జోధ్‌పూర్: భారతదేశ భూభాగంపై తొలిసారిగా జపాన్ యుద్ధ విమానాలు కార్యకలాపాలు నిర్వహించడం భారత్, జపాన్ మధ్య రక్షణ సహకారంలో ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ చెప్పారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో భారత్, జపాన్ యుద్ధ విమానాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 9న ప్రారంభయైన ఈ కార్యక్రమం 22న ముగుస్తుంది.
స్వదేశీ తేజస్, ఎస్‌యూ–30ఎంకేఐ, రఫేల్ సహా భారత వైమానిక దళానికి చెందిన అగ్రశ్రేణి విమానాలు, అలాగే జపాన్ వైమానిక స్వీయ–రక్షణ దళానికి చెందిన ఎఫ్–2ఈ యుద్ధ విమానాలు సంయుక్తంగా వీర్ గార్డియన్–2026 పేరిట జరిగిన వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. జపాన్ వాయుసేన స్వీయ–రక్షణ దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ టకేహిరో మోరితా సైతం ఇందులో భాగస్వాములయ్యారు.
టకేహిరో మోరితా ఒక పైలట్‌తో కలిసి తేజస్ ఫైటర్ జెట్‌ను నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఒంటరిగా మరో తేజస్ జెట్‌ను నడపడం విశేషం. పరస్పర గౌరవం, భాగస్వామ్యానికి చిహ్నంగా ఇద్దరు వైమానిక దళాధిపతులు బ్యాడ్జ్‌లను మార్చుకున్నారు. భారత్‌కు జపాన్ యుద్ధ విమానాలను పంపడం అనేది ఇరుదేశాల మధ్య రక్షణ సహకారానికి ప్రతీక అని టకేహిరో మోరితా చెప్పారు.


