డిప్రెషన్ పెరిగే అవకాశం ఉందంటున్న పరిశోధనలు
కలిసి భోజనం చేస్తేనే మేలని సూచన
ఒంటరిగా భోజనం చేయటం వల్ల మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తాజా అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో, కలిసి భోజనం చేసే అలవాటు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక్కరే భోంచేస్తే నష్టాలివే..
⇒ మానసిక ఒత్తిడి: నిరంతరం ఒంటరిగా తినడం వల్ల ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంది.
⇒ ఆరోగ్యకరమైన అలవాట్లకు దూరం: ఒంటరిగా తినేవారు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, స్క్రీన్ చూస్తూ సరిగ్గా నమలకుండా తినడం వంటివి చేస్తుంటారు.
⇒ మెదడుపై ప్రభావం: నిరంతరం ఒంటరిగా తినేవారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగాలు (హిప్పోక్యాంపస్) కుదించుకుపోతున్నట్లు గుర్తించారు.
కలిసి తినడం వల్ల లాభాలు
⇒ ఫీల్ గుడ్ హార్మోన్లు: కుటుంబం లేదా స్నేహితులతో తిన్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ విడుదలయి ఒత్తిడిని తగ్గిస్తాయి.
⇒ డిప్రెషన్‌కి చెక్: జపాన్‌లో 65–74 ఏళ్ల వారిపై చేసిన అధ్యయనంలో.. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ రోజూ ఒంటరిగా తినే వృద్ధుల్లో డిప్రెషన్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
⇒ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్: 1.5 లక్షల మందిపై జరిపిన విశ్లేషణ ప్రకారం, ఇతరులతో తరచూ భోజనం పంచుకునే వారిలో జీవిత సంతృప్తి, భావోద్వేగ స్థిరత్వం అధికంగా ఉంటోంది.
మొత్తానికి, డిజిటల్ యుగంలో నేరుగా కలుసుకోవడం తగ్గుతున్న తరుణంలో, రోజుకు కనీసం ఒక్క పూట అయినా సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి తినడం మానసిక ఉల్లాసానికి, అనుబంధాల బలానికి అత్యంత ఆవశ్యకం అని పరిశోధనలు తేల్చేశాయి.


