తమిళ సినీ పరిశ్రమలో విజయ్–అజిత్ ఫ్యాన్ వార్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల లండన్‌లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసిన దృశ్యాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ఓ కారు రేసు సందర్భంగా విజయ్, అజిత్ ఆప్యాయంగా పలకరించుకోవడంతో.. ఇక ఫ్యాన్ వార్‌కు తెరపడుతుందేమోనని చాలామంది భావించారు. కానీ పట్టుమని పది రోజులు కూడా గడవకముందే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
అజిత్ అభిమానులు ఏకంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. కల్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేట సమీపంలోని ఎలవనాసూర్‌కోటైలో సెప్టెంబర్ 20న ‘తమిళగ మక్కల్ కళగం’ పేరుతో పార్టీని ప్రకటించి జెండాను ఆవిష్కరించారు. తమిళనాడు వ్యాప్తంగా అజిత్ అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఖాళీగా ఉంచారు.
అజిత్ రాజకీయాల్లోకి వస్తే ఆ బాధ్యతను ఆయనకే అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ పదవిని ఖాళీగా ఉంచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇతర పదవులకు మాత్రం తమ ప్రతినిధులను నియమించారు. అయితే ఈ పార్టీకి అజిత్‌కు నేరుగా సంబంధం లేదని, ఆయన స్వయంగా పార్టీని ప్రారంభించలేదని నిర్వాహకులే స్పష్టం చేశారు. కానీ, ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఓ పిలుపు మాత్రం ఇచ్చారు.
"தமிழக மக்கள் கழகம்" என்ற புதிய அரசியல் கட்சியை துவங்கிய அஜித் ரசிகர்கள்... ”அஜித் சாரும் வரவேண்டும்...” என அழைப்பு விடுத்து ரசிகர்கள் பேட்டி#AjithKumar | #Fans | #Ulundurpet | #TNPolitics | #PuthiyathalaimuraiTV pic.twitter.com/z4gyZCQcVh
— PttvOnlinenews (@PttvNewsX) September 20, 2026
విజయ్ ఫ్యాన్స్ ఆట మొదలు..
అజిత్ అభిమానులు పార్టీ విషయంలో అంత స్పష్టమైన ప్రకటన చేసినా.. విజయ్ అభిమానులు ఊరుకోవడం లేదు. ‘పట్టుమని నలుగురు కూడా లేరు కదరా!’ అంటూ ఆటాడుకుంటున్నారు. పైగా కొత్త పార్టీ జెండా కూడా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) జెండాను పోలి ఉందంటూ మీమ్స్, ట్రోలింగ్‌తో స్పందిస్తున్నారు. ‘టీవీకేను కాపీ చేశారంటూ’ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ పరిణామం అజిత్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది.

అప్పుడే వచ్చి ఉండేవాడు కదా!
తమిళనాట అజిత్ పొలిటికల్ ఎంట్రీ గురించి డిస్కషన్ ఏనాడో క్లోజ్ అయ్యింది. సినీ కెరీర్‌లో ఉన్నప్పుడు అజిత్ కుమార్‌కు, తమిళనాడు మాజీ సీఎం జయలలితతో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండేది. జయలలిత తనను సొంత కొడుకులా అభిమానించేవారని అజిత్ గతంలో స్వయంగా చెప్పేవారు. అజిత్–షాలిని వివాహానికి జయలలిత హాజరై వారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత కూడా అజిత్, షాలిని ఆమెను పోయెస్ గార్డెన్ నివాసానికి వెళ్లి తరచూ కలిసేవారు. ఒకానొకటైంలో అజిత్ అభిమానులు ఆయన్ని అమ్మకు వారసుడిగా ప్రచారం చేసుకున్నారు కూడా. అది అన్నాడీఎంకే నుంచి అభ్యంతరాలకు దారి తీసింది.
అయితే.. అజిత్ మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. జయలలిత మరణించిన సమయంలో షూటింగ్‌లో ఉన్న ఆయన.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఆమె సమాధి వద్ద నివాళులర్పించారు. అజిత్‌కు రాజకీయాలపై ఆసక్తి లేదన్న విషయం అభిమానులకు కూడా తెలుసు. అయినా ఆయన అభిమానులు మాత్రం ప్రత్యేకంగా పార్టీ పెట్టి.. ఆయన కోసం కీలక పదవిని ఖాళీగా ఉంచడం చర్చనీయాంశమైంది.
డ్యామేజ్ కంట్రోల్‌లో అజిత్?!
అజిత్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. తాజా రేసింగ్‌లో ఆయనకు ఐదో స్థానం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానుల నిర్వాకం ఆయనకు కాస్త ఆలస్యంగా తెలిసినట్లు తెలుస్తోంది. పైగా విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తుండడంపైనా ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అజిత్‌కు సోషల్ మీడియా అకౌంట్లు లేవు. ఏది ఉన్నా ఆయన మేనేజర్ సురేష్ చంద్ర అఫీషియల్‌గా ప్రకటిస్తుంటారు. దీంతో ఇవాళో, రేపో ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం తమిళనాట కొనసాగుతోంది.
విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక..
తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రవేశం కొత్త విషయం కాదు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తమిళగ వెట్రి కళగం ఏర్పాటు చేసి ఏకంగా సీఎం కావడం.. అక్కడి సీని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ను ఫాలో అవుతూ మరికొందరు అదే బాట పట్టడం డీఎంకే-అన్నాడీఎంకేలకు అసహనం తెప్పిస్తోంది. సినిమావాళ్లు తమిళ రాజకీయాలను నాశనం చేస్తున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు.
ఈ తరుణంలో ఇప్పుడు అజిత్ అభిమానుల తాజా నిర్ణయంపై ఆసక్తి మరింత పెరిగింది. పార్టీ ప్రకటనతో ఫ్యాన్ వార్ మరో లెవల్‌కు వెళ్తుందా? లేక తన అభిమానుల దూకుడుకు అజిత్ స్వయంగా బ్రేకులు వేస్తారా? అభిమానుల తీరుపై గతంలోనే తన వైఖరిని స్పష్టం చేసిన అజిత్.. ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు అసలు ట్విస్ట్!.
ఇదీ చదవండి: జెన్‌జీల కోసం ఏం చేయబోతున్నారంటే..


