భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పోలీస్ సాంకేతికతలో మార్పులు
ఫ్రెండ్లీ కాదు.. ఇకపై కఠినమైన పోలీసింగే ఉంటుంది
కీలక అంశాల్లో యువ ఐపీఎస్‌లకు భాగస్వామ్యం
పోస్టింగ్‌లలో రాజకీయ నేతల జోక్యం తగ్గించేలా ప్రయత్నిస్తున్నా
మహిళా భద్రత విభాగాన్ని బలోపేతం చేస్తా
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డీజీపీ సీవీ ఆనంద్
(నాగోజు సత్యనారాయణ)
భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణ పోలీస్‌శాఖను సాంకేతికంగా బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టాం.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా టెక్‌టీం ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సాంకేతిక అంశాలపై అవగాహన పెంచేలా రాష్ట్రవ్యాప్తంగా త్వరలో శిక్షణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. యువ ఐపీఎస్ అధికారులను కీలక అంశాల్లో భాగస్వాములను చేస్తా మని చెప్పారు. పోలీస్‌శాఖలో అవినీతి అధికారులపై పూర్తి నిఘా పెట్టామని, పోస్టింగ్‌లలోనూ వీలైనంత వరకు రాజకీయ జోక్యం తగ్గించేలా ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. క్షేత్రస్థాయి అవసరాలు, మారుతున్న నేర సరళికి తగ్గట్టుగా పోలీసింగ్‌ను బలోపేతం చేసేలా పోలీస్‌శాఖను పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్టు వెల్లడించారు. పోలీస్‌బాస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తీసుకున్న కీలక చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు పంచుకున్నారు.
డీజీపీగా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత గుర్తించిన మూడు ముఖ్యమైన లోపాలు.. వాటిని ఎలా సరిదిద్దుతున్నారు ?
మొదటిది డిపార్ట్‌మెంట్‌లో హైరార్కి లోపించడం, రెండోది పోలీస్ విభాగాలు, జిల్లా పోలీస్ యూనిట్లకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు మధ్య సమన్వయం లేకపోవడం, మూడోది చాలా అంశాల్లో జాతీయస్థాయిలో మన ర్యాంకింగ్ తగ్గడం. నేను డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటిని సరిచేయడంపై ఫోకస్ పెట్టా. ఒకేసారి 6,500 మంది ఎస్‌ఐ, ఆపై స్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి దిశానిర్దేశనం చేశా. విజుబుల్ పోలీసింగ్, డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేయడం..ఇలా గత కొంత కాలంగా మర్చిపోయిన బేసిక్ పోలీసింగ్‌ను తిరిగి తెస్తున్నాను. ఇన్‌స్పెక్షన్ కేలెండర్ ప్రకారం ఫీల్డ్ విజిట్స్, క్రైం మీటింగ్స్ ప్రతి నెలా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల్లో, యూనిట్లలో పోలీస్ అధికారులు విజిటర్స్‌ను తప్పక కలిసేలా ప్రత్యేక సమయం పెట్టుకోవాలని ఆదేశించా. రెండు మూడు నెలలుగా ఒక్కొక్కటిగా అంతా గాడిలోకి వస్తోంది.
సాంకేతికతపరంగా పోలీస్‌శాఖను బలోపేతం చేసేలా ఏ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ?
పోలీసింగ్‌లో సాంకేతికత అత్యంత ప్రధానం. నేను డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సాంకేతిక అంశాల విశ్లేషణకు యువ ఐపీఎస్ అధికారులతో టీ–స్పార్క్ అని ప్రత్యేక టీంను పెట్టాను. ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ అప్‌డేట్ చేస్తూ టీజీకాప్ 3.0, సీసీటీఎన్‌ఎస్ 3.0, హ్యాక్‌ఐ 3.0 ఇలా అన్ని యాప్‌లతోపాటు ప్రస్తుతం వాడుతున్న సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఏఐ టూల్స్‌ను వినియోగించేలా జీపీయూ సర్వర్స్ సహా నూతన పరికరాలు, సామగ్రిని కొనుగోలు చేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక టెక్ టీంను ఏర్పాటు చేస్తున్నాం. సీసీటీఎన్‌ఎస్‌లో, సైబర్ క్రైం పోర్టల్స్‌లో, నార్కోటిక్స్ పోర్టల్స్‌లో క్రైం డేటా ఫీడ్ చేయడం, ఆ డేటాను తిరిగి వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నా. క్రైం రివ్యూ సమావేశాలు సైతం అంతా ఆన్‌లైన్‌లో సీసీటీఎన్‌ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్) డేటా ఆధారంగానే విశ్లేషణ చేస్తాం.
ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు మర్యాద ఇచ్చి, చట్టప్రకారం వారికి అండగా ఉంటాం. కానీ, నేరస్తులు, రౌడీ మూకలను మన్నించేది లేదు. వారికి మాత్రం స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటుంది. తప్పు చేసిన వారికి పోలీస్ అంటే భయం ఉండాలి. అలా చేసినప్పుడే సామాన్యులకు ఊరట కలుగుతుంది.
సైబర్ నేరాలు, డ్రగ్స్ వంటి సవాళ్లకు తగ్గట్టుగా పోలీస్‌శాఖను ఎలా సన్నద్ధం చేస్తున్నారు ?
నేరాల స్వరూపం, స్వభావం మారుతోంది. కొత్తగా వచ్చిన సైబర్ నేరాలు, నార్కోటిక్స్ , ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఆహార కల్తీ ఇలా అనేక అంశాలపై ఫోకస్ పెట్టాం. మారిన అవసరాలకు తగ్గట్టుగా పోలీస్‌శాఖ రీఆర్గనైజేషన్‌పైనా దృష్టి పెట్టాను. ఈగల్, ఇతర పోలీస్ విభాగాలతో డ్రగ్స్, మత్తుపదార్థాల కట్టడికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం.
పోలీస్‌శాఖలో అవినీతి అరికట్టేందుకు ఏసీబీతోపాటు శాఖపరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు ?
పోలీస్‌శాఖలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై అన్ని రిపోర్టులు తెప్పించాను. ఆ జాబితా ఉంతా ఉంది. బదిలీల సమయంలో ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఇక పోలీస్‌శాఖలో అవినీతికి సంబంధించి ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సిబ్బందితో స్వయంగా మాట్లాడాను. సంపాద కోసం ఆరాటపడితే ఏదో ఒక రోజు ఏసీబీకి చిక్కడం, సమాజంలో అవమానాలు ఎదుర్కోవడం తప్పదని కౌన్సెలింగ్ ఇస్తున్నాను. అవినీతి ఆరోపణలపై యువ ఐపీఎస్‌లకు సైతం మందలించాను. కొందరు మారి పనిచేసుకుంటున్నారు. మారని వారికి తగిన సమయంలో శిక్ష తప్పదు.
పోస్టింగ్‌లలో రాజకీయ జోక్యం పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి..దీన్ని ఎలా తగ్గిస్తున్నారు ?
పోలీస్ పోస్టింగ్‌లలో రాజకీయ జోక్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో నాయకులు తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ అడగడం సహజమే. అయితే, సదరు అధికారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే సిఫారసు చేయాలని నాయకులకు మేం సూచిస్తున్నాం. సిఫారసులు లేకున్నా..పనితీరు ఆధారంగా అందరికీ పోస్టింగ్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
చాటా చోట్ల సీసీటీవీ కెమెరాలు లేవు..ఉన్నా పనిచేయని పరిస్థితి. ఈ విషయంలో మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు ?
ప్రజాభద్రతలో సీసీటీవీలు ఎంతో కీలకం. నేను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో 23 ఏళ్ల క్రితమే సీసీటీవీ కెమెరాలు పెట్టించి ట్యాంక్‌బండ్‌ను సూసైడ్‌స్పాట్ నుంచి టూరిస్ట్‌స్పాట్‌గా మార్చా. ఆ తర్వాత సేఫ్ సిటీ ప్రాజెక్టులో సీసీటీవీల ఏర్పాటు విస్తృతం చేశాం. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల పరిస్థితిపై ఇటీవలే ఆడిట్ నిర్వహించాం. అన్ని పనిచేసేలా మరమ్మతులు చేయిస్తున్నాం.
పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా ఏం చర్యలు తీసుకుంటున్నారు ?
ఫిట్‌నెస్ నా రోజువారీ జీవితంలో ఒక భాగం. ఈ వయస్సులో కూడా నేను క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్ ఆడడం చూసి నాతో పనిచేసే ఎంతో మంది సిబ్బంది నన్ను స్ఫూర్తిగా తీసుకుంటుంటారు. అయితే, పోలీసు విధుల్లో ఒత్తిడితో సిబ్బంది ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోంది. సిబ్బంది సంక్షేమంలో భాగంగా నేను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు అక్కడ అమలు చేసిన ఫిట్‌కాప్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అమలు చేయబోతున్నాం.
కొత్తగా ఏర్పాటు చేయబోయే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోతో ఏ మార్పులు తేబోతున్నారు?
అతి త్వరలో ఏర్పాటు చేయబోయే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోతో రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ ఒకే విధానంలోకి వస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే సీట్‌బెల్ట్, హెల్మెట్ నిబంధన రాష్ట్రమంతటా ఒకే విధంగా అమల్లోకి తెస్తాం. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హైవే, ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ పెంచుతాం.
మహిళలు, చిన్నారుల భద్రత మరింత బలోపేతం చేసేలా ఏం చర్యలు తీసుకుంటున్నారు ?
మహిళలు, చిన్నారుల భద్రతకు ఏర్పాటు చేసిన మహిళా భద్రత విభాగాన్ని మరింత బలపేతం చేసేలా సిబ్బంది సంఖ్యను పెంచుతాం. ఇప్పుడున్న డిప్యూటేషన్ విధానంలో కాకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడంతోపాటు ఆన్‌లైన్ నేరాల నియంత్రణపై మరింత ఫోకస్ పెడతాం.


