మత్తు వదిలింది.. ఊరు మారింది! | Awakening People through Gopannagudem in Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

మత్తు వదిలింది.. ఊరు మారింది!

Sep 20 2026 1:38 AM | Updated on Sep 20 2026 1:38 AM

Awakening People through Gopannagudem in Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోపన్నగూడెంలో వెల్లివిరిసిన చైతన్యం

గ్రామంలో మద్యపానం, అమ్మకాలు పూర్తిగా నిషేధం 

ఆరేళ్లుగా 108 కుటుంబాల కట్టుబాటు, ఆర్థిక స్థిరత్వం 

పంచాయితీల్లేవు.. ప్రశాంతంగా ‘చింతచెట్టు కూడలి’ 

సంస్కృతి, ఆచారాలను కొనసాగిస్తూనే నవతరం బాట

మేకల కళ్యాణ్‌ చక్రవర్తి 
గోదావరి తలాపున ఉన్న ఓ గిరిజన గ్రామం గోపన్నగూడెం. ఇక్కడ 108 కుటుంబాలు నివసిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఇది ఉంది. ఇక్కడ నివసించేది మొత్తం కోయ తెగలే. రెండు కాపు కుటుంబాలు, ఒక వైశ్య కుటుంబం మినహా అంతా వారే ఉంటారు. అయితే ఈ గిరిజన గ్రామంలో చైతన్యం వెల్లివిరిసింది. అక్కడి మహిళల ధీరత్వం ఓ సామాజిక విపత్తును అవలీలగా అధిగమించేలా చేసింది. మద్య నిషేధం సాధ్యమయ్యింది. గత ఆరేళ్లుగా ఈ ఊళ్లో బెల్ట్‌షాపు లేదు. ఊళ్లో మద్యం అమ్మడానికి కానీ, తాగడానికి కానీ వీల్లేదు. గ్రామ మహిళా సమాఖ్య పుస్తకంలో ఈ మేరకు లిఖితపూర్వకంగా తీర్మానం చేశారు. గూడెం ప్రజలంతా కలిసికట్టుగా దీన్ని అమలు చేస్తున్నారు. తద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పును ఆస్వాదిస్తున్నారు.  

ఆరేళ్లకు ముందు.. 
సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ (ఇప్పుడు మాస్‌లైన్‌)కి చెందిన గొంది లక్ష్మణరావు 2019లో ఈ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో గ్రామంలో బెల్ట్‌షాపులు బీభత్సంగా నడిచేవి. చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్‌షాపులు లేకపోవడంతో నాలుగైదు గ్రామాల ప్రజలు ఇక్కడికే వచ్చి తాగి.. ఊగేవారు. గ్రామంలోని 300 ఏళ్ల చింతచెట్టు కూడలి వివాదాలకు కేంద్రమయ్యేది. భార్యాభర్తల పంచాయితీలు జరిగేవి. మద్యానికి బానిసలైన భర్తలను భరించలేక ఊరి కోడళ్లు పుట్టింటి బాట పట్టేవారు. మద్యానికి అలవాటు పడ్డవారు పొలం కూడా వెళ్లేవారు కాదు. కోళ్లు, ఇతర జంతువుల  దొంగతనాలు సర్వసాధారణం. పిల్లలకు ఉన్నత చదువులు దూరం. ఫీజులు కట్టకపోవడంతో 10 వరకు చదివి మానేసేవారు. గ్రామంలో 70–80% గుడిసెలే ఉండేవి.  

