ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక అనివార్యమైతే ఆసక్తికరం | Sir Key Role In Khairatabad By Election | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక అనివార్యమైతే ఆసక్తికరం

Sep 20 2026 7:41 AM | Updated on Sep 20 2026 7:58 AM

Sir Key Role In Khairatabad By Election

సాక్షి,హైదరాబాద్‌: దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తర్వాత నిర్వహించనున్న తొలి ఉప ఎన్నిక అవుతుంది.  ఈ నేపథ్యంలో ‘సర్‌’ ద్వారా వెలువడిన నూతన ఓటర్ల గణాంకాలు నియోజకవర్గ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

ఉప ఎన్నికపై ప్రభావం.. 
ఈ ఉప ఎన్నిక మునుపటి ఎన్నికల కంటే భిన్నంగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్‌ ప్రక్రియ  ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేసింది. అర్బన్‌ నియోజకవర్గాల్లో నమోదయ్యే డబుల్‌ ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లతో గతంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు సాధారణమే. కాగా.. సర్‌ ముసాయిదా జాబితా ప్రక్షాళన కావడంతో బోగస్‌ ఓటింగ్‌ ఆధారపడే వ్యూహాలకు గండిపడింది. సర్‌కు ముందు ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,96,036 ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత మిగిలిన ఓటర్లు 1,72,564 మంది. మరణించిన, నివాసం మారిన, ఆచూకీ లేని, డూప్లికేట్‌ (ఏస్‌డీడీ) తొలగించిన ఓటర్లు 1,23,472. నగర పరిధిలో ఏకంగా 1.23 లక్షలకుపైగా నకిలీ/అసలు లేని ఓట్లు తొలగించడం ఒక రికార్డు. ఇది గత ఎన్నికలతో పోలిస్తే నియోజకవర్గ ఓటింగ్‌ సరళి, అభ్యర్థుల గెలుపోటములపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించనుంది.

సీరియస్‌ ఓటర్ల భాగస్వామ్యం.. 
కాగితాలపై ఉండే ఓటర్ల సంఖ్య తగ్గడంతో, ఉప ఎన్నికల్లో నమోదయ్యే ఓట్ల ఆధారంగా పోలింగ్‌ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉప ఎన్నికల్లో పోలింగ్‌ తగ్గుతుందనే అంచనా ఉన్నప్పటికీ, సవరించిన జాబితా వల్ల శాతంలో మెరుగుదల కనిపిస్తుంది. సర్‌ అనంతరం జరగనున్న పోలింగ్‌ కావడంతో సీరియస్‌ ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నేపథ్యంలో సర్‌ వల్ల పోయిన బోగస్‌ ఓట్లు ఏ పార్టీ ఆధారిత ఓటు బ్యాంకుని దెబ్బతీస్తాయనేది అభ్యర్థుల గెలుపోటములను శాసించే అవకాశం ఉంది. సర్‌ తెచ్చిన ఈ మార్పు ఏ పార్టీకి కలిసి వస్తుందో మరి!  

కార్యకర్తలూ.. నిరుత్సాహ పడొద్దు: దానం  
బంజారాహిల్స్‌: తన వెన్నంటి వుండే కార్యకర్తలెవరూ నిరుత్సాహ పడవద్దని, ఎప్పట్లాగే ఉత్సాహంగా తమ కార్యక్రమాలు చేసుకోవాలని ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నా రు. ఆయన ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేసిన తరువాత శనివారం ఉదయం పలువురు నేతలు, కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ ఘటనకు సంబందించి ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఆందోళన చెందరాదని కోరారు. ఇది ఒక విధంగా మన మంచికే అని, రాబోయే రోజులు ఇంకా బాగుంటాయని వెల్లడించారు. ఇలాంటివి తాను ఎన్నో చూశానని, మళ్లీ గెలిచి తీరుతామని, ఎప్పట్లాగే అందరూ కలిసికట్టుగా ఉండి తనకు అండగా నిలబడాలని కోరారు.

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement