నిన్నెలా నమ్మాలి బాబూ? | Meeting in Undavalli regarding issues faced by capital Amaravati farmers | Sakshi
Sakshi News home page

నిన్నెలా నమ్మాలి బాబూ?

Sep 21 2026 5:47 AM | Updated on Sep 21 2026 5:47 AM

Meeting in Undavalli regarding issues faced by capital Amaravati farmers

రాజధాని రైతుల సదస్సులో మాట్లాడుతున్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

ముందు ఇచ్చిన భూములు అభివృద్ధి చేయండి

అంత వరకూ ఒక్క ఎకరా కూడా లాక్కోవడానికి వీల్లేదు 

రైతు సమస్యలు పరిష్కరించకుండా విస్తరణ అంటే కుదరదు 

మాజీ మంత్రి, రైతు సంఘం నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కుమార్, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, రైతుల స్పష్టీకరణ 

ఉండవల్లిలో రాజధాని రైతుల సమస్యలపై సమావేశం

సాక్షి, అమరావతి: రాజధాని కోసం ఇప్పటికే రైతుల నుంచి తీసుకున్న భూములను ముందుగా అభివృద్ధి చేసి, రైతులకు హామీ ఇచ్చిన ప్లాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే మరలా భూసేకరణ చేపట్టాలని మాజీ మంత్రి, రైతు సంఘం నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కుమార్, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదు­లు, రైతులు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా కొత్తగా భూములు తీసుకోవడమేమిటని వారు ప్రశ్నించారు. రాజ­ధాని రైతుల సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఆదివారం ఉండవల్లిలో జరిగిన సమావేశంలో వారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. తమ భూములు లాక్కుంటున్నారని, భూములు ఇవ్వని వారు వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా చేస్తున్నా­రని రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వారేమన్నారంటే.. 

అవసరం కన్నా అధికమొత్తంలో భూమి ఎందుకు? 
రాజధాని ప్రాంతాన్ని కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చకూడదని గతంలోనే సూచించామని మాజీ మంత్రి, రైతు ఉద్యమ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. పంటలు పండే భూములను రిజర్వాయర్లు, స్పోర్ట్స్‌ సిటీ, విమానాశ్రయం, రైల్వే లైన్‌ వంటి ప్రాజెక్టుల పేరుతో తీసుకోవద్దని కోరారు. స్పోర్ట్స్‌ సిటీ కోసం అవసరమైన భూమి కంటే ఎక్కువ మొత్తంలో భూసేకరణ ప్రతిపాదించడం అవసరమా అని ప్రశ్నించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం వేల ఎకరాల భూమిని తీసుకోవాలన్న ప్రతిపాదనను పునఃపరిశీలించాలని అన్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం అందుబాటులో ఉందని గుర్తుచేశారు. సింగపూర్‌ సంస్థలతో గతంలో జరిగిన ఒప్పందాలు, మాస్టర్‌ప్లాన్, అభివృద్ధి పనులపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. 

రాజధాని గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన ఆరోపించారు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, పెన్షన్లు అందించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో సామాన్యులు, పేదలు, మధ్యతరగతి, నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, సేవా రంగంలో పనిచేసే వారికి ఎంత స్థానం ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలని మాజీ ఐఏఎస్‌ అధికారి, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ కోరారు. ఇప్పటికే రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములు తీసుకున్నారని, వాటిని అభివృద్ధి చేయకుండా మరో దశలో భూసేకరణ చేయడం సరికాదని అన్నారు. అమరావతిలో అవసరమైన భూమిని మాత్రమే తీసుకుని, మిగిలిన భూముల్లో రైతులు వ్యవసాయం కొనసాగించే అవకాశం కల్పించాలన్నారు.  