గ్రామస్తులతో మాట్లాడి.. 
కొందరు గ్రామ మహిళల విజ్ఞప్తి నేపథ్యంలో ఈ పరిస్థితులపై లక్ష్మణరావు దృష్టి పెట్టారు. గ్రామస్తులతో మాట్లాడారు. మహిళలందరినీ చైతన్యపరిచారు. మద్య నిషేధంపై తీర్మానం చేయించారు. గ్రామ సమాఖ్య పుస్తకంలోనూ రాశారు. ఈ తీర్మానం ప్రకారం గోపన్నగూడెంలో మద్యం అమ్మితే సీసాలు నిర్దాక్షిణ్యంగా పగులగొడతారు. ఒకవేళ గ్రామస్తులపై కేసులు పెడితే సర్పంచ్‌ ఆ ఖర్చులను భరిస్తాడు. గ్రామంలో మందు అమ్మితే కేసు తీవ్రతను బట్టి రూ.20 వేల వరకు జరిమానా వేస్తారు. ఇక్కడ సారా అమ్మడంతో పాటు తయారీ నిషేధమే. ఏదైనా తేడా వస్తే 100 గుంజీలు కూడా తీయాల్సి ఉంటుంది. 

ఆరేళ్లలో అదిరిపోయే మార్పు 
ఆ తీర్మానమే ఆ ఊరి తలరాతను మార్చేసింది. గుడిసెలు దాబాలయ్యాయి. అందరూ పొలం పనులకు వెళుతున్నారు. పిల్లలు నిరాటంకంగా చదువుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం సత్తుపల్లి, ఖమ్మం, దమ్మపేటలకు వెళుతున్నారు. ఒక అబ్బాయి అయితే హైదరాబాద్‌కు వచ్చాడు. కేవలం ఒక్క మద్యం ఛాయలు ఆ ఊళ్లో లేకపోవడం..ఊహకు అందని మార్పును తీసుకువచ్చిందని అంటున్నారు. 

మహిళల సహకారంతోనే సాధ్యం 
నేను సర్పంచ్‌ అయ్యాక గ్రామ మహిళలు కొందరు వచ్చి ఊళ్లో మద్యం అమ్మకుండా చూడాలని కోరారు. అయితే వారి సహకారంతోనే మద్యం అమ్మకాలపై నిషేధం విధించాం. ప్రస్తుతం మా ఊళ్లో ఒక్క బెల్ట్‌ షాపు కూడా లేదు. 
– గొంది లక్ష్మణరావు, మాజీ సర్పంచ్‌

మహిళలతో కలిసి నిలబడ్డాం.. 
మా గ్రామంలో మద్యం అమ్మకాలు ఆపడం అంత సులభం కాదనుకున్నాం. కానీ మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆడవాళ్లు చెప్పింది నిజమే అనిపించింది. అందుకే మేము కూడా వాళ్లతో కలిసి నిలబడ్డాం. ఎవ్వరూ ఊళ్లో మద్యం అమ్మకూడదని అందరం కలిసి నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి మా ఊళ్లో మద్యం అమ్మకాలు జరగడం లేదు. 
– పూసం మంగరాజు 

ఆదాయం సద్వినియోగం 
మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో కుటుంబాల్లో గొడవలు తగ్గాయి. సంపాదించిన డబ్బును ఇంటి అవసరాలకు, పిల్లల చదువులకు వినియోగమవుతోంది. ఇది ఒకరి నిర్ణయం కాదు.. ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయం. అందుకే ఎన్నేళ్లయినా నిరాటంకంగా అమలవుతోంది. 
– కలం మంగమ్మ  

నోరూరే.. కుశిరి 
ఈ గూడెం ప్రజలు తినే కూరలు వెరైటీగా ఉంటాయి. ఇక్కడి భాషలో కుశిరి అంటే కూర అని అర్థం. వెదురు కొమ్ములతో చేసే కర్‌కుక్‌ కుశిరి, గురుగు ఆకుతో చేసే కిక్కల్‌ కుశిరి, కొడ్డీలు చెట్టు చిగురుతో చేసే కొడ్డెల్‌ కుశిరి, బొద్దె తీగతో చేసే బొద్దుం కుశిరి ఇక్కడి ప్రత్యేకతలు. అయితే బొద్దుం కుశిరి అంటే పప్పులో బొద్దె తీగను పెడతారు. ఈ కూర తింటే ఆహా ఏమి రుచి అనక మానరని గ్రామస్తులు చెప్పడం విశేషం.  

చేతిపంపు నీళ్లే 
ఈ గూడెంలో మిషన్‌ భగీరథ ట్యాంక్‌ ఉంది. ప్రతి ఇంటికీ నల్లా ఉంది. కానీ గ్రామస్తులు ఈ నల్లా నీళ్లు తాగరు. ఊళ్లో ఉన్న చేతిపంపు నీటిని మాత్రమే తాగుతారు. ఎందుకని అడిగితే.. ‘గోదావరి నుంచి పైపులతో నీళ్లు తెస్తున్నారు. గోదావరి ఎగువన ఎవరో చనిపోయి ఉంటారు. వ్యర్థాలు వస్తాయి.. మలమూత్రాదులూ కలుస్తాయి. అందుకే ఆ నీళ్లు తాగం. బట్టలు ఉతుక్కుంటాం. అంట్లు తోముకుంటాం. స్నానాలు చేస్తాం కానీ తాగాలంటే మాత్రం భూమి నుంచి వచ్చే నీళ్లే తాగుతాం.’అని చెప్పారు.  

ప్రాణాపాయం అనుకుంటేనే ఆసుపత్రికి.. 
ఈ గూడెంలో ఇప్పటికీ నాటు వైద్యం అందుబాటులో ఉంది. అశ్వారావుపేట నుంచి ఆర్‌ఎంపీ డాక్టర్లు గూడెంలోకి వచ్చి వెళ్తారు. కానీ విరివిగా ఉపయోగించేది మాత్రం వేర్లు, నాటు మందులే. చిన్న చిన్న ఇబ్బందులకు మందులు వాడరు. ప్రాణపాయం అనుకుంటేనే ఆసుపత్రికి వెళ్తారు.  

పండుగలు ప్రత్యేకం 
తొలకరి వర్షాలు పడినప్పుడు జూన్‌లో భూదేవి పండుగ, జొన్నలు, రాగులు చేతికొచ్చినప్పుడు సెపె్టంబర్‌లో కొత్తల పండుగ, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడి కాయ పండుగ జరుపుకుంటారు. పండుగ జరిగాకే మామిడి కాయలు ముట్టుకుంటారు. ముత్యాలమ్మ పండుగ కూడా చేస్తారు.  

పెండ్లి పిరం 
ఇక్కడి గిరిజనుల్లో వరకట్న సంప్రదాయం లేదు. ఇంటికి వచ్చే కోడలు కుటుంబాన్ని నడపగలుగుతుందా.. వ్యవసాయంలో భర్తకు సాయంగా ఉండగలుగుతుందా అన్నది మాత్రమే చూస్తారు. గతంలో ఐదు రోజులు జరిగే పెళ్లి తంతు ఇప్పుడు ఒక్కరోజులో ముగిస్తున్నామని గ్రామస్తులు చెప్పారు. అయితే పెండ్లి మాత్రం చాలా ఖరీదయిపోయింది. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామంలోని అందరికీ భోజనాలు పెడుతూనే ఉండాలి. ఏ సమయంలో వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా కాదనకూడదు. ఆవు మాంసం, చికెన్, మటన్‌ తప్పనిసరి.  

చేపను కూడా బాణంతో ఛేదించి 
ఈ గూడెంలో ప్రతిభకు కొదవలేదు. అంతర్జాతీయ విలుకారుడు గొంది మారెప్పది ఈ గూడెమే. రష్యా, ఇటలీ, ఏథెన్స్, మాల్టా దీవుల్లో పర్యటించి దేశానికి అనేక పతకాలు అందించిన 80వ దశం నాటి విలుకారుడీయన. ఇక్కడి వారి గురి ఎలా ఉంటుందంటే.. బాణంతో నీటిలో ఈదుతున్న చేపను కూడా చటుక్కున పట్టుకుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement