ముంబై: ఐఐటీ బాంబే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ విద్యార్థి సాహిల్ రవీంద్ర వకోడే ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాను సస్పెండ్ చేసింది. డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సహిల్ ఆత్మహత్య ఘటనలో విద్యార్థికి న్యాయం జరగాలని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏం జరిగింది?
ఐఐటీ బాంబేలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల సాహిల్ వాకోడే సెప్టెంబర్ 18న పరీక్ష రాసిన కొద్దిసేపటికే హాస్టల్ గదిలో మృతిచెందాడు. రెండో పరీక్ష సందర్భంగా అతడి వద్ద మొబైల్ ఫోన్ ఉన్నట్లు గుర్తించినట్లు ఐఐటీ బాంబే తెలిపింది. పరీక్ష ప్రశ్నపత్రాన్ని మొబైల్ ద్వారా ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. పరీక్ష పర్యవేక్షకుడిగా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా అతడిని బయటకు తీసుకెళ్లి మాట్లాడినట్లు విద్యార్థులు తెలిపారు.
కుటుంబం సంచలన ఆరోపణలు
అయితే సహిల్ తల్లిదండ్రులు మాత్రం వేరే ఆరోపణలు చేశారు. క్యాంపస్‌లో కుల వివక్షకు గురయ్యాడని, కొంతకాలంగా ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా తనను కులపరంగా వేధిస్తున్నారని సహిల్ తమకు చెప్పేవాడని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పరీక్ష ఘటనకు ముందు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని కుటుంబం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఐఐటీ బాంబే యాజమాన్యం ఖండించింది. సహిల్‌గానీ, అతడి కుటుంబం తమ SC/ST సెల్‌కు ఇలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపింది.
ఈ నేఫథ్యంలో సహిల్ తండ్రి ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రొఫెసర్ దుల్లాతో పాటు మరికొందరిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ (Prevention of Atrocities) చట్టం కింద సెక్షన్లు చేర్చారు. అనంతరం ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. సహిల్ తల్లిదండ్రులు మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించేందుకు అంగీకరించారు.
ఈ ఉద్రిక్తతల నడుమ ఐఐటీ బొంబై ప్రొఫెసర్ సత్యనారాయణ దుల్లాను డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చింది. కాగా ప్రతిష్టాత్మక వర్సిటీలో జరిగిన పరిణామాల మధ్య డైరెక్టర్(ఐఐటీ బాంబే) ప్రొఫెసర్ శిరీష్ కేదారే రాజీనామా చేయడానికి సిద్ధమని వెల్లడించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. విద్యార్థులతో జరిగిన సుదీర్ఘ సమావేశంలో వారి డిమాండ్లపై చర్చించి పలు అంశాలకు(18!) అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి.


