‘లంచం ఇవ్వడం ధర్మమే’.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలతో సభలోనే రచ్చ! | Karnataka Shivalinge Gowda Nothing wrong with tipping good officials | Sakshi
Sakshi News home page

‘లంచం ఇవ్వడం ధర్మమే’.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలతో సభలోనే రచ్చ!

Sep 21 2026 8:00 AM | Updated on Sep 21 2026 8:00 AM

Karnataka Shivalinge Gowda Nothing wrong with tipping good officials

బెంగళూరు: ప్రభుత్వ కార్యాలయంలో పని చేయించుకోవాలంటే అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిందేనా? విధులు నిర్వర్తించినందుకు ‘టిప్‌’ పేరుతో అధికారులకు నగదు ఇవ్వడం తప్పుకాదా? కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి కేఎం శివలింగే గౌడ వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రశ్నలనే తెరపైకి తెచ్చాయి. అధికారులు సకాలంలో ప్రజల పనులు పూర్తి చేస్తే వారికి ‘టిప్‌’ లేదా ‘గౌరవ ధనం’ ఇవ్వడంలో తప్పేమీ లేదన్నట్లుగా మంత్రి మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. మంత్రి మాటలపై ప్రజలు కార్యక్రమంలోనే అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు వాగ్వాద వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హాసన్‌ జిల్లాలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో మంత్రి శివలింగే గౌడ అధికారుల పనితీరుపై మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సంబంధించిన పనులను సకాలంలో పూర్తి చేస్తే వారికి ‘టిప్‌’ ఇవ్వడంలో తప్పేమీ లేదన్న భావన వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ‘అధికారులు ప్రజల పని చేస్తే వారికి లంచం ఇవ్వడం ధర్మమే’ అన్నట్లుగా మంత్రి మాట్లాడినట్లు వీడియోలో వినిపిస్తోంది. మంత్రి వ్యాఖ్యలపై అక్కడే ఉన్న ఓ వ్యక్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు తమ విధులను నిర్వర్తించేందుకు ప్రజలు ఎందుకు లంచం ఇవ్వాలని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు లంచాలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరికొందరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంత్రి తన వ్యాఖ్యలను వివరిస్తూ వివరణ ఇచ్చారు.

అధికారులు ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదన్నదే తన ఉద్దేశమని మంత్రి చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారులను గౌరవించాలనే ఉద్దేశంతోనే ‘టిప్‌’ గురించి ప్రస్తావించానని, తాను లంచాలను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రతరం కాకుండా హాసన్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఎస్‌ లతా కుమారి జోక్యం చేసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.

బీజేపీకి రాజకీయ అస్త్రం..
మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లంచాల వ్యవహారం ఏ స్థాయిలో ఉందో మంత్రి మాటలే బయటపెట్టాయని ఆరోపించింది. సాధారణ ప్రజల జేబుల నుంచి డబ్బులు తీసుకోవడాన్ని సమర్థించే ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని విమర్శించింది. బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి కూడా మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. లంచంగా కనీసం రూ.10 అడిగినా తనకు ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అదే ప్రభుత్వానికి చెందిన మంత్రి ఇప్పుడు అధికారులకు ‘గౌరవంగా లంచం ఇవ్వండి’ అన్నట్లుగా మాట్లాడటం విరుద్ధంగా ఉంది. లంచం ఇవ్వడం లేదా తీసుకోవడం మీకు సహజంగా అనిపించవచ్చు.. కానీ కర్ణాటక ప్రజలకు కాదు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: సర్‌ పేరుతో 7.8 కోట్ల ఓట్ల గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement