చేయడానికే ప్రయత్నిస్తాను. జట్టు కోసం ఎప్పుడూ నా బెస్ట్ ఇచ్చేందుకే కష్టపడుతుంటా. జింబాబ్వేపై విజయంలో నేను క్రెడిట్ తీసుకోలేను. దానికి నేను అర్హుడిని కాను. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నా’ అని వైభవ్ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్‌లో ఫిఫ్టీ అనంతరం చేతి వేళ్లలో 'A' అక్షరం చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు. ''A' అనేది మా అమ్మ పేరులో (Aarti Suryavanshi) మొదటి అక్షరం. నా హాఫ్ సెంచరీ సెలబ్రేషన్‌ను అందుకే A సంకేతంతో చూపించాను. నా కెరీర్‌లో సాధించిన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీని నా కుటుంబానికి, కోచ్‌లతో పాటు నా జర్నీలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ ఇన్నింగ్స్‌ను అంకితమి స్తున్నా.' అని వెల్లడించాడు.
హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకు పరిమితమైంది. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ 19 బంతుల్లో ఫిఫ్టీ సాధించగా, ఇషాన్ కిషన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.
Read: అతడికి 2 నెలలే డెడ్‌లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు!


