‘హూ ఈజ్‌ మోదీ’ నుంచి గ్రేట్‌ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా? | KSR's Comments On Chandrababu Modi Varanasi Puja Political Strategy | Sakshi
Sakshi News home page

‘హూ ఈజ్‌ మోదీ’ నుంచి గ్రేట్‌ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?

Sep 21 2026 11:28 AM | Updated on Sep 21 2026 12:00 PM

KSR's Comments On Chandrababu Modi Varanasi Puja Political Strategy

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటి? ఆయన ఏ లక్ష్యంతో బీజేపీ పట్ల, ప్రధాని మోదీ పట్ల అంత విధేయత చూపుతున్నారు? ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీగా తెలుగుదేశం గుర్తింపు పొందింది. అదంతా ఏమైందో కాని, ప్రస్తుతం ఆత్మాభిమానంతో సంబంధం లేకుండా టీడీపీ ముఖ్యనేతలు ప్రవర్తిస్తున్నారేమిటా అని పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా వారణాసికి వెళ్లి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ కాదనరు. కాని వారణాసి వెళ్లి బీజేపీ కేంద్ర మంత్రులతో కలిసి పూజలు చేసి హారతి ఇచ్చిన వైనంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పనే వైఎస్ జగన్ వంటి నేతలు ఎవరైనా చేసి ఉంటే, చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి ఉంటే, ఇక ఇల్లెక్కి గోలచేసినంత పని చేసేవారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిందని ఎల్లో మీడియాలో హోరెత్తించేవారు. కేసుల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించేవారు.

రాజకీయాలలో ప్రధాని మోదీ కన్నా చంద్రబాబు నాయుడు చాలా సీనియర్. ఈ విషయాన్ని ఆయనే గతంలో చెప్పుకునేవారు. ఆ సీనియారిటీని పక్కనబెట్టి మోదీ కోసం చంద్రబాబు పూజలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయ అవసరాలా? లేక తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తగు సహకారం పొందడానికా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది చర్చగా ఉంది.

చంద్రబాబు 1978లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అదే టరమ్‌లో మంత్రి అయ్యారు. ఆయన మామ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ నుంచి జంప్ చేసి పెత్తనం సాగించారు. కర్షకపరిషత్ ఛైర్మన్‌గా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మెడలు వంచి అధికారం సాధించామని ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. అలాంటి నేత బీజేపీ విషయంలో పలుమార్లు పిల్లిమొగ్గలు వేశారు.

1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు. 1998 నాటికి ఎన్డీఏలోకి వచ్చి, 1999 ఎన్నికలలో కలిసి పోటీచేశారు. 2001 ప్రాంతంలో గుజరాత్ మత కలహాల నేపథ్యంలో మోదీని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోబోనని ప్రతిజ్ఞ చేశారు. కాని 2014 నాటికి ప్రధాని అభ్యర్ది అయిన మోదీని కలవడానికి లాబీయింగ్ చేసుకుని సఫలం అయ్యారు. ఆ తర్వాత 2018లో మళ్లీ బీజేపీకి దూరం అయి కాంగ్రెస్‌తో కలిశారు. 2019లో ఓటమి తర్వాత మళ్లీ బీజేపీవైపు వెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసి 2024లో పొత్తు పెట్టుకోగలిగారు. 

రాజకీయాలలో పొత్తులు మార్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. కాని విమర్శలు, ఆరోపణల విషయంలో పెద్ద నేతలు సంయమనంగా ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం ఆ విషయంలో హద్దులు పాటించలేదు. ప్రధానిని ఏవైతే అనగూడదో ఆ మాటలన్నీ అన్నారు. దేశానికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా, ముస్లింలను బతకనివ్వని మనిషిగా, భార్యను ఏలుకోవడం లేదని అంటూ హూ ఈజ్ మోదీ అనేంతవరకు వెళ్లారు. 2019 ఎన్నికల సమయంలో మోదీ కూడా చంద్రబాబును అవినీతిపరుడని ధ్వజమెత్తారు. అయినా ఇరు పార్టీలు, ఇద్దరు నేతలు మళ్లీ కలవడం ద్వారా ఇవా రాజకీయాలు.. ఔరా అనిపించారు.

తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీతో పొత్తుకోసం డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాచారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఇష్టపడలేదని, తాను ఈ విషయంలో తిట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్‌లో వెల్లడించారు. కూటమి ఎన్నికల ప్రచారానికి మోదీ వచ్చినా చంద్రబాబుతో అంతంతమాత్రంగానే మాట్లాడారని అంటారు. ఆయా సందర్భాలలో మొక్కుబడిగానే వీరిమధ్య సంబంధాలు సాగాయి. ఈ లోక్ సభ ఎన్నికలలో 16 సీట్లు రావడం టీడీపీకి కలిసి వచ్చింది. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ సీట్లు కీలకం అయ్యాయి. ఆ తర్వాత మోదీ, చంద్రబాబుల మధ్య సంబంధాలు మెరుగుపడడం ఆరంభం అయిందని చెప్పాలి.

ఇదీ చదవండి: రేవంత్‌ వర్సెస్‌ కేసీఆర్‌.. భూముల లెక్కల్లో అసలు ట్విస్ట్‌ ఇదేనా?

అయినా చంద్రబాబును బీజేపీ పెద్దలు నమ్మడం అంతంత మాత్రమేనని చెబుతారు. చంద్రబాబు పలుమార్లు డోకా చేశారని, కాంగ్రెస్‌తో కూడా కలిసి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో వ్యతిరేక ప్రచారం చేశారన్న అసంతృప్తి బీజేపీలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనపై బీజేపీలో నమ్మకం పెరగడానికి గాను 2024 నుంచి తెగ పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. మోదీని అవసరం ఉన్నా, లేకపోయినా పొగడడం, అది కూడా బీజేపీవారికే ఎబ్బెట్టుగా ఉండేంతగా చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.

ఉదాహరణకు ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తీసుకుంటే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మోదీని ఆకాశానికి ఎత్తేశారు. మోదీ, మోదీ అంటూ సభికులతో నినాదాలు ఇప్పించారు. మోదీ ప్రపంచానికే నాయకుడని మెచ్చుకుంటున్నారు. మోదీ కోసం ప్రత్యేకంగా యోగా దినోత్సవం నాడు కోట్లు వెచ్చించి ఒక రోజు కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా వైఎస్సార్‌సీపీ, మరికొన్ని పక్షాలు చేశాయి. కేంద్రం బాగా సహకరిస్తోందని ఒకటికి రెండుసార్లు ప్రకటనలు చేస్తున్నారు.

జగన్ టైమ్‌లో రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు తదితర స్కీములకు భారీగానే నిధులు వచ్చాయి. ఆనాటితో పోల్చితే ఈ రెండేళ్లో అమరావతి అప్పు మినహా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించింది అంతంత మాత్రమే. అయినా ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. వారణాసిలో సైతం మోదీని కొనియాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడు అని అభివర్ణించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చారని చెప్పారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు కూడా మోదీని పొగిడే పనిలో ఉంటున్నారు.

గతంలో గుజరాత్‌కే అన్ని చేస్తున్నారని, ఏపీ అంటే మోదీకి అసూయ అని, అమరావతికి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చారని చంద్రబాబు ఆరోపించేవారు. కాని జత కలిసిన తర్వాత మాట మార్చారు. అది వేరే సంగతి. ఇటీవలికాలంలో ఎందుకు ఇంతగా తగ్గి వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఒత్తిడి ఆయనపై అధికంగా ఉందని అంటారు. జనసేన, బీజేపీల నుంచి దానిపై ఒక క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన అభిప్రాయం వెల్లడించలేదు. మోదీ ఒప్పుకుంటే ఆ విషయం ఒక కొలిక్కి రావచ్చు.

అంతేకాదు... అది జరిగితే తను జాతీయ స్థాయిలో ఏదైనా పదవికి వెళ్లడానికి చంద్రబాబు టార్గెట్ పెట్టుకుని ఉండవచ్చు. అది సాధించాలంటే బీజేపీ ఓకే చేయవలసి ఉంటుంది. కేంద్ర స్థాయిలోకాని, ఇతరత్రా ఏమైనా కేసులు ఉంటే వాటిని పరిష్కరించుకునే పనిలో కూడా ఉండి ఉండవచ్చన్నది కొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా మోదీ జన్మదినోత్సవ పూజలకు వెళ్లడం ద్వారా చంద్రబాబు తన సీనియారిటీని తానే తగ్గించుకున్నట్లు అయిందా అన్న భావన టీడీపీతో సహా ఆయా వర్గాలలో ఏర్పడింది. ఆత్మగౌరవం వంటివాటితో సంబంధం లేకుండా, ఇలాంటి రాజకీయ వ్యూహాలలో ఆయన దిట్టే అన్న అభిప్రాయం కూడా ఉంది.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement