Photo Credit: Twitter
అప్గానిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్వహణకు సిద్ధమైన ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ ఆడడం ఇంగ్లండ్‌కు ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం ఆఫ్గన్‌లో మహిళల పట్ల తాలిబన్ల ప్రవర్తన, లింగ వివక్ష అని తెలుస్తోంది.
2025 చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడినప్పుడు లండన్‌లో వివిధ పార్టీలకు చెందిన 160 మంది ఎంపీల బృందం ఈసీబీని తీవ్రంగా విమర్శించింది. అప్పటి నుంచి అఫ్గాన్‌తో క్రికెట్ ఆడేందుకు నిరాకరించిన ఇంగ్లండ్ కేవలం ఐసీసీ మేజర్ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతోంది.
తాజాగా తమ కనుసన్నల్లో ఉండే ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆఫ్గన్‌తో సిరీస్ నిర్వహణకు సిద్దమవ్వడం ఈసీబీకి కోపం తెప్పించింది. ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌తో భవిష్యత్తులో ఆడాల్సిన అంతర్జాతీయ మ్యాచ్‌లను ఐర్లాండ్ కోల్పోయే ప్రమాదముందని చెప్పొచ్చు. గతంలో స్వదేశంలో యాషెస్ సిరీస్ ఆడడానికి ముందు ఇంగ్లండ్ సన్నాహకంగా ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. 2019, 2023లో ఇది రిపీట్ అయింది.
అయితే 2027 యాషెస్ సిరీస్‌కు ముందు మాత్రం ఈసారి ఐర్లాండ్‌తో కాకుండా బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాలని ఈసీబీ నిర్ణయం తీసుకోవడం చూస్తే ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఏర్పడిన వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుతో (ఏసీబీ) సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోంది. గత 10 సంవత్సరాల్లో ఐర్లాండ్, ఆఫ్గన్‌ల మధ్య ఇది ఐదో సిరీస్ కావడం విశేషం.
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ నిర్వహించడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బిగ్-త్రీ (బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా)లో రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తీరును వ్యతిరేకిస్తున్న వేళ అది క్రమంగా ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.
చదవండి: తొలి టెస్టులో చోటు కష్టమే.. అందుకేనా బ్యాటింగ్ ప్రాక్టీస్!


