ఇక అప్పులపైనే ఆధారపడం | Bhatti Vikramarka Comments At financial resources conference | Sakshi
Sakshi News home page

ఇక అప్పులపైనే ఆధారపడం

Sep 20 2026 2:04 AM | Updated on Sep 20 2026 2:04 AM

Bhatti Vikramarka Comments At financial resources conference

ఢిల్లీలో శనివారం జరిగిన ఆర్థిక వనరుల సమీకరణ సదస్సులో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఆర్థిక వనరుల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి  

కీలక ప్రాజెక్టులకు నిధుల కోసం ప్రైవేటు పెట్టుబడులపై దృష్టిపెడతాం... పెట్టుబడిదారుల నష్టభయం తగ్గించేలా ప్రభుత్వ నిధులను వ్యూహాత్మకంగా వినియోగిస్తాం  

30 వేల ఎకరాల్లో నెట్‌–జీరో మెగాసిటీగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఇకపై కేవలం ప్రభుత్వ రుణాలపైనే ఆధారపడే పాత విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చుకొనే విధానంలో కచ్చితమైన మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం జరిగిన ‘వికసిత్‌ భారత్‌ దిశగా దేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ’సదస్సులో తెలంగాణ నుంచి భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, ఇతర కీలక ప్రాజెక్టుల కోసం ఇకపై ప్రైవేటు పెట్టుబడులు, సంస్థాగత నిధులు, సావరిన్‌ ఫండ్స్‌ను భారీగా సమీకరించే నమూనా వైపు రాష్ట్రం దృష్టి సారిస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారుల రిస్‌్కను తగ్గించడానికి, వయబిలిటీ గ్యాప్‌ పూడ్చడానికి ప్రభుత్వ నిధులను వ్యూహాత్మకంగా వినియోగిస్తామన్నారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), గ్రీన్‌ బాండ్లు, బ్లెండెడ్‌ ఫైనాన్స్‌ మార్గాలను మరింత బలోపేతం చేస్తామని భట్టి వివరించారు. 

వికసిత్‌ భారత్‌లో తెలంగాణ కీలకం.. 
దేశాన్ని 2047 నాటికి అభివద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న వికసిత్‌ భారత్‌ ప్రయాణంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2025–26 నాటికి తెలంగాణ జీఎస్‌డీపీ రూ. 17.82 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ఇది 10.7 శాతం వృద్ధి అని.. స్థిర ధరల ప్రకారం వాస్తవ జీఎస్‌డీపీ వృద్ధి 8.5 శాతంగా అంచనా వేశామని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు రూ. 2,19,575తో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండి రూ. 4,18,931కి చేరిందని భట్టి గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే లక్ష్యమని వివరించారు. రాష్ట్ర సమతుల్య అభివృద్ధి కోసమే క్యూర్, ప్యూర్, రేర్‌ అనే ప్రత్యేక నమూనాను అమలు చేస్తున్నట్లు భట్టి వివరించారు. అలాగే దేశంలోనే తొలి నెట్‌–జీరో, ఏఐ ఆధారిత గ్రీన్‌ మెగాసిటీగా 30 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామని భట్టి వెల్లడించారు. 

యువతే తెలంగాణ అసలైన బలం... 
రాష్ట్ర యువతే తెలంగాణ అసలైన బలమని భట్టి పేర్కొన్నారు. ఉన్నత విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. సామాజిక భద్రత, మెరుగైన వైద్యం, మహిళా సాధికారతతో కూడిన సమ్మిళిత అభివృద్ధే రాష్ట్ర విధానమని భట్టి వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement