breaking news
Afghanistan Cricket Board (ACB)
-
పాక్‌తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఒక ప్రచార వీడియోను రూపొందించిది. ఆ వీడియోల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిట్ బాల్టిస్తాన్లను భారతదేశ సరిహద్దులో భాగంగా చూపించింది. ఈ వీడియోను ఏసీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది."మా దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ఉమ్మడి అభిరుచి కలిగిన రెండు దేశాలను ఏకం చేసే సిరీస్ ఇది. ఇవి కేవలం మ్యాచ్‌లు కాదు. స్వదేశంలోని లక్షలాది మంది ప్రజల ఆశలు, గర్వాన్ని మోసుకుంటూ ఆఫ్గన్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టనుంది."అని రాసుకొచ్చింది.ఇప్పటికే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా, తాజాగా ఆఫ్గన్ క్రికెట్ బోర్డు చేపట్టిన చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ మ్యాప్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలకు దిగలేదు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఈ విషయాన్ని లేవనెత్తేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.నిత్యం సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులతో సహా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ తాజా వివాదం తలెత్తింది. దేశంలో జరుగుతున్న ఘోరమైన దాడులకు కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తున్న తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)కు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. సాంస్కృతిక, క్రీడా వేదికలతో సహా సాఫ్ట్ పవర్ ద్వారా ఇటువంటి ఘర్షణలు మరింతగా వ్యక్తమయ్యే అవకాశం ఉందని భారత్ తెలిపింది. ఇక భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఈ నెల 13న, రెండో టీ20 15న, మూడో టీ20 17న జరగనున్నాయి.A series the nation has been eagerly awaiting. 🤩A series that will once again bring together two nations with deep-rooted history, culture, and a shared passion for the game.🤜🤛These are more than just matches. They are encounters of passion, excitement, and significance,… pic.twitter.com/Q8h7MYX1yf— Afghanistan Cricket Board (@ACBofficials) September 6, 2026Read: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్‌జోన్ కకావికలం -
IND vs AFG: ఊహించని షాకిచ్చిన అఫ్గానిస్తాన్!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సంచలన ప్రకటన జారీ చేసింది. భారత్‌లో టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌కు సంబంధించిన ప్రసార హక్కులను పాకిస్తాన్‌కు చెందిన సంస్థకు అప్పగించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిరీస్ నిర్వహణపై ముందుకు సాగుతుందా? లేదంటే నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా? అన్న చర్చ మొదలైంది.కాగా తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో సొంతంగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించే అవకాశం లేదు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్‌లో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అఫ్గాన్ బోర్డు ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే సెప్టెంబరులో భారత్ వేదికగా టీమిండియాకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియాతో సెప్టెంబరు 13-17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించిన మీడియా హక్కులను పాక్‌కు చెందిన టీజీ (ట్రాన్స్ గ్రూప్)నకు అప్పగించినట్లు అఫ్గాన్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.‘‘ఏసీబీ గ్లోబల్ మీడియా హక్కుల సిండికేషన్ భాగస్వామిగా టీజీ ఉంటుంది. టీపీటీ360 మీడియా ప్రొడక్షన్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఇండియాలో ఫ్యాన్ కోడ్ ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రసారం చేస్తుంది’’ అని అఫ్గాన్ బోర్డు తెలిపింది.కాగా ట్రాన్స్ గ్రూపునకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సత్సంబంధాలు ఉన్నాయి. పీసీబీ అంతర్జాతీయ మీడియా హక్కులు కలిగి ఉండటంతో పాటు.. ఆసియా, మధ్యప్రాచ్యంలో ఈ గ్రూపు మేజర్ ఈవెంట్లను ప్రసారం చేస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు కూడా ఈ సంస్థవే.ఈ నేపథ్యంలో బీసీసీఐ అఫ్గాన్ బోర్డు ప్రకటనపై ఎలా స్పందిస్తుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కాగా భారత్- పాక్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్-2026 మేజర్ టోర్నీల్లో ఇరుజట్ల ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోలేదు.మరోవైపు.. ఆసియా కప్ ఫైనల్లో పాక్‌ను ఓడించి భారత్ టైటిల్ గెలిచింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించగా.. నక్వీ ట్రోఫీని ఇప్పటికీ తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గాన్ జట్టు ఇటీవల భారత్‌లో పర్యటించింది. శుబ్‌మన్ గిల్ సేనతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడి ఓడిపోయి ఇంటిబాటపట్టింది.చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు -
భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌లో మార్పు!
సెప్టెంబర్‌లో భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీస్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఇటీవల ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ మూడు మ్యాచ్‌లు వచ్చే నెల 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయాలని బీసీసీఐని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యర్దించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పండగను పురస్కరించుకుని, ఆ రోజున ఒక టీ20 మ్యాచ్ నిర్వహించాలని ఏసీబీ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు పండగ సెలవు దినం కావడంతో మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆశిస్తోంది. ఈ ప్రతిపాదనకు భారత క్రికెట్ బోర్డు అంగీకరిస్తే.. సెప్టెంబర్ 13 లేదా 15న జరగాల్సిన మ్యాచ్‌లలో ఒకదానిని సెప్టెంబర్ 14కి మార్చనుంది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం ఇది అఫ్గానిస్తాన్‌కు హోమ్ సిరీస్ కావడం విశేషం. గతంలో అఫ్గాన్ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడినప్పటికి, టీమిండియాతో హోమ్ సిరీస్ ఆడడం మాత్రం ఇదే తొలిసారి. ఈ చారిత్రత్మక సిరీస్ ప్రసార హక్కులకు సంబంధించి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. సోనీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ వంటి ప్రముఖ ఛానళ్లతో ఏసీబీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్ -
IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అఫ్గానిస్తాన్ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యమిస్తుందని ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించింది.అఫ్గాన్ క్రికెట్‌కు అండగా ఉంటాముఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌లో టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆతిథ్యమివ్వడం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భారత్- అఫ్గానిస్తాన్ జట్ల మధ్య పోరు చాలా ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఇరుజట్లలోనూ మంచి నైపుణ్యాలున్న క్రికెటర్లు ఉన్నారు.అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో చాలా మందికి భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు. ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నాయి. 2018లో తొలిసారి బారత్ అఫ్గానిస్తాన్‌కు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చింది.చిరస్మరణీయంఅప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత పటిష్టంగా మారాయి. ఇటీవలే జూన్‌లో అఫ్గాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. ఇప్పుడు ఇరుజట్లు టీ20 సిరీస్‌లో తలపడబోతున్నాయి. ఢిల్లీలో అఫ్గాన్ జట్టు టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం చిరస్మరణీయంగా మిగిలిపోనుంది’’ అని పేర్కొన్నాడు.కాగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గానిస్తాన్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. అయితే, అఫ్గాన్‌తో టీమిండియా సిరీస్ ఖరారైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.బంగ్లాదేశ్‌కు షాక్నిజానికి సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వస్తుందని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకుంది. కానీ బీసీసీఐ మాత్రం అఫ్గాన్‌ను రంగంలోకి దింపి బంగ్లాకు చెక్ పెట్టింది.కాగా టీ20 ప్రపంచకప్-2026 సమయంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వద్ద పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా బోర్డు తమ జట్టు భారత్‌కు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి ఒప్పించే ప్రయత్నం చేయగా.. బంగ్లా పట్టువీడలేదు. వేదిక మార్చలేదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. దీంతో బంగ్లా బోర్డు- బీసీసీఐ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇక లేనట్లేనా?అయితే, ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం బీసీసీఐతో బంధాలు పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగ్లా బోర్డు అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. బీసీసీఐతో పలుమార్లు సంప్రదింపులు జరిపానని.. అయితే, ద్వైపాక్షిక సిరీస్ విషయంలో వారిదే అంతిమ నిర్ణయం అని ఇటీవల పేర్కొన్నాడు. అయితే, బీసీసీఐ మాత్రం బంగ్లాతో సిరీస్ విషయంలో ఇప్పటికీ స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో అఫ్గాన్‌తో సిరీస్ ఖరారు చేసి.. భారత్‌ను ఆతిథ్య దేశంగా ఉపయోగించుకునే బంపరాఫర్ ఇచ్చింది.అఫ్గానిస్తాన్ వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: సెప్టెంబరు 13- ఆదివారంరెండో టీ20: సెప్టెంబరు 15- మంగళవారంమూడో టీ20: సెప్టెంబరు 17- గురువారంవేదిక: ఢిల్లీ.చదవండి: టెస్టులలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. జైసూ సరికొత్త ఫీట్ -
టీమిండియాతో సిరీస్ ఖరారు.. భారత్‌లో వారి ఆతిథ్యం!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్‌ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్‌లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.కాగా అఫ్గానిస్తాన్‌లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్‌లో తలపడేందుకు సిద్ధమైంది.షెడ్యూల్ ఖరారుఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్‌లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్‌తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది.టెస్టు, వన్డేలలో ఓటమిఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్‌లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్.. అఫ్గాన్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్‌లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది.పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై ఘోర పరాభవం ఎదుర్కొంది. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్ చేసి తిరిగి విజయాల బాట పట్టింది.శ్రీలంక పర్యటనలోఇక టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో గిల్ సేన రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు.. ఆగష్టు 23న రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్ -
ఈసీబీ కీలక నిర్ణయం.. ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై నిషేధం?
అప్గానిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్వహణకు సిద్ధమైన ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ ఆడడం ఇంగ్లండ్‌కు ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం ఆఫ్గన్‌లో మహిళల పట్ల తాలిబన్ల ప్రవర్తన, లింగ వివక్ష అని తెలుస్తోంది. 2025 చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడినప్పుడు లండన్‌లో వివిధ పార్టీలకు చెందిన 160 మంది ఎంపీల బృందం ఈసీబీని తీవ్రంగా విమర్శించింది. అప్పటి నుంచి అఫ్గాన్‌తో క్రికెట్ ఆడేందుకు నిరాకరించిన ఇంగ్లండ్ కేవలం ఐసీసీ మేజర్ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతోంది. తాజాగా తమ కనుసన్నల్లో ఉండే ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆఫ్గన్‌తో సిరీస్ నిర్వహణకు సిద్దమవ్వడం ఈసీబీకి కోపం తెప్పించింది. ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌తో భవిష్యత్తులో ఆడాల్సిన అంతర్జాతీయ మ్యాచ్‌లను ఐర్లాండ్ కోల్పోయే ప్రమాదముందని చెప్పొచ్చు. గతంలో స్వదేశంలో యాషెస్ సిరీస్ ఆడడానికి ముందు ఇంగ్లండ్ సన్నాహకంగా ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. 2019, 2023లో ఇది రిపీట్ అయింది. అయితే 2027 యాషెస్ సిరీస్‌కు ముందు మాత్రం ఈసారి ఐర్లాండ్‌తో కాకుండా బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాలని ఈసీబీ నిర్ణయం తీసుకోవడం చూస్తే ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఏర్పడిన వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుతో (ఏసీబీ) సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోంది. గత 10 సంవత్సరాల్లో ఐర్లాండ్, ఆఫ్గన్ల మధ్య ఇది ఐదో సిరీస్ కావడం విశేషం.అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ నిర్వహించడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బిగ్-త్రీ (బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా)లో రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తీరును వ్యతిరేకిస్తున్న వేళ అది క్రమంగా ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.చదవండి: తొలి టెస్టులో చోటు కష్టమే.. అందుకేనా బ్యాటింగ్ ప్రాక్టీస్! -
