వీలింగ్‌ పోకిరీలతో యాక్సిడెంటు | - | Sakshi
Sakshi News home page

వీలింగ్‌ పోకిరీలతో యాక్సిడెంటు

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

మినీ బస్సులో ఒకరి మృతి

బనశంకరి: బైక్‌ వీలింగ్‌ చేసే అల్లరిమూకలకు ఓ అమాయకుడు బలికాగా ఐదుమంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు... లగ్గెరె నివాసి మనోజ్‌ (25) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఐదుమంది స్నేహితులు ఆదివారం తెల్లవారుజామున డ్రైవర్‌ రవితో మినీ బస్సులో మైసూరు టూర్‌కి బయల్దేరారు. అన్నపూర్ణేశ్వరి నగర మహదేశ్వర ఆలయం వద్ద పోకిరీలు బైక్‌ వీలింగ్‌ చేస్తూ హఠాత్తుగా అడ్డు వచ్చారు. దీంతో మినీ బస్సు డ్రైవరు అదుపుతప్పి డివైడర్‌ ను దాటుకుని విద్యుత్‌ స్థంభాన్ని ఢీకొట్టాడు. డ్రైవరు పక్క సీట్లో కూర్చున్న మనోజ్‌ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. డ్రైవరుతో సహా మిగతావారు గాయపడ్డారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఓటరులారా..

చెక్‌ చేసుకోండి

బనశంకరి: గ్రేటర్‌ బెంగళూరు అధికారులు సర్‌ జాగృతి అభియాన నిర్వహించారు. అర్హులైన ఓటర్లు పేర్లు ఉన్నాయో లేదో నూతన ఓటరు జాబితాలో తనిఖీ చేసుకోవాలని, లేని పక్షంలో పేర్లు నమోదుకు దరఖాస్తు చేయాలని మనవిచేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ జగదీష్‌, అదనపు కమిషనర్‌ వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు దక్షిణ నగర పాలికేలో డొళ్లుకుణిత ద్వారా జాగృతి అభియాన నిర్వహించారు. కమిషనర్‌ కేఎన్‌.రమేశ్‌ అదనపు కమిషనర్‌ రాచప్ప పాల్గొన్నారు.

రిజర్వు పోలీసు

ఉద్యోగాలకు పరీక్షలు

శివమొగ్గ: కేఎస్‌ఆర్‌పి పోలీస్‌ కానిస్టేబుల్‌, ఆర్‌పిసి కెకె కేడర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష ఆదివారం జరిగింది. జిల్లాలో శివమొగ్గ, భద్రావతిలోని వివిధ పరీక్షా కేంద్రాలలో 34 సెంటర్లలో సాగింది. 12 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. ప్రతి గదిలో సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షను చాలా విజయవంతంగా నిర్వహించినట్లు పోలీస్‌ శాఖ తెలిపింది.

2,314 పోస్టుల..

యశవంతపుర: రాష్ట్రంలో 2,314 రిజర్వు కానిస్టేబుల్స్‌ పోస్టులకు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 333 కేంద్రాలలో లక్ష 42 వేల మంది పరీక్ష రాశారు. గేట్ల వద్ద ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగిశాయి.

ఆ పేలుడు ప్రమాదం కాదా?

దొడ్డబళ్లాపురం: బెళగావిలోని చవాట్‌ వీధిలో వినాయక చవితి రోజున ఒక ఇంట్లో ఫ్రిడ్జ్‌ పేలి అగ్నిప్రమాదం జరిగి తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు, మరో మహిళ మృత్యువాత పడడం తెలిసింది. సీసీ కెమెరాల చిత్రాల్లో మరో సంగతి బయటపడింది. పేలుడుకు ముందు ఓ అపరిచితుడు బకెట్‌తో ఆ ఇంటి వద్దకు వచ్చి కాసేపటికి ఖాళీ బకెట్‌తో పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. అతనికి, ప్రమాదానికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కావాలనే పేలుడుకు పాల్పడి ఉంటారనే అనుమానాలు ఊపందుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement