ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు | Harish Rao comments on Congress party | Sakshi
Sakshi News home page

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

Sep 21 2026 6:21 AM | Updated on Sep 21 2026 6:21 AM

Harish Rao comments on Congress party

సిరబోయిన మల్లేశ్‌ యాదవ్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న హరీశ్‌రావు, చిత్రంలో గొంగిడి సునీత

రాష్ట్రంలో రైతు పాలనపోయి.. రాక్షస పాలన వచ్చింది 

మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

యాదగిరిగుట్ట: ‘రాష్ట్రంలో రైతు పాలన పోయి.. రాక్షస పాలన వచ్చింది.. ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువు’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌ మండల కేంద్రంలో ఆదివారం డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేశ్‌ యాదవ్, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శోభన్‌రెడ్డితో పాటు పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం మోటకొండూర్‌లోని విద్యుత్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ లాగ్‌ బుక్స్‌ దాచిపెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తాము వస్తున్నామని చెప్పి మోటకొండూర్‌ సబ్‌ స్టేషన్‌లో లాగ్‌ బుక్‌లను దాచిపెట్టారన్నారు. రైతులకు 24 గంటల కరెంట్‌ ఎందుకు వస్తలేదో చూసే బాధ్యత ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు, కాంగ్రెస్‌ నేత కేవీపీ ఇల్లు, ప్రభుత్వ విప్‌ మహేందర్‌రెడ్డి ఇల్లు, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నవి కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. 22ఏ నిషేధిత జాబితాపై, కాంగ్రెస్‌ అక్రమాలపై ప్రశ్నిస్తే, భూ కుంభకోణాలను బయటకు తీస్తే బీఆర్‌ఎస్‌ నేతలపై కక్షకట్టి బద్నాం చేస్తున్నారన్నారు. 

సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం..
కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు, కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ, మంత్రుల ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు మేము సిద్ధం.. మీరు సిద్ధమా అని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు ఎత్తి రైతాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని సూచించారు. నల్లగొండ జిల్లాలో 4వేల మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ కడితే 1,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికావడం లేదని, భద్రాద్రిలో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేశారన్నారు.

 కొత్తగూడెంలో బొగ్గు లేదని 800 మెగా వాట్ల విద్యుత్‌ ఆపేశారన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బొగ్గు లేదని 3,500 మెగావాట్ల విద్యుత్‌ నిలిపివేసి రైతులకు కరెంట్‌ కోతలు పెట్టారన్నారు. రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement