చైన్ స్నాచింగ్‌లు, చోరీ చేసిన బంగారం విక్రయాలకు త్వరలో చెక్
హెచ్‌యూఐడీ నంబర్ ఆధారంగా ‘సోల్డ్’ పేరిట ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి
నగలు కొన్న వారి వివరాలను షాపుల నిర్వాహకులు బీఐఎస్ పోర్టల్‌లో నిక్షిప్తం చేయాల్సిందే
ఆ వివరాలతో సరిపోలకుంటే పాత బంగారాన్ని జువెల్లర్స్ కొనేందుకు వీల్లేదు
దొంగ బంగారాన్ని కరిగించి విక్రయించాలనుకున్నా హెచ్‌యూఐడీ నంబర్ లేనందున కుదరదు
కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: దేశంలో బంగారం క్రయవిక్రయాల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు, షాపుల్లోని బంగారు నిల్వల రికార్డులన్నీ పకడ్బందీగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక మార్పులు తీసుకురానుంది. బంగారు ఆభరణాలపై ఉండే ప్రత్యేక హాల్‌మార్క్ నంబర్‌కు అనుగుణంగా ఆయా నగల విక్రయాల వివరాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పోర్టల్‌లో ‘సోల్డ్’ పేరుతో నమోదు చేయడాన్ని తప్పనిసరి చేయనుంది. అంటే నగల షాపుల నిర్వాహకులు నగలు ఎవరికి, ఏ ధరకు, ఎంత పరిమాణంలో విక్రయించారనే వివరాలను ఆన్‌లైన్‌లో చేయాల్సి రానుంది.
కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ప్రతి హాల్‌మార్క్ నగపై మూడు ముద్రలు తప్పనిసరిగా ఉంటాయి. బీఐఎస్ లోగో, స్వచ్ఛత ముద్ర (22కే 916 వంటిది), 6 అంకెల హాల్‌మార్క్ యునీక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబర్ కనిపిస్తాయి. అయితే ఇప్పటివరకు హెచ్‌యూఐడీ కేవలం స్వచ్ఛతకు గుర్తుగా ఉండేది. కానీ ఇకపై నగలు విక్రయించగానే జువెలర్స్ స్టోర్ల నిర్వాహకులు హెచ్‌యూఐడీ నంబర్లతోపాటు ఆయా విక్రయ లావాదేవీలను బీఐఎస్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలి. దీనివల్ల ఆ నగలు కొన్న వారు కాకుండా చైన్ స్నాచర్లు, దొంగలు ఆ నగలను అమ్మాలనుకుంటే ఆన్‌లైన్‌లో ‘ఈ హెచ్‌యూఐడీ ఉన్న నగ ఇప్పటికే అమ్ముడైంది’ అని చూపిస్తుంది.
మరి కరిగించి అమ్మితే?
దొంగలు ఒకవేళ నగలను కరిగించి ముద్దగా చేసి విక్రయించాలనుకుంటే దానిపై ఉండే హెచ్‌యూఐడీ పోతుంది. అలా నంబర్ లేని బంగారాన్ని కొనుగోలు చేయబోమని హైదరాబాద్‌లోని పంజాగుట్ట, చార్మినార్‌లో ఉండే ప్రముఖ జ్యువెలర్ స్టోర్లు, బంగారు వ్యాపారులు స్పష్టం చేశారు. కరిగించిన బంగారం తెస్తే అది దొంగ సొత్తన్న అనుమానం వస్తుందని.. అలాంటి బంగారాన్ని కొనేందుకు ఆర్గనైజ్డ్ షాపుల్లో ఎవరూ రిస్క్ చేయరని చెప్పారు.
అలాగే ఎవరైనా నగలను విక్రయానికి తీసుకొస్తే బిల్లు, ఆధార్, హెచ్‌యూఐడీ నంబర్‌ను తనిఖీ చేస్తున్నామని.. బిల్లు లేకపోతే పాత బంగారం కింద కూడా తీసుకోబోమని తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం పాత బంగారం కొనేటప్పుడు నో యువర్ కస్టమర్ (కేవైసీ) తప్పనిసరి అని, బిల్లు లేకుండా ముద్ద బంగారం కొంటే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. బీఐఎస్ చట్టం–2016 సెక్షన్ 29 ప్రకారం హెచ్‌యూఐడీని దుర్వినియోగం చేసే నగల షాపుల నిర్వాహకులకు ఏడాది వరకు జైలుశిక్ష, నగ విలువకు 5 రెట్లు జరిమానా పడటంతోపాటు వారి లైసెన్స్ కూడా రద్దవుతుంది.
కస్టమర్లు బీఐఎస్ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు..
తాము కొన్న బంగారు నగలపై ఉండే హెచ్‌యూఐడీ నంబర్లను వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. దీంతో అవి తమ పేరిటే ఉన్నాయా లేదా? హాల్‌మార్కింగ్ ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలిసిపోతాయి. దేశంలో ఇప్పటివరకు 60 కోట్లకుపైగా నగలకు హెచ్‌యూఐడీ నంబర్లు వేశారు. తాజాగా బంగారు నగలపై బీఐఎస్ హాల్ మార్కింగ్ ఫీజును రూ. 45 నుంచి రూ. 75కు పెంచుతూ కేంద్రం ఈ నెల 14 నోటిఫికేషన్ జారీ చేసింది.


