విశాఖలో బాబు మార్క్‌ విధ్వంసం.. తూర్పు కొండల్లో అనకొండలు! | Sakshi ground report on massive devastation by Chandrababu Govt | Sakshi
Sakshi News home page

విశాఖలో బాబు మార్క్‌ విధ్వంసం.. తూర్పు కొండల్లో అనకొండలు!

Sep 21 2026 5:56 AM | Updated on Sep 21 2026 5:56 AM

Sakshi ground report on massive devastation by Chandrababu Govt

ఈ ఫొటోలో ఉన్న కొండ పేరు ఊరి కొండ. ఈ కొండకు రెండు వైపులా జోరుగా సాగుతున్న తవ్వకాలతో ఇప్పటికే సగం పచ్చదనం మాయమైంది. మరి కొద్ది రోజుల్లో ఊరి కొండ కాస్తా ఊరిలోనే లేకుండా కనుమరుగు కానుంది.

సింహాచలం మొదలు ఐటీ హిల్స్‌ వరకూ పచ్చని కొండలు పిండిపిండి

ఏకంగా పది కొండలపై అడ్డగోలు తవ్వకాలు

ఎక్కడ చూసినా కొండలకు బోడిగుండులే.. నగరానికి నీటి గండం

కనుమరుగవుతున్న చారిత్రక ఆనవాళ్లు

భారీ మైనింగ్‌తో ప్రమాదంలో చారిత్రక అల్లూరి గుహలు 

హైగ్రేడ్‌ అల్యూమినియం దొడ్డి దారిన ఒడిశా తరలింపు..

నగరాన్ని పర్యావరణ విపత్తుల నుంచి కాపాడటంతోపాటు ప్రాణ వాయువు అందిస్తున్న కొండలపై సర్కారు గునపం

ప్రకృతి విధ్వంసంతో విశాఖకు పొంచి ఉన్న పెను ముప్పు.. 

తీవ్ర విపత్తులు తప్పవని హెచ్చరిస్తున్న పర్యావరణవేత్తలు 

సాగర తీరంలో పెను విధ్వంసంపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అప్పన్న కొండ.. పావురాల కొండ.. పెద్ద కొండ.. తర్లువాడ కొండ.. రామకొండ.. గంగాలమ్మ కొండ.. పంచదార్ల కొండ.. ఇలా సాగర తీరంలో అన్ని కొండలను చంద్రబాబు సర్కారు పిండి చేస్తోంది. విశాఖలో ఏకంగా 10 ప్రధాన కొండల్లో విధ్వంసం సృష్టిస్తోంది. తమ అనుయాయులకు కొండలను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ విధ్వంసకాండతో నగర ప్రజలకు తీవ్ర పర్యావరణ సమస్యల ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నగరాన్ని పర్యావరణ విపత్తుల నుంచి కాపాడటంతోపాటు పచ్చని చెట్లతో ప్రాణ వాయువు అందించే కీలక కొండలు కనుమరుగైతే తీవ్ర విపత్తులు తప్పవని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కళకళలాడిన కొండలు తమ కళ్ల ముందే బోడిగుండుగా మారిపోవటాన్ని చూసి చంద్రబాబు సర్కారుపై నగర ప్రజలు మండిపడుతున్నారు.   

విశాఖ గుండెలపై గునపం.. 
విశాఖ అందమంతా ఒకవైపు నీలి సముద్రం.. మరోవైపు పచ్చని కొండల మధ్య సేద తీరడంలోనే ఉంది. ప్రకృతి ప్రసాదించిన అందాలతో కనువిందు చేసే కొండలు నగరానికి ప్రాణ వాయువు అందించే లంగ్స్‌ లాంటివి. పోర్టు నుంచి వెలువడే కాలుష్యా­న్ని భారీగా తగ్గిస్తోంది ఈ కొండలే. పర్యావరణ సమతుల్యతతోపాటు వాతావరణ ఇబ్బందుల ప్రభా­వం, ప్రకృతి విపత్తుల నుంచి నగర ప్రజలను కాపాడుతూ గుండెల్లో పెట్టుకుని కాపాడుతున్నా­యి. అలాంటి ప్రాంతంలో విచ్చలవిడిగా విధ్వంసానికి చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపింది. ఒక్కో కొండకు గురిపెట్టి మరీ కరగదీస్తోంది. ఈ పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో విశాఖ ప్రజలు తీవ్ర కాలుష్యంతో పాటు వాతావరణ దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని  పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. 

అత్యంత విలువైన భూములు అనుయాయులకు.. 
చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల పేరుతో అనుయాయులకు అత్యంత విలువైన భూములను కారుచౌకగా అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సత్వ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఐటీ కంపెనీ ఏర్పాటు పేరుతో విలువైన భూమిని అప్పగించింది. ఐటీ క్యాంపస్‌ పేరుతో 30 ఎకరాలను కారుచౌకగా కొట్టేసిన సత్వ కంపెనీ అందులో 50 శాతం భూములను మరో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఓర్వెల్‌కు బదలాయించింది. ఇక భీమిలి బీచ్‌కు సమీపంలోని పావురాల కొండను కూడా మైరా బే వ్యూ రిసార్ట్స్‌ పేరుతో 15 ఎకరాలు అప్పగించింది. ఇక్కడ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఉన్న బౌద్ధమత ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి.  

అల్లూరి గుహల్లో అడ్డగోలు తవ్వకాలు...
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో అధికార కూటమి నేతల అండతో సాగుతున్న భారీ మైనింగ్‌ కారణంగా చారిత్రక అల్లూరి గుహలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. 1/70 చట్టం అమలులో ఉన్న ఈ ప్రాంతంలో గిరిజనుల పేర్లతో ఇప్పటికే 130.5 హెక్టార్లలో మైనింగ్‌ చేస్తున్నారు. జర్తా లక్ష్మణరావు పేరుతో 110 హెక్టార్లు, సర్వే నంబర్‌ 532లో మరో 20.5 హెక్టార్లలో తవ్వకాలు జరుపుతూ ఇప్పటికే 18 లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించారు, మరో 20 లక్షల టన్నుల తరలింపునకు ప్రణాళికలు వేశారు. తాజాగా సింగం భవానీ పేరుతో మరో 36 హెక్టార్లలో మైనింగ్‌ కోసం దరఖాస్తు చేశారు. దీనికి అనుమతి లభిస్తే.. నాడు స్వాతంత్య్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ‘మన్యం పితూరి’కి ప్రణాళికలు రచించిన అసగిరి గ్రామ పరిధిలోని గంగాలమ్మ కొండలో ఉన్న 7 గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 

నిబంధనలకు విరుద్ధంగా 60 అడుగులకు బదులు 100 అడుగుల లోతులో తవ్వకాలు జరపడం వల్ల నాగులకొండ కుంచించుకుపోయి చుట్టుపక్కల 10 గిరిజన గ్రామాలకు తాగునీరు, వంటచె­ర­కు కష్టాలు ఎదురవుతు­న్నా­యి. తక్కువ నాణ్యత (38–40% అల్యూమిని­యం) ఉన్న లేటరైట్‌ అని రికార్డుల్లో చూపిస్తూ ప్రభుత్వానికి తక్కువ రాయల్టీ కడుతున్నారు. వాస్తవానికి బాక్సైట్‌తో సమానమైన 45% అల్యూమినియం ఉన్న హైగ్రేడ్‌ ఖనిజాన్ని ఒడిశాలోని వేదాంత లాంటి ప్లాంట్లకు తరలిస్తున్నారు. రోజుకు 20 వేల టన్నుల చొ­ప్పు­న (టన్నుకు రూ.5 వేల ధరతో) సుమారు రూ.10 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. అటవీ అనుమతులు లేని రహదారుల ద్వారా కాకినాడ జిల్లా రౌతులపూడి మీదుగా ఈ అక్రమ రవాణా సాగుతోంది. అక్రమంగా తరలిస్తున్న ప్రతి టన్నుకు ‘చినబాబు’కు రూ.500, మరో ఇద్దరు ఎంపీలకు చెరో రూ.250 చొప్పున వాటాలు అందుతున్నాయని ఆరోపణలున్నాయి. స్థానిక కీలక నేత కుమారుడు ఈ వ్యవహారాన్నంతా నడిపిస్తున్నారని, చరిత్రను చెరిపేసేలా కూటమి నేతలు మైనింగ్‌ మాఫియాకు పాల్పడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

పంచదార్ల కొండలపైనా విధ్వంసమే..
పంచదార్ల కొండలపై అక్రమ మైనింగ్‌ వ్యవహారం తీవ్ర వి­వాదాస్పదంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మొత్తం 3 మైనింగ్‌ లీజులను మంజూరు చే­శా­రు. ఇందులో అన­కాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ అల్లుడికి చెందిన రెండు సంస్థలతో పాటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు సన్నిహితుడైన మరో ఎంపీ సిఫార్సు చేసిన ’శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్‌’ సంస్థ కూడా ఉంది. ఈ తవ్వకాల వల్ల ప్రాచీన శైవక్షేత్రానికి, పురావస్తు కట్టడాలకు ముప్పు వాటిల్లుతోందని, పంచదార్లలో ఒక నీటి ధార ఆగిపోయిందని స్థానికులు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ స్థాయిలోనూ పోరాడారు. దీంతో సీఎం రమేష్‌ అల్లుడికి చెందిన 2 లీజులను అధికారులు రద్దు చేశా­రు. కానీ జనసేన ఎంపీ ఒత్తిడితో సర్వే నెంబరు 156/పీ లో 5 హెక్టార్ల విస్తీర్ణంలో (18 జూలై 2025న అనుమతులు పొందిన) లక్ష్మీనరసింహ మినరల్స్‌ తవ్వకాలు మాత్రం యథేచ్ఛగా సా­గా­యి. 

వైఎస్సార్‌సీపీ ఆందోళన ఉధృతం చేయడంతో ఎట్టకేలకు అధికారులు ఆ మూడో లీజును తాజాగా రద్దు చే­శా­రు. అయితే ఎంత మేర అక్రమ తవ్వకాలు జరిగాయి? వాటి విలువ ఎంత? ఎంత పెనాల్టీ విధిస్తున్నారు? అనే కీలక వివరాలను మైనింగ్‌ రద్దు నోటీసులలో ప్రభుత్వం వెల్లడించకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో కింది స్థాయి అధికారులను బలిపశువులను చేస్తూ కొత్తగా వచ్చిన తహశీల్దార్, వీఆర్‌వోపై వేటు వేశారు. మైనింగ్‌ ఏడీని సస్పెండ్‌ చేశారు. అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన గ్రామస్తులపై కేసులు పెడతానని బెదిరించిన రాంబిల్లి సీఐని, ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన ఆర్‌డీవోను వదిలేశారు. రాంబిల్లిలో న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌కు భారీ బోల్డర్లను తరలించే టిప్పర్లను సైతం అధికార పార్టీ నేతలకు మామూళ్ల వ్యవహారంలో సీఐ అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం పంచదార్ల కొండలను నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విష్ణు పాదాల జాడ ఏదీ...! 
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ వద్ద ఉన్న కొండకు ఇప్పటికే సగానికిపైగా ఎసరు పెట్టేశారు. ఇదే తర్లువాడ కొండలపై విష్ణు పాదాలు ఉన్నాయని... ఈ కొండలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎవరికో కట్టబెడుతోందంటూ గతంలో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. వాటిని ఎవరికీ కేటాయించే ప్రతిపాదన లేదని అప్పట్లో గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, సనాతన ధర్మానికి నష్టం చేకూరుస్తున్నారంటూ ఎల్లో మీడియా విష ప్రచారం సాగించింది. అప్పటి వైఎస్సార్‌సీపీ ఎంపీ కుమార్తెకు కేటాయిస్తున్నారంటూ గగ్గోలు పెట్టింది. తాజాగా చంద్రబాబు సర్కారు ఏకంగా సగం కొండను కరిగించినా... మిగిలిన సగం కొండ మరికొద్ది రోజుల్లో కనుమరుగవుతున్నా విష్ణుపాదాలు గురించి ఎల్లో మీడియా నోరు విప్పక పోవడం గమనార్హం  

రామయ్య పాదాల సాక్షిగా..  
అనకాపల్లి జిల్లా రాంబిల్లి (గతంలో రాముడి పల్లె ‘రాంపల్లి’) రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 142లో ఉన్న చారిత్రక రామకొండపై కూటమి నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా 5 ఎకరాల్లో అక్రమ తవ్వకాలకు తెగబడ్డారు. శ్రీరామచంద్రుడు భద్రాచలం వెళ్లేముందు ఇక్కడ సేదతీరాడని ప్రతీతి. దీనికి గుర్తుగా పురావస్తు శాఖ గుర్తింపు పొందిన రామసూ్థపం, రాముడి పాదాలు ఇక్కడ ఉన్నాయి. అయితే కూటమి నేతలు రాత్రిపగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతుండటంతో ఆ ఆనవాళ్లకు తీవ్ర ముప్పు వాటిల్లింది. ఇప్పటికే పంచదార్ల శైవక్షేత్రంలో అక్రమ మైనింగ్‌ ద్వారా ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేసి తన అల్లుడి ద్వారా రూ.10 కోట్ల మేర తవ్వకాలు జరిపించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ అడుగుజాడల్లోనే.. ఇక్క­డి నాయకులు దేవుడి కొండను కనుమరుగు చేస్తున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్‌లోని పరిశ్రమల అవసరాలను ఆసరాగా చేసుకుని, అక్రమంగా తవి్వన ఒక్కో గ్రావె­ల్‌ ట్రిప్పును రూ.12 వేలకు విక్రయిస్తున్నారు. ఇందులో రూ.2 వేలు స్థానిక ప్రజాప్రతినిధులకు, మరో రూ.2 వేలు రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా శాఖ అధికారులకు మామూళ్ల రూపంలో పంచుతున్నారు. ఇప్పటికే కూటమి నేతలు రామకొండ వ్యవహారంలో రూ. 2 కోట్ల మేర అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అప్పన్నకూ ఎసరు...! 
ఒకవైపు పచ్చని కొండలను పిండి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కన్ను ఏకంగా సింహాచలం అప్పన్న కొండలపైనా పడింది. నగర నడిబొడ్డున ఉన్న సింహాద్రి అప్పన్నకు చెందిన భూమిని సైతం డేటా సెంటర్‌కు అప్పగించింది. ఇక్కడ 160 ఎకరాల భూమి అప్పగించడంతో నగర ప్రజలకు తీవ్ర నీటి ఇక్కట్లు  ఎదురు కానున్నాయి. ఇక్కడ సింహాచలం కొండ నుంచి వచ్చే వర్షపు నీరు నేరుగా ముడసర్లోవలోకి వచ్చేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కొండ నీరు ముడసర్లోవలోకి నేరుగా చేరేందుకు వీలుగా మూడు మార్గాల గుండా ప్రత్యేకంగా మూడు ప్రాంతాల్లో చప్టాలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు కింద నీరు వెళ్లేందుకు అనుగుణంగా నిర్మాణం జరిగింది. తాజాగా జరుగుతున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోనుంది. ముడసర్లోవకు నీరు చేరిక బంద్‌ కావడంతో పాటు చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తలెత్తనుంది. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నారు. నరసింహస్వామి కొలువై దీరిన కొండను తవ్వే యత్నం చేస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తీవ్ర అపచారమని హెచ్చరిస్తున్నారు.

ప్రకృతి వనరులు సొంత ఆస్తి కాదు..
విశాఖలోని  తర్లు­వాడ కొండల్లో సు­మారు 140 ఎకరా­ల విస్తీర్ణంలోని అట­వీ సంపద­ను, కొండలను పర్యా­వ­రణ అనుమతులు లేకుండానే ధ్వంసం చే­స్తున్నారు. కొండలపై ఉన్న సహజ జల ప్రవా­హ మార్గాలు, నీటి వనరులను మట్టితో కప్పేస్తున్నట్లు స్పష్ట­మవుతోంది. పర్యా­వరణ ప్రభావం అంచనా లేకుండా కొండలను తొలగించి సహజ జల­వనరు­లను పూడ్చివేయడం శిక్షార్హమైన నేరం. టీఎన్‌ గోదావర్మన్‌ తిరుముల్పాడ్‌ వర్సె­స్‌ యూ­నియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్యావరణ సున్నిత ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభు­త్వాలపైనే ఉంది. పర్యావరణ అనుమ­తులు లేకుండా పనులు ప్రారంభించడం చట్టవిరు­ద్ధం. పోస్ట్‌–ఫ్యాక్టో విధానంలో పనులు పూ­ర్తయిన తర్వాత అనుమతులు తెచ్చుకోవ­డాన్ని న్యాయస్థానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవు. ప్రకృతి వనరులు పాలకులు, రాజకీయ శక్తుల సొంత ఆస్తి కాదు. అమెరికా లాంటి అభి­వృద్ధి చెందిన దేశాల స్ఫూర్తితో పర్యావ­రణ విధ్వంసానికి వ్యతిరేకంగా విశా­ఖ ప్రజల్లోనూ అదే స్థాయి ప్రజా చైతన్యం రావాల్సిన సమయం ఆసన్నమైంది.
– బొలిశెట్టి సత్యనారాయణ, పర్యావరణవేత్త, జనసేన మాజీ సీనియర్‌ నాయకుడు

విధ్వంసాన్ని అడ్డుకోకుంటే భారీ మూల్యం..
ముడసర్లోవ రిజ­ర్వా­య­ర్‌ సమీపంలో సింహాచలం కొండ­లను అక్ర­­మంగా త­వ్వడం దుర్మార్గం. ప­ర్యావరణ నిబంధ­నలను, కోర్టు ఆదేశాలను బేఖాతరు చే­స్తూ ఇష్టానుసారంగా కొండలను తొలిచే­స్తుండటం వల్ల ముడ­సర్లోవ జలాశయ మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ తవ్వకాల వల్ల విశాఖ నగ­రానికి ప్రధా­నంగా తాగునీరు అందించే జలా­శయ క్యాచ్‌మెంట్‌ ప్రాంతం (నీటి పారు­దల ప్రాంతం) పూర్తిగా ధ్వంసమవుతోంది. మైనింగ్‌ మాఫి­యా­పై క్రిమినల్‌ కేసులు న­మో­­దు చేయాలి. పర్యావ­రణ పరిరక్షణ చ­ట్టా­లను అమ­లు చేసి ఈ విధ్వంసాన్ని వెంటనే అడ్డుకో­వాలి. లేనిపక్షంలో సింహాచలం కొండల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని విశా­ఖ ప్రజలు నీటి ఎద్దడి, ప్రకృతి విపత్తుల రూ­పంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
– ఈఏఎస్‌ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement