టీమిండియాతో సిరీస్‌ ఖరారు.. భారత్‌లో వారి ఆతిథ్యం! | AFG vs IND: ACB confirms dates for Delhi T20Is after BCCI greenlight | Sakshi
Sakshi News home page

టీమిండియాతో సిరీస్‌ ఖరారు.. భారత్‌లో వారి ఆతిథ్యం!

Aug 11 2026 9:27 PM | Updated on Aug 11 2026 9:27 PM

AFG vs IND: ACB confirms dates for Delhi T20Is after BCCI greenlight

అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్‌ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, అఫ్గాన్‌ భారత్‌లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.

కాగా అఫ్గానిస్తాన్‌లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్‌ లేదంటే యూఏఈలలో పలు సిరీస్‌లకు ఆతిథ్యమిస్తోంది.  ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్‌లో తలపడేందుకు సిద్ధమైంది.

షెడ్యూల్‌ ఖరారు
ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్‌ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లకు అఫ్గానిస్తాన్‌ భారత్‌లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌ ఆడిన అఫ్గాన్‌ జట్టు.. 2017లో విండీస్‌తో ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌ ఆడింది.

టెస్టు, వన్డేలలో ఓటమి
ఇక ఇటీవల అఫ్గానిస్తాన్‌ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్‌లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌.. అఫ్గాన్‌ను ఏకంగా ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్‌ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్‌లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ సేనతో టీ20 సిరీస్‌ ఆడుతుంది.

పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20  జట్టు
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్‌లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.

పసికూన ఐర్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌లో భారత్‌ 2-0తో వైట్‌వాష్‌ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ చేతిలోనూ 4-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై ఘోర పరాభవం ఎదుర్కొంది. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్‌ చేసి తిరిగి విజయాల బాట పట్టింది.

శ్రీలంక పర్యటనలో
ఇక టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో గిల్‌ సేన రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు.. ఆగష్టు 23న రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. 

చదవండి: T20 WC 2028: పోర్చుగల్‌ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement