బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో సరికొత్త చరిత్ర | Indian Origin Bodhana Sivanandan Becomes Youngest British Womens Chess Champion | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో సరికొత్త చరిత్ర

Aug 10 2026 6:13 PM | Updated on Aug 10 2026 6:42 PM

Indian Origin Bodhana Sivanandan Becomes Youngest British Womens Chess Champion

source: X

చిన్న వయసులోనే చెస్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారత సంతతికి చెందిన 11 ఏళ్ల బొదనా శివానందన్‌ మరో సంచలన విజయం సాధించింది. 2026 బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. తద్వారా బ్రిటన్‌ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళల చెస్‌ చాంపియన్‌గా అవతరించింది.

మరో భారత సంతతి యువ చెస్‌ ప్రతిభ 17 ఏళ్ల శ్రేయాస్‌ రాయల్‌ ఓపెన్‌ విభాగంలో బ్రిటిష్‌ చాంపియన్‌గా నిలవడంతో ఈసారి బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల హవా కనిపించింది.

ఉత్కంఠభరిత పోరు
ఈ టైటిల్‌ను బొదనా అంత తేలిగ్గా గెలవలేదు. ఫైనల్‌ దశలో ఐర్లాండ్‌కు చెందిన 14 ఏళ్ల త్రిషా కన్యామరాలాతో హోరాహోరీ పోటీ పడింది. చివరకు ఉత్కంఠభరితమైన ర్యాపిడ్‌ చెస్‌ ప్లేఆఫ్‌లో విజయం సాధించిన బొదనా టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు బొదనా సాధించిన విజయాలు
* UK Open Women’s Blitz Champion
* British Women’s Rapid Champion
* 2026 British Women’s Classical Chess Champion

శ్రేయాస్‌ రాయల్‌ కూడా చరిత్ర సృష్టించాడు
మహిళల విభాగంలో బొదనా చరిత్ర సృష్టించగా.. ఓపెన్‌ విభాగంలో 17 ఏళ్ల శ్రేయాస్‌ రాయల్‌ బ్రిటిష్‌ చాంపియన్‌గా నిలిచాడు.

తొమ్మిది రౌండ్ల అనంతరం శ్రేయాస్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు. అతడి వెనుక ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞులైన గ్రాండ్‌మాస్టర్లు ఉన్నప్పటికీ.. అర పాయింట్‌ ఆధిక్యంతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.ఇది శ్రేయాస్‌కు తొలి బ్రిటిష్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌.

15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు
శ్రేయాస్‌ రాయల్‌ కూడా చిన్న వయసులోనే చెస్‌లో తన ముద్ర వేశాడు. 15 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. శ్రేయాస్‌ రాయల్‌ భారత్‌లో (బెంగళూరు) జన్మించాడు. అతడికి మూడేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు జితేంద్ర, అంజు సింగ్‌తో కలిసి బ్రిటన్‌కు వెళ్లారు.

122 ఏళ్ల చరిత్రలో భారీ టోర్నీ
2026 బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మరో కారణంతోనూ ప్రత్యేకంగా నిలిచింది. టోర్నీ నిర్వాహకుల ప్రకారం ఇది 122 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌. ఈసారి టోర్నీలో ఏకంగా 1,750 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ ప్రైజ్‌ మనీ కూడా రికార్డు స్థాయిలో 34,000 పౌండ్లుగా ఉంది.

ఇలాంటి భారీ టోర్నీలో భారత సంతతికి చెందిన ఇద్దరు యువ ప్రతిభలు మహిళల, ఓపెన్‌ విభాగాల్లో టైటిళ్లు సాధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 11 ఏళ్ల బొదనా శివానందన్‌.. 17 ఏళ్ల శ్రేయాస్‌ రాయల్‌ బ్రిటిష్‌ చెస్‌లో భారత సంతతి ప్రతిభకు కొత్త అధ్యాయాన్ని రాశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement