మిస్టరీ డాక్టర్‌ ఎక్కడ? | Extensive Medical Services Extended to Maoists | Sakshi
Sakshi News home page

మిస్టరీ డాక్టర్‌ ఎక్కడ?

Sep 21 2026 5:42 AM | Updated on Sep 21 2026 7:05 AM

Extensive Medical Services Extended to Maoists

ఎంబీబీఎస్‌ పూర్తి చేసి అజ్ఞాత జీవితంలోకి..

మావోయిస్టులకు విస్తృతంగా వైద్య సేవలు

ఆపరేషన్‌ కగార్‌కు సైతం చిక్కని వైనం

గణపతితోపాటు మిస్టరీ డాక్టర్‌ ఆచూకీపై ఆరా

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సవాళ్లను ఎదుర్కొని 21 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీ మనుగడ సాగించింది. కానీ ఆపరేషన్‌ కగార్‌ దెబ్బకు ఈ ఏడాది మార్చి నాటికి ఆ పార్టీ ప్రస్థానం దాదాపుగా ముగిసింది. అయితే, ఇప్పటికీ ఆ పార్టీ మాజీ చీఫ్‌ గణపతితోపాటు మిస్టరీ డాక్టర్‌గా పేరున్న రఫీక్‌ ప్రభుత్వ నిఘా విభాగాలకు చిక్కలేదు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు తమ అజ్ఞాత జీవితానికి సంబంధించిన విశేషాలను వెల్లడిస్తున్నారు. 

అందులో ఎదురు కాల్పుల్లో గాయపడిన కామ్రేడ్లకు దిగిన బుల్లెట్లను అడవిలో పరిమిత వనరులతోనే ఆపరేషన్‌ ద్వారా తొలగించిన ఘటనలు, దళంలో చేరిన సభ్యులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం అడవిలో చేపట్టిన పద్ధతులు, ప్రతీ దళంలో ఒక సభ్యుడికి ఫస్ట్‌ ఎయిడ్‌ చేయగలిగే సామర్థ్యం 
ఉండేలా ఆరు నెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు వెలుగు చూసింది. మాజీలందరూ చెబుతున్న వివరాలన్నీ మిస్టరీ డాక్టర్‌ రఫీక్‌నే గుర్తు చేస్తున్నాయి.

తొలిసారిగా...
యూరప్‌కు చెందిన ఓ రచయిత మావోయిస్టుల ఆహ్వానం మేరకు 2010లో దండకారణ్యంలో పర్యటించారు. ఆ తర్వాత అక్కడ తాను చూసిన అంశాలను పేర్కొంటూ రాసిన ఓ పుస్తకంలో డాక్టర్‌ రఫీక్‌ సేవలను ప్రస్తావించారు. అప్పటి నుంచి యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌లో ఉన్న నిఘా విభాగాలు ఈ డాక్టర్‌ కదలికలపై కన్నేశాయి. డాక్టర్‌ రఫీక్‌ పంజాబ్‌లో వైద్యవిద్య పూర్తి చేసి సాయుధ విప్లవ పంథాను ఎంచుకున్నట్టు గుర్తించాయి. అధికారికంగా 2016లో దండకారణ్యం వదిలి జార్ఖండ్‌లోని చైబాసా అడవులకు తరలినట్టుగా గుర్తించారు. ఆయన భార్య రింకీ సైతం మావోయిస్టు దళాలకు సాయం చేసేందుకు అడవి బాట పట్టినట్టు 2018లో తేలింది. మావోయిస్టుల్లో ఈ జంటకు ఎంతో మంచి పేరుంది. అయితే రఫీక్, రింకీ అనేవి సైతం వారి సొంత పేర్లు కాకపోవడం విశేషం.

ఇంజనీర్లు పోయినా.. డాక్టర్‌ మిగిలాడు
ఉత్తర తెలంగాణ జిల్లాలో 1980–90 దశకాల్లో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు విప్లవం బాట పట్టారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావుతోపాటు చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ వంటి నేతలు ఇంజనీరింగ్‌ నేపథ్యం నుంచి పీపుల్స్‌వార్‌ పార్టీలోకి వచ్చినవారే. ఆయుధాల తయారీలో వీరి సాంకేతిక నైపుణ్యం ఆ పార్టీకి అక్కరకు వచ్చింది. ఇంజనీర్లతో పోలిస్తే వైద్యవిద్య పూర్తి చేసి అడవుల బాట పట్టినవారు చాలా తక్కువ. అజ్ఞాత జీవితంలో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆయా ప్రాంతాల్లో ఉండే సానుభూతిపరులైన డాక్టర్ల నుంచి సాయం పొందడం మరీ కష్టంగా ఉంటే సమీప పట్టణాలకు వచ్చిన వైద్యం చేయించుకోవడం తప్ప మరో మార్గం లేకపోయేది. కానీ ఈ పరిస్థితిని మిస్టర్‌ డాక్టర్‌ రఫీక్‌ పూర్తిగా మార్చివేశాడు.

ఆచూకీ దొరక్కుండా
ఆపరేషన్‌ కగార్‌ 2024 జనవరిలో మొదలైంది. ఏడాది తిరిగే సరికి మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి అగ్రనేతలు తమ కేడర్‌తో లొంగిపోయారు. ఆ తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న దేవ్‌జీ, మిసిర్‌ బేస్రా అజ్ఞాతం వీడారు. లొంగిపోయిన, అరెస్ట్‌ అయిన మావోయిస్టుల నుంచి నిఘా సంస్థలు ఎంతో నైపుణ్యంతో వివరాలు రాబట్టినాగణపతితోపాటు మిస్టరీ డాక్టర్‌ రఫీక్‌ ఆనవాళ్లు కనిపెట్టలేకపోయాయి. 

పోలీసులకు చిక్కకుండా అజ్ఞాత జీవిత గడపగలుగుతున్నారు. దీంతో గణపతి, రఫీక్‌ ఒకే చోట ఉన్నారా.. లేక వేర్వేరుగా ఉన్నారా అనే అంశం ఆసక్తి కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement