వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలో హైకింగ్‌కు వెళ్లి అదృశ్యమైన భారత సంతతికి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి విక్రమ్ ముబాయి దురదృష్టవశాత్తు మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని ఇన్యో నేషనల్ ఫారెస్ట్ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా (UCSB)లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
వివారాల్లోకి వెళితే... విక్రమ్ ముబాయి ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని బిగ్ పైన్ లేక్స్ ప్రాంతంలో ఒంటరిగా హైకింగ్‌కు వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8:30 గంటలకు తన కుటుంబ సభ్యులకు చివరిసారిగా సంప్రదించి, తాను ఉన్న ప్రదేశానికి సంబంధించిన GPS కోఆర్డినేట్స్ పంపించాడు.ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో, నిర్ణయించిన సమయానికి కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు కనిపించడం లేదని అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇన్యో కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందంతో పాటు కాలిఫోర్నియా హైవే పట్రోల్ సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. చివరకు అతని మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.
అయితే విక్రమ్ ముబాయి ఎలా మరణించాడనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం వరకు హత్య లేదా ఇతర అనుమానాస్పద అంశాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.


