లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఓ మహిళ టవర్ ఎక్కడంతో కలకలం చెలరేగింది. తమ భూమికి సంబంధించిన వివాదంలో న్యాయం కోరుతూ ఆగ్రాకు చెందిన తుల్సా అనే మహిళ ఈ చర్యకు పాల్పడింది. ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. భూమికి సంబంధించిన వివాదంతో తుల్సా తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. తన భూమిని మన్‌సింగ్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నది. ఈ విషయంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆమె గోల్ఫ్ చౌరాహా వద్ద జూ గేట్ నంబర్ 3 సమీపంలోని టవర్ ఎక్కింది.
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. టవర్‌పై ఉన్న మహిళను కిందకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది హైడ్రా వాహనాన్ని ఉపయోగించారు. దాని సహాయంతో ఆమెను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో మహిళకు లేదా ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వివాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: Bigg Boss-20: మేరీ కోమ్‌పై యుంగ్ డీఎస్‌ఏ సంచలన వ్యాఖ్యలు