పాకిస్తాన్‌కు గుడ్‌బై.. అంతలోనే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్లు, కోచ్‌ల విషయంలో నిలకడ ఉండదు. ఎప్పుటికప్పుడు సారథులు, మార్గ నిర్దేశకులు మారుతూనే ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవలే టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి షాన్ మసూద్‌ను తప్పించిన పాక్ బోర్డు.. మళ్లీ బాబర్ ఆజంకే పగ్గాలు అప్పగించింది.పాకిస్తాన్‌కు గుడ్బైఇక పాక్ జట్టు కోచింగ్ విభాగంలోనూ ఇటీవలే ఓ మార్పు చోటుచేసుకుంది. ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన షేన్ మెక్‌డెర్మాట్ ఇటీవలే ఆ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. తాజాగా అతడు అఫ్గానిస్తాన్ క్రికెట్ సీనియర్ జట్టు అసిస్టెంట్, ఫీల్డింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని అఫ్గాన్ బోర్డు తాజాగా ప్రకటించింది.ఆగష్టు 1 నుంచి ఐర్లాండ్‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి మెక్‌డెర్మాట్ అఫ్గాన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా గతంలోనూ మెక్‌డెర్మాట్ అఫ్గాన్ కోచ్‌గా పనిచేశాడు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు బాధ్యతలు నిర్వర్తించిన అతడు..ఆ తర్వాత పాక్ కోచ్‌గ వెళ్లాడు. అయితే, స్వల్ప కాలంలోనే పాక్ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లకు సహాయక కోచ్‌గానూ మెక్‌డెర్మాట్ పనిచేశాడు.వాళ్లు సైతం...ఇదిలా ఉంటే.. మెక్‌డెర్మాట్ కంటే ముందు గ్యారీ కిర్‌స్టన్, జేసన్ గిల్లెస్పి పాక్ హెడ్‌కోచ్ పదవుల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు తాత్కాలిక కోచ్‌లను నియమించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత మైక్ హసన్‌ను పూర్తిస్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. అయితే, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ- మైక్ హసన్ మధ్య విభేదాలు మొదలయ్యాయని.. త్వరలోనే అతడూ పాక్ జట్టును వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా పాక్ క్రికెట్ జట్టు ఇటు ఆటలోనూ.. అటు కోచింగ్ సభ్యుల విషయంలోనూ నిలకడ లేకుండా ఛిన్నాభిన్నం అవుతోందన్న చర్చ జరుగుతోంది. చదవండి: శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! -
అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వేటు
ఐర్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌తో రహమత్ షా అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా తన ప్రయణాన్ని ప్రారంభించనున్నాడు. హస్మతుల్లా షాహిది కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను రహమత్‌కు ఏసీబీ అప్పగించింది. ఇక గత నెలలో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీపై మాత్రం అఫ్గాన్ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్దానంలో యామిన్ అహ్మద్‌జాయ్‌కి పిలుపునిచ్చారు. అహ్మద్జాయ్ చివరగా అక్టోబర్ 2025లో అఫ్గాన్ తరపున ఆడాడు. ఈ జట్టులో అజ్మతుల్లా ఓమర్జాయ్, రషీద్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఈ సిరీస్ వచ్చే నెలలో ఆగస్టు 5 నుండి ఆగస్టు 14 మధ్య జరగనుంది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అఫ్గానిస్తాన్ గత నెలలో భారత్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-3తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అంతకుముందు అబుదాబిలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం 3-0 తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది.చదవండి: IND vs ZIM: ‘అతడొక సంచలనం.. బౌలింగ్ కూడా చేయిస్తాం’ -
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్‌లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్‌లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
కన్నీరుమున్నీరైన రషీద్ ఖాన్.. వీడియో వైరల్
అఫ్గానిస్తాన్ దిగ్గజ పేసర్ షాపూర్ జద్రాన్ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం కాబూల్‌లోని మరంజన్ హిల్ స్మశానవాటికలో జద్రాన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మాజీ ఫాస్ట్ బౌలర్‌కు తమ చివరి నివాళులు అర్పించేందుకు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. జద్రాన్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తూ కన్నీరుమున్నీరయ్యాడు. అతడితో పాటు వికెట్ కీపర్-బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఎక్స్‌లో షేర్ చేసింది.Rashid Khan broke down in tears as he bid a final farewell to his teammate and Afghanistan cricket legend Shapoor Zadran following his passing.😢🥺 pic.twitter.com/vF2DtNCXGl— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) July 9, 2026కాగా 38 ఏళ్ల షాపూర్ జద్రాన్ హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ అనే అరుదైన వ్యాధితో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం(జూలై 7) కన్నుమూశారు. తన 39వ పుట్టినరోజుకు కేవలం ఒక్క రోజు ముందు షాపూర్ మరణించడం అఫ్గాన్ క్రికెట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.The funeral prayer for the late Shapoor Zadran was offered this morning at 10:00 AM at Eidgah Mosque in Kabul, attended by current and former Afghanistan national team players, officials of the Afghanistan Cricket Board, members of his family, respected elders, and thousands of… pic.twitter.com/TcQCaEwlSA— Afghanistan Cricket Board (@ACBofficials) July 9, 2026అఫ్గాన్ క్రికెట్లో జద్రాన్ తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు. 2009 నుంచి 2020 మధ్య కాలంలో అఫ్గాన్ తరపున 80 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 80 వికెట్లు పడగొట్టాడు. -
38 ఏళ్ల వయసులో అఫ్గాన్ క్రికెటర్ కన్నుమూత
అఫ్గానిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ కన్నుమూశాడు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని మంగళవారం ధ్రువీకరించింది. కాగా షాపూర్ జద్రాన్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం విదితమే. వ్యాధి కారణంగా అతడి శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది.ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో.. అఫ్గాన్ నుంచి భారత్‌కు తరలించి అత్యాధునికి చికిత్స అందిస్తున్నారు. గత కొన్నినెలలుగా న్యూ ఢిల్లీలోని ఆస్పత్రిలో ఉన్న షాపూర్ జద్రాన్ తాజాగా తుదిశ్వాస విడిచాడు. బుధవారమే అతడు 39వ వసంతంలో అడుగుపెట్టాల్సింది. అలాంటిది పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే అతడు మరణించడం కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది.ఆరడుగుల బౌలర్ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తుతో.. జులపాల జుట్టుతో.. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ చాలాకాలం అభిమానులను అలరించాడు షాపూర్ జద్రాన్. అఫ్గాన్ తరఫున 2009- 2020 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు ఈ ఫాస్ట్ బౌలర్.ఇంటర్నేషనల్ కెరీర్లో 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడిన షాపూర్.. వన్డేల్లో 43, టీ20లలో 37 వికెట్లు కూల్చాడు. మూడుసార్లు టీ20 ప్రపంచకప్ జట్లలో భాగమయ్యాడు. అఫ్గాన్ క్రికెట్ నివాళిషాపూర్ జద్రాన్ మరణం పట్ల అఫ్గాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గాన్ క్రికెట్ అభివృద్ధిలో అతడూ భాగమయ్యాడని.. చిన్న వయసులోనే అతడు కన్నుమూయడం కలచివేసిందని విచారం వ్యకతం చేసింది. షాపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. -
పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్!
38 ఏళ్ల అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపుర్ జద్రన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య పడిపోవడంతో ప్రస్తుతం షాపుర్ జద్రన్ భారత్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో అతడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరో 18 గంటలు గడిస్తే కానీ షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని అతని కుటుంబసభ్యులతో పాటు అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోషల్‌మీడియాలో కూడా షాపుర్ జర్దన్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అయితే కొన్ని వారాల కిందటే తీవ్ర అనారోగ్యానికి గురైన షాపుర్ జద్రన్ చాలా రోజుల ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఇటీవలే డిశ్చార్జి అయిన అతడు మరోసారి ఆసుపత్రి పాలవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. జద్రన్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పాక్‌కు చెందిన మరో మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకొని బాధపడ్డాడు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడిన షాహిద్ అఫ్రిది తన చిరకాల మిత్రుడు షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. క్రికెట్లో అఫ్గానిస్తాన్ ఎదుగుదలలో షాపుర్ జద్రన్ కీలక పాత్ర పోషించాడు. దశాబ్దానికి పైగా ఆఫ్గన్‌కు ప్రాతినిధ్యం వహించిన షాపుర్ జద్రన్ నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచ మేటి బ్యాటర్లను వణికించాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి బ్యాటర్లను తన స్వింగ్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టి పెవిలియన్ చేర్చాడు. 2009లో స్కాట్లాండ్తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాపుర్ జద్రన్ అప్గానిస్తాన్ తరఫున 43 వన్డేల్లో 43 వికెట్లు, 32 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్తాన్ తరఫున మూడు టీ20 ప్రపంచకప్పుల్లో పాల్గొన్న షాపుర్ జద్రన్ 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై విజయం సాధించి ఐసీసీ టోర్నీల్లో తొలి విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.Zardan brother is like a buddy to me. I am wishing him speedy recovery. Ameen🤲 pic.twitter.com/8oGPUVwHai— Umar Akmal (@Umar96Akmal) April 17, 2026చదవండి: స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది? -
యుద్ధం ప్రభావం.. క్రికెట్ సిరీస్ రద్దు
పశ్చియాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం క్రికెట్‌కు కూడా తగిలింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు శ్రీలంక, అఫ్గానిస్థాన్ల మధ్య దుబాయ్ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమానాల రాకపోకలపై నిషేధంతో సిరీస్ రద్దు అయినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా షార్జా వేదికగా మార్చి 13 నుంచి అఫ్గానిస్థాన్, శ్రీలంక మధ్య మూడు టీ20లు, మార్చి 20, 22, 25 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే సిరీస్ నిర్వహించే అవకాశాల్లేవు. దీంతో సిరీస్ రద్దుకే మొగ్గు చూపుతున్నట్లు ఇరుజట్ల క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి.ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు నిరాశ పరిచాయి. అఫ్గానిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టగా.. ఆతిథ్య హోదాలో సూపర్-8కు పరిమితం కావాల్సి వచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, అమెరికాలు మాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. -
అఫ్గనిస్తాన్ కొత్త హెడ్‌కోచ్‌గా అతడే.. ఏసీబీ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్‌కోచ్ వచ్చాడు. తాజా టీ20 ప్రపంచకప్ వరకు అఫ్గన్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ జొనాథన్ ట్రాట్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీ అనంతరం అతడు పదవి నుంచి దిగిపోయాడు.ట్రాట్ స్థానంలోఈ క్రమంలో ట్రాట్ స్థానంలో కొత్త హెడ్ కోచ్‌గా రిచర్డ్ పైబస్‌ను నియమించినట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తెలిపింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి పైబస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ‘అఫ్గనిస్తాన్ జాతీయ జట్టుకు రిచర్డ్ పైబస్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించాం. శ్రీలంకతో సిరీస్ నుంచి అతడు జట్టుతో చేరతాడు’ అని ఏసీబీ పేర్కొంది. కోచ్‌గా మంచి రికార్డుఇక ఇంగ్లండ్‌కు చెందిన పైబస్ ఒకే ఒక్క లిస్ట్ ‘ఎ’ మ్యాచ్ ఆడాడు. అయితే, ఆటగాడిగా పెద్దగా అనుభవం లేకపోయినా... కోచ్‌గా మంచి రికార్డు ఉంది. పైబస్ 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతడు విండీస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న సమయంలోనే కరీబియన్ జట్లు పురుషుల, మహిళల, అండర్–19 వరల్డ్‌కప్ ట్రోఫీలు సాధించాయి. సూపర్-8 చేరకుండానేకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్, యూఏఈ, కెనడాలతో తలపడ్డ అఫ్గనిస్తాన్.. నాలుగింటికి రెండే మ్యాచ్‌లు గెలిచింది. తద్వారా సూపర్-8 చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో అఫ్గన్ జట్టు అనూహ్య రీతిలో సెమీస్ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: T20 WC 2026: పాక్ జట్టులో కలకలం


