ఆడవాళ్ల మాదిరిగా వచ్చిన నిందితులు
గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రెండు ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి రూ.15.70 లక్షలు స్వాహా
కరీంనగర్ జిల్లాలో కలకలం
కరీంనగర్ క్రైం: కరీంనగర్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంతోపాటు నగర శివారులోని దుర్శేడ్‌లో శని వారం రాత్రి రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి సుమారు రూ.15.70 లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. మొదట తిమ్మాపూర్ లో సుమారు రూ.7.13 లక్షలకు పైగా.. తర్వాత దుర్శేడ్‌లో రూ.8.55 లక్షల నగదు చోరీ అయింది.
చోరీల్లో పాల్గొన్న ముగ్గురు నిందితులు ఆడవేషంలో వచ్చి.. ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీ అనంతరం మహారాష్ట్రకు చెందిన ఫేక్ నంబర్ ప్లేట్ ఉన్న స్కార్పియోలో పరారైనట్లు పోలీ సులు గుర్తించారు. వీరితోపాటు మరో వ్యక్తి డ్రైవర్‌గా వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. ఘటనలో హరియాణాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయంపై దర్యాప్తు సాగుతోంది. చోరీ అనంతరం మంచిర్యాల మీదుగా మహా రాష్ట్ర వైపు వెళ్లి ఉండొచ్చని అనుమాని స్తున్నారు. ఇటీవల జరిగిన పీఎంజే జ్యువెలరీ చోరీ తరహాలోనే ముందస్తు రెక్కీ, టార్గె ట్ ఎంపిక, వేగవంతమైన ఆపరేషన్, పరారీ కనిపిస్తుండటంతో పోలీసులు ఈ ఘటన లను ఆ కోణంలోనూ పరిశీలిస్తున్నారు.
నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఘటన స్థలాలను అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి వేలిము ద్రలు సేకరించాయి. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలోని రేణికుంట, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్ టోల్ గేట్‌ల వద్ద నిందితులు వినియోగించిన వాహనం రికార్డు కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల మీదుగా వచ్చి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.


