బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గురుంచి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చనడుస్తోంది. సీఓఈ క్లియరెన్స్ ఇచ్చిన కొద్ది రోజులకే ఆటగాళ్ల గాయాలు తిరగబెట్టడం పలు అనుమానులకు తావనిస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండానే సీఓఈ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇస్తుందనున్న విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం భారత జట్టులోని జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు సీఓఈలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, బోర్డు అధికారులు సీఓఈను సందర్శించారు.
వీరంతా సీఓఈ హెడ్ వీవీయస్ లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేవజిత్ సైకియా కీలక విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు ఏ ఉపయోగం లేకుండా పడివున్న 40 ఎకరాల బంజారు భూమిని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడంలో అప్పటి బీసీసీఐ సెక్రెటరీ జై షాది కీలక పాత్ర అని సైకియా తెలిపారు.
"బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఈరోజు అందుబాటులో ఉందంటే అందుకు ప్రధాన కారణం జై షా. 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' ఏర్పాటు కోసం అతడు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లోని అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చాడు.
ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక ఏర్పాట్లతో సాగిన నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఉండే ఓ అత్యాధునిక ట్రైనింగ్ సెంటర్‌ను తీసుకురావాలని అతడు బలంగా నిశ్చయించుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును ప్రారంభించే క్రమంలో అనేక నిబంధనలను పాటించాల్సి వచ్చింది.
చట్టపరమైన అడ్డంకులన్నింటినీ తొలగించేందుకు జై షా స్వయంగా పలుమార్లు ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా, 40 ఎకరాల బీడు భూమిని క్రమబద్ధీకరించే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఆ భూమి నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు, చాలామంది దానిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
అందుకే 2022 ఫిబ్రవరి 14న పనులు ప్రారంభించడానికి ముందే దానిని చట్టబద్ధంగా సొంతం చేసుకున్నాం. అడ్డంకులన్నింటినీ దాటుకుని ఈ రోజు అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెంటర్ రూపుదిద్దుకుంది" అని సైకియా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాగా ఈ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యకలాపాలు నవంబర్ 2024లో ప్రారంభమయ్యాయి.


