సాక్షి,హైదరాబాద్: కేబీఆర్ పార్కు వద్ద వన్‌వే శాశ్వత అమలుతో నగరం నుంచి మాదాపూర్ వైపు రాకపోకలు సాగించే వారికి ఊరట లభిస్తోంది. దీంతో ప్రస్తుతం నగరం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు రాకపోకలు సాగించే వాహన చోదకుల కష్టాలపై యంత్రాంగం దృష్టి సారించింది. ట్రాఫిక్ చిక్కుల్ని తప్పించడానికి బంజారాహిల్స్ రోడ్ నెం.12 నుంచి షేక్‌పేట్ ఫ్లైఓవర్ వరకు భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.
కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించడానికి హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్–సిటీ) ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఏడు చొప్పున ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాలని భావించింది. ఈ పనులకు రూ.1,250 కోట్లు కేటాయించింది. నిర్మాణ పనుల కోసం అమలు చేసిన వన్ వే ఫలితాలు ఇవ్వడంతో దీన్ని శాశ్వతం చేయాలని నిర్ణయించారు.
ఆరు లేన్లతో..
తీవ్రమైన ఇబ్బందులు ఉన్న పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఓ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు రాకపోకలు సాగించే వారి కోసం దాదాపు తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ఆరులేన్లతో మరో కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఎమ్మెల్యేస్ కాలనీ మీదుగా షేక్‌పేట్ వరకు ఇది ఉండనుంది. ఈ మార్గంలో ఇప్పటికే సర్వే సైతం పూర్తి చేసిన అధికారులు కొన్నిచోట్ల మాత్రమే భూమి సేకరించాల్సిన అవసరం ఉందని తేల్చారు.
ఈ మార్గంలో రక్షణ శాఖకు చెందిన స్థలాల్లో పిల్లర్లు నిర్మించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ శాఖకు లేఖ రాసిన అధికారులు నిరభ్యంతర పత్రాలు కూడా పొందారు. పంజాగుట్ట–జూబ్లీహిల్స్ కారిడార్‌తో పాటే బంజారాహిల్స్–õÙక్‌పేట్ కారిడార్ పనుల్ని చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు
సమాచారం.