గత హామీలు అమలుకానప్పుడు కొత్త హామీలు ఎలా నమ్మాలి? 
రైతులను భూముల నుంచి దూరం చేసి, కొంతకాలం వ్యవసాయానికి అవకాశం లేకుండా చేయడం వల్ల రైతుల ఆదాయంతో పాటు రైతు కూలీలు, మధ్యవర్తులు, వ్యాపారులు, స్థానిక మార్కెట్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడిందని ప్రొఫెసర్‌ రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. ల్యాండ్‌ పూలింగ్‌–2లో కొత్తగా భూములు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో గత హామీలు అమలు కానప్పుడు రైతులు కొత్త హామీలను ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో ప్రజా ధనాన్ని భారీ నిర్మాణాలకు ఖర్చు చేసే ముందు విద్య, వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు వంటి ప్రజా అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భూసేకరణకు సంబంధించిన అవార్డులను సవాలు చేసుకునే ప్రక్రియ పూర్తికాకముందే భూముల్లో రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం సరికాదని హైకోర్టు న్యాయవాది రజని అన్నారు. కోర్టులో ఒక ఉత్తర్వును సవాలు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు రైతులకు కూడా అదే విధమైన న్యాయపరమైన అవకాశం ఉండాలని పేర్కొన్నారు. చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తిచేసిన తర్వాతే రైతుల భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని కోరారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే మొదటి దశలో భూములిచ్చిన రైతులకు ముందుగా న్యాయం జరగాలని సామాజిక కార్యకర్త డాక్టర్‌ వసుంధర అన్నారు.  

పొలం ఇవ్వలేదని కక్షసాధిస్తున్నారు 
‘‘నేను పొలం ఇవ్వలేదు. అందుకే నాపై కక్ష సాధిస్తున్నారు. వ్యవసాయం చేయనివ్వడం లేదు. ఎరువులు ఇవ్వనంటున్నారు. నేను భూములు ఇవ్వకుండానే నా చేలో ప్లాట్లు వేసేశారట. అదెలాగో తెలియడం లేదు. అన్నం కంచం ముందు కూర్చుని కన్నీరు పెట్టుకుంటున్నాం. మేమెలా బతకాలి. అసలు బతకాలా చచ్చిపోవాలా. ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యానికి మేం న్యాయం కోసం ఎక్కడికి పోవాలి.’’ –చల్లపల్లి శ్రీరాములు, ఎర్రబాలెం రైతు. (ఫొటో:06) 

వేల ఎకరాలు లాక్కొని ఏం చేస్తారు? 
‘‘భూ సేకరణపై మా అభ్యంతరాలు అడుగుతారు. కానీ వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కోర్టు ఆర్డర్‌ ఇస్తే కనీసం అప్పీల్‌ చేసుకునే సమయం ఇవ్వకుండా యంత్రాలు తెచ్చి తవ్వేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఎన్ని ఎకరాలు కావాలి. వేలాది ఎకరాలు రైతుల నుంచి లాక్కొని ఏం చేస్తారు. అవసరమైనంత వరకూ తీసుకుని మిగతాది రైతులకు వదిలేస్తే అనేక పంటలు పండుతాయి.’’–మక్కే పూర్ణచంద్రరావు, పెనుమాక రైతు. (ఫొటో:07) 

రైతులను భయపెడుతున్నారు 
‘‘రాష్ట్రమంతటా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా రాజధాని ప్రాంతంలో మూడు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. అంతటి సారవంతమైన భూములను అనవసరంగా లాక్కొని కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చవద్దని వేడుకుంటున్నాం. చిన్న, సన్నకారు రైతులను భయపెడుతున్నారు. ’’–శ్రీకాంత్‌రెడ్డి, పెనుమాక రైతు. 

రైతుల ప్రధాన డిమాండ్లు 
ఇప్పటికే భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు వెంటనే ఇవ్వాలి. 
ప్లాట్ల వద్ద రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. 
రాజధాని గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. 
⇒ వరద ముంపు నివారణ చర్యలు వేగంగా చేపట్టాలి. 
⇒ రైతుల సమస్యలు పరిష్కరించే వరకు కొత్త భూసేకరణ చేపట్టకూడదు. 
⇒ రైతుల అనుమతి, చట్టబద్ధమైన పరిహారం లేకుండా భూములు తీసుకోకూడదు. 
⇒ గ్రామకంఠాలు, లంక భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. 
⇒ రాజధాని ప్రాజెక్టులపై రైతులతో సంప్రదింపులు జరపాలి. 
⇒ రైతులకు ఇచ్చిన హామీలు, ఒప్పందాలను అమలు చేయాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement