ఎదురుదాడికి కుట్ర! | YSRCP to Hold Protest at SAAP Office: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఎదురుదాడికి కుట్ర!

Sep 21 2026 5:52 AM | Updated on Sep 21 2026 5:52 AM

YSRCP to Hold Protest at SAAP Office: Andhra Pradesh

విజయవాడలో ఆదివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న డీఎస్సీ–2025 స్పోర్ట్స్‌ కోటాలో పోస్టులు పొందిన వారు

డీఎస్సీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని శాప్‌ కార్యాలయం వద్ద నేడు వైఎస్సార్‌సీపీ ధర్నా

విజయవాడలో వైఎస్సార్‌సీపీ ర్యాలీ, ధర్నాకు అనుమతిలేదని పోలీసుల ప్రకటన

పోటీగా స్పోర్ట్స్‌ కోటాలో అక్రమంగా ఉద్యోగాలు పొందినవారితో బల ప్రదర్శనకు ముఖ్య నేత కుట్ర 

రచ్చ చేయడమే ప్రధాన ఉద్దేశం

దానికోసం ఆదివారం విజయవాడలోని ఓ హాలులో సమావేశం ఏర్పాటు 

వివిధ ప్రాంతాల నుంచి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందినవారు విజయవాడకు తరలింపు

రాత్రికి నగరంలోనే వారికి బస ఏర్పాటు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలకు పాల్పడి అడ్డంగా దొరికిన ప్రభుత్వం.. అక్రమాలను ప్రశ్నించేవారిపై ఎదురుదాడికి ప్రయత్నిస్తోంది. అందుకోసం స్పోర్ట్స్‌ కోటాలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారితో విజయవాడలో సోమవారం బల ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమైంది. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఈ నెల 21న (సోమవారం) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. 

నగరంలోని శిఖామణి సెంటర్‌ నుంచి శాప్‌ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని డీఎస్సీ బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు పాల్గొనాలని కోరింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని రచ్చ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. వైఎస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీకి పోటీగా అక్రమంగా నియామకాలు పొందిన వారితో బలప్రదర్శనకు పథకం రచించారు. 

విజయవాడలో ప్రత్యేక సమావేశం..
రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్‌ కోటాలో ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారంతా ఆదివారమే విజయవాడకు చేరుకున్నారు. వారంతా నగరంలోని ఓ హాలులో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.  ప్రభుత్వం కనుసన్నల్లోనే వారంతా విజయవాడకు వచ్చారని, ఈ సమావేశంలో పాల్గొన్నారనేది బహిరంగ రహస్యమే. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ ఆదివారం రాత్రి విజయవాడలోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు.

 వైఎస్సార్‌సీపీ ర్యాలీ చేపడితే, వెంటనే పోటీగా ప్రదర్శన చేయాలనేది వారి స్కెచ్‌గా తెలుస్తోంది. వారి ప్రదర్శనకు శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ముందుగానే పోలీసులతో లోపాయికారిగా అనధికారిక అనుమతి పొందినట్లు సమాచారం. అంతేకాదు వారందరినీ అధికార పార్టీకి చెందిన కొందరు దగ్గరుండి కనకదుర్గమ్మ దర్శనం కూడా చేయించడం గమనార్హం. డీఎస్సీలో అక్రమాలకు తెరలేపిన ముఖ్యనేత ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నట్లు సమాచారం. 

పోలీసులను అడ్డుపెట్టుకుని..
డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు వైఎస్సార్‌సీపీ ఇప్పటికే అనేక ఆధారాలు బయటపెట్టింది. అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి, గోల్డ్‌ మెడల్స్‌ పొందినవారిని పక్కన పెట్టిన వైనాన్ని ఇప్పటికే పలుమార్లు ఆధారాలతో వైఎస్సార్‌సీపీ ప్రజల ముందుంచింది. పరీక్ష లేకుండానే నేరుగా ఉద్యోగాలు ఇచ్చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సైతం అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. దీంతో రోజురోజుకూ డీఎస్సీ అక్రమాలు మరిన్ని వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వంలో ఆందోళన ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ నిరసనలను ఎలాగైనా అడ్డుకునేందుకు పోలీసులను రంగంలోకి దించింది. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ శాంతియుత ర్యాలీకి అనుమతిలేదని చెప్పించింది.

వైఎస్సార్‌సీపీ ర్యాలీ, ధర్నాకు అనుమతి లేదు : డీసీపీ 
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద సోమవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన నిరసన ధర్నా, ర్యాలీలకు అనుమతిలేదని డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు, ఊరేగింపులు, ట్రాఫిక్‌ అంతరాయాలు, పోలీస్‌ సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని ర్యాలీ, ధర్నాలకు అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement