ఉపాధి కల్పనలో ‘కోదాడ మెగా జాబ్‌ మేళా’ మైలురాయి | Kodad Mega Job Mela Milestone In Rural Employment Generation | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనలో ‘కోదాడ మెగా జాబ్‌ మేళా’ మైలురాయి

Sep 20 2026 9:10 PM | Updated on Sep 20 2026 9:10 PM

Kodad Mega Job Mela Milestone In Rural Employment Generation

సాక్షి, హైదరాబాద్‌: విద్యావంతులైన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో నిర్వహించిన కోదాడ మెగా జాబ్‌ మేళా విజయవంతమైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో సుమారు 350 కంపెనీలు ఒకే వేదికపైకి రాగా, 30 వేల మందికిపైగా ఉద్యోగార్థులు నమోదు చేసుకున్నారు. వివిధ దశల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 5,725 మంది అభ్యర్థులు తదుపరి నియామక ప్రక్రియకు షార్ట్‌లిస్ట్‌ అయ్యారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌. పద్మావతిరెడ్డి నేతృత్వంలో సెప్టెంబర్‌ 19న నిర్వహించిన ఈ భారీ నియామక కార్యక్రమం గ్రామీణ నిరుద్యోగ సమస్యను ప్రధానాంశంగా తీసుకుంది. భౌగోళిక దూరం, ఉద్యోగ సమాచార లోపం, ఆర్థిక పరిమితుల కారణంగా ప్రముఖ సంస్థలను చేరుకోలేకపోతున్న గ్రామీణ యువతకు స్థానికంగానే అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహించారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన యువత ఈ మేళాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమాచార సాంకేతికత, ఫార్మా, తయారీ, వైద్య ఆరోగ్య రంగం, బ్యాంకింగ్‌, రిటైల్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలను పరిశీలించి ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించాయి. గ్రామీణ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేసి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నప్పటికీ, వారికి సరైన సమయంలో ఉద్యోగ సమాచారం అందడం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, పాలిటెక్నిక్‌ తదితర కోర్సులు పూర్తి చేసిన యువత ఉద్యోగ అవకాశాలను గుర్తించడం, సంస్థలను సంప్రదించడం, ఇంటర్వ్యూల కోసం పదేపదే నగరాలకు వెళ్లడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఒక యువకుడి గ్రామ చిరునామా లేదా కుటుంబ ఆర్థిక పరిస్థితి అతని ఉద్యోగ అవకాశాలకు అడ్డంకిగా మారకూడదన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

అర్హులైన ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న కంపెనీలు, తొలి అవకాశం కోసం నిరీక్షిస్తున్న గ్రామీణ యువతను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వారి మధ్య ఉన్న అంతరాన్ని ఈ మేళా తగ్గించిందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలను నేరుగా సంస్థల ప్రతినిధుల ముందు ప్రదర్శించడంతోపాటు సంఘటిత రంగంలో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై అవగాహన పొందారని తెలిపారు.

గత ఏడాది హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌ మేళా అనుభవానికి కొనసాగింపుగా కోదాడలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో చేపట్టారు. పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, ఐదు జిల్లాల అధికార యంత్రాంగంతో ముందస్తుగా సమన్వయం చేసుకుని యువతను పెద్ద ఎత్తున సమీకరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఈ కార్యక్రమానికి సహకారం అందించాయి.

జాబ్‌ మేళాలో పాల్గొన్న యువతను ఉద్దేశించి శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేయడంలో కోదాడ మెగా జాబ్‌ మేళా రాష్ట్రంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రశంసించారు. ఒకే వేదికపైకి సుమారు 350 కంపెనీలను తీసుకురావడం అసాధారణమైన ప్రయత్నమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి భారీ ఉద్యోగ మేళాలను నిర్వహించి యువత నివసిస్తున్న ప్రాంతాలకు చేరువలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తదితరులు జాబ్‌ మేళాలో పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులతో వారు మాట్లాడి, ఉద్యోగ అవకాశాలు పొందిన అభ్యర్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement