‘కస్తూరి’పై మంచి నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

‘కస్తూరి’పై మంచి నిర్ణయం

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

శివాజీనగర: సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు 3 రోజుల పాటు శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం కస్తూరిరంగన్‌ రూపొందించిన నివేదిక, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితిపై చర్చిస్తారు. గత నెలలో జరిగిన 11 రోజుల వర్షాకాల సమావేశాలు అప్పటి మంత్రి నాగేంద్ర రాజీనామా కోరుతూ బీజేపీ తీవ్ర నిరసనలు చేయడంతో రసాభాసగా మారడం తెలిసిందే. రోజూ అసెంబ్లీలో రభస చెలరేగి చర్చలు జరగక్కుండా పోయాయి. అలా వర్షకాల సమావేశాల కార్యకలాపాలు ఏమాత్రం ఫలవంతం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రధానమైన సమస్యలపై చర్చ కోసం 3 రోజులు అసెంబ్లీ జరపాలని సీఎం డీకే శివకుమార్‌ నిర్ణయించారు.

డీకే సర్కారు వ్యూహం

అసెంబ్లీలో కస్తూరి రంగన్‌ నివేదిక, కరువు పరిస్థితిపై మాత్రమే చర్చలు జరుగుతాయి. మరో అజెండా ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరువు రైతులను ఆదుకోవడం లేదని, తాగునీరు, విద్యుత్‌ సమస్యతో సహా పలు అంశాలను లేవనెత్తాలని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రతిపక్షాల ను ఎదుర్కొనాలని సీఎం డీకే ఆధ్వర్యంలో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంసిద్ధంగా ఉన్నారు. కస్తూరిరంగన్‌ నివేదిక మీద కేంద్ర ప్రభుత్వమే నోటిఫికేషన్‌ ఇచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ మీద దాడి చేసే అవకాశముంది.

నివేదికపై మల్నాడులో

ఆగ్రహజ్వాలలు

పశ్చిమ కనుమలపై కస్తూరి రంగన్‌ నివేదికపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే, రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మల్నాడు ప్రాంత ప్రజలకు ఇది ప్రాణాంతకం అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నివేదికను ఆమోదించకూడదని నిరసనలు మొదలయ్యాయి. 5 జిల్లాల్లోని పశ్చిమ కనుమలలో అక్రమంగా గ్రామాలు, వ్యవసాయ ప్రాంతాలు వెలిశాయని, వాటిని తొలగించాలని నివేదికలో సిఫార్సు చేయడం కలకలానికి కారణమైంది. శనివారం చిక్కమగళూరు జిల్లాలో సీఎం డీకేను ప్రజలు ముట్టడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చని తెలుస్తోంది.

శివాజీనగర: పశ్చిమ కనుమల పరిరక్షణ– కస్తూరి రంగన్‌ నివేదిక గురించి ఎమ్మెల్యేలు, రైతులతో సహా అందరితో మాట్లాడాను. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చిచి నిర్ణయం తీసుకుంటాం అని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ తెలిపారు. సీఎం ఆదివారం హాసన్‌ జిల్లా సకలేశపురలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, ప్రజలతో చర్చలు జరిపిన తరువాత మీడియాతో మాట్లాడారు. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలో మేము కస్తూరి రంగన్‌ నివేదికను తిరస్కరించాము. కానీ కేంద్రం దానిని పరిగణించలేదు, నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. అందువల్ల నేను ప్రజల సమస్యలను వినాలని వచ్చాను. శివమొగ్గ, కొడుగు, ఉడుపి, హాసన్‌, చిక్కమగళూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, రైతులు, అటవీ ప్రాంతాల సమీపంలో నివసిస్తున్న ప్రజలతో చర్చించి సమస్యలను విన్నాను. నివేదిక వల్ల తలెత్తే సమస్యల గురించి నాకు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలన్నింటిపై చర్చిస్తాం. ఆ తరువాత రైతులకు అనుకూలమైన మంచి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ రాజకీయాల వల్ల గత సమావేశంలో కరువు, కస్తూరి రంగన్‌ నివేదిక గురించి చర్చించలేకపోయామన్నారు. నేను బాధ్యతలు చేపట్టి కేవలం 100 రోజులే అయింది, బీజేపీ వాళ్లకున్నంత అనుభవం నాకు లేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సకలేశపురలో ఆర్భాటంగా రోడ్‌ షో జరిపారు.

నేటి నుంచి 3 రోజులు

ప్రత్యేక సమావేశాలు

కరువు, పశ్చిమ కనుమలు–కస్తూరి

రంగన్‌ నివేదికపై చర్చ

కాంగ్రెస్‌, బీజేపీ సంసిద్ధం

నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం

హాసన్‌ జిల్లా పర్యటనలో సీఎం డీకే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement