IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ | BCCI Announce Afghanistan to host India for T20I series in Delhi | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ క్రికెట్‌కు అండగా ఉంటాము.. బీసీసీఐ కీలక ప్రకటన

Aug 12 2026 11:25 AM | Updated on Aug 12 2026 11:57 AM

BCCI Announce Afghanistan to host India for T20I series in Delhi

PC: BCCI X

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అఫ్గానిస్తాన్‌ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యమిస్తుందని ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించింది.

అఫ్గాన్‌ క్రికెట్‌కు అండగా ఉంటాము
ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు భారత్‌లో టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆతిథ్యమివ్వడం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భారత్‌- అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య పోరు చాలా ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఇరుజట్లలోనూ మంచి నైపుణ్యాలున్న క్రికెటర్లు ఉన్నారు.

అఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లలో చాలా మందికి భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు. ఇరు దేశాల క్రికెట్‌ సంబంధాలు రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నాయి. 2018లో తొలిసారి బారత్‌ అఫ్గానిస్తాన్‌కు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చింది.

చిరస్మరణీయం
అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు మరింత పటిష్టంగా మారాయి. ఇటీవలే జూన్‌లో అఫ్గాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. ఇప్పుడు ఇరుజట్లు టీ20 సిరీస్‌లో తలపడబోతున్నాయి. ఢిల్లీలో అఫ్గాన్‌ జట్టు టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం చిరస్మరణీయంగా మిగిలిపోనుంది’’ అని పేర్కొన్నాడు.

కాగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గానిస్తాన్‌- టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం వేదిక. అయితే, అఫ్గాన్‌తో టీమిండియా సిరీస్‌ ఖరారైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

బంగ్లాదేశ్‌కు షాక్‌
నిజానికి సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వస్తుందని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆశలు పెట్టుకుంది. కానీ బీసీసీఐ మాత్రం అఫ్గాన్‌ను రంగంలోకి దింపి బంగ్లాకు చెక్‌ పెట్టింది.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 సమయంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ అప్పటి బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) వద్ద పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా బోర్డు తమ జట్టు భారత్‌కు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. 

దీంతో ఐసీసీ రంగంలోకి దిగి ఒప్పించే ప్రయత్నం చేయగా.. బంగ్లా పట్టువీడలేదు. వేదిక మార్చలేదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. దీంతో బంగ్లా బోర్డు- బీసీసీఐ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇక లేనట్లేనా?
అయితే, ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం బీసీసీఐతో బంధాలు పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగ్లా బోర్డు అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌.. ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. బీసీసీఐతో పలుమార్లు సంప్రదింపులు జరిపానని.. అయితే, ద్వైపాక్షిక సిరీస్‌ విషయంలో వారిదే అంతిమ నిర్ణయం అని ఇటీవల పేర్కొన్నాడు. 

అయితే, బీసీసీఐ మాత్రం బంగ్లాతో సిరీస్‌ విషయంలో ఇప్పటికీ స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో అఫ్గాన్‌తో సిరీస్‌ ఖరారు చేసి.. భారత్‌ను ఆతిథ్య దేశంగా ఉపయోగించుకునే బంపరాఫర్‌ ఇచ్చింది.

అఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ టీమిండియా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
తొలి టీ20: సెప్టెంబరు 13- ఆదివారం
రెండో టీ20: సెప్టెంబరు 15- మంగళవారం
మూడో టీ20: సెప్టెంబరు 17- గురువారం
వేదిక: ఢిల్లీ.

చదవండి:  టెస్టులలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. జైసూ సరికొత్త ఫీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement