breaking news
defense cooperation
-
భారత్ – అమెరికా రక్షణ వాణిజ్యం
వాషింగ్టన్: భారత్–అమెరికాల మధ్య రక్షణ రంగ వాణిజ్యం రోజురోజుకూ పుంజుకుంటోంది. వచ్చే వారంలో భారత్ –అమెరికాల డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డీటీటీఐ) తొమ్మిదో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ముగిసేనాటికి రెండు దేశాల మధ్య రక్షణ రంగ వాణిజ్యం 18 బిలియన్ డాలర్ల (రూ. లక్షా ఇరవై ఏడువేల కోట్లు)కు చేరుకుంటుందని పెంటగాన్ వర్గాలు అంచనావేశాయి. ఇరుదేశాల మిలిటరీ టు మిలిటరీ సంబంధాలను బలపరిచేందుకు తాము కట్టుబడి ఉన్నామని అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ అక్విజిషన్ అండ్ సస్టైన్మెంట్ ఎలెన్ ఎం లార్డ్ తెలిపారు. 2008లో ఇరు దేశాల మధ్య సున్నాగా ఉన్న వాణిజ్యం ఈ సంవత్సరం ముగిసేనాటికి 18 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గొప్పవిషయమని తెలిపారు. గత ఆగస్టులో అమెరికా భారత్‌కు ట్రేడ్ అథారిటీ టైర్ 1 స్థాయిని ఇచ్చిందని, నాటో కూటమి దేశాలకు కాకుండా మరో దేశానికి ఈ గుర్తింపు ఇవ్వడం ఇదే ప్రథమమని తెలిపారు. వచ్చేవారం ఎలెన్ భారత్ చేరుకొని భారత డిఫెన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ అపూర్వ చంద్రతో భేటీ కానున్నారు. -
గగనతలం.. శత్రు దుర్భేద్యం!
న్యూఢిల్లీ: భారత్, రష్యా రక్షణ సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. అమెరికా ఆంక్షల బెదిరింపులను తోసిరాజని రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ అనే అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నాటికి చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఢిల్లీలో శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీల మధ్య 19వ ఇండియా–రష్యా వార్షిక సమావేశం ముగిశాక ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువులుతదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. ఆచితూచి స్పందించిన అమెరికా.. భారత్, రష్యాల మధ్య ఎస్–400 ఒప్పందం కుదిరాక అమెరికా ఆచితూచి స్పందించింది. మిత్ర దేశాల సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం కాట్సా ఉద్దేశం కాదని పేర్కొంది. ఒక్కో ఒప్పందాన్ని బట్టి దానికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని తెలిపింది. ఉగ్రపోరులో సహకారం బలోపేతం.. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని భారత్, రష్యాలు తప్పుపట్టాయి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ద్వంద్వ వైఖరులు పాటించకుండా, కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నిర్మూలన, వాటి ఆర్థిక వనరులు, ఆయుధాల సరఫరా మూలాలను దెబ్బతీసేందుకు, ఉగ్ర నియామకాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. మోదీ, పుతిన్‌ల భేటీ తరువాత సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఇటీవల పాకిస్తాన్‌కు చేరువయ్యేందుకు రష్యా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఐక్యరాజ్య సమితి వద్ద పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని ఖరారుచేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. పర్యావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న వర్ధమాన, పేద దేశాలను ఆర్థిక, సాంకేతిక సాయంతో ఆదుకోవాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చాయి. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, హరిత విధానాలకు ప్రచారం కల్పిస్తూ పారిస్ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని కోరాయి. మెరుగైన వ్యాపార అవకాశాలు: మోదీ ఇరు దేశాల వ్యాపారవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. భారత్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేసేందుకు ముందుకు రావాలని రష్యాను ఆహ్వానించారు. మెట్రో రైలు, సాగరమాల, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో మెరుగైన వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం రోజురోజుకీ పెరుగుతోందని పుతిన్ అన్నారు. భారత్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం), రష్యాలోని సిరియస్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మోదీ, పుతిన్ సంభాషించారు. ఇరు దేశాల యువత మధ్య నిరంతరం చర్చలు జరగడం ద్వైపాకిక్ష సంబంధాలకు మరింత విలువ చేకూరుస్తుందని పుతిన్ అన్నారు. సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఏఐఎం, సిరియస్లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులు అధునాతన దీర్ఘశ్రేణి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనేందుకు భారత్ సంతకం చేసిన ఒప్పందం విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు. రష్యాతో ఆయుధ కొనుగోలు లావాదేవీలు జరిపితే ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించినా ఒప్పందానికే భారత్ సై అంది. రష్యా, ఇరాన్, ఉ.కొరియా కంపెనీలతో రక్షణ వ్యాపారాలు చేసే మిత్ర దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా కాట్సా(కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్) చట్టం తెచ్చింది. ఈ విషయంలో భారత్‌కు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. వైమానిక దళం శక్తి, సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసే ఎస్–400 క్షిపణులను భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించొచ్చు. రష్యా ఈ క్షిపణులను పలు దఫాలుగా భారత్‌కు అందజేస్తుంది. రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. సుమారు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెట్టే ఈ క్షిపణి వ్యవస్థ..400 కి.మీ దూరం నుంచి లక్ష్యంపై గురిపెడుతుంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాలోని అన్ని వైమానిక స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. గగన్‌యాన్ ప్రాజెక్టులో సహకారానికి సంబంధించి ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రాస్కాస్మోస్లు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
రక్షణ సహకారం విస్తరించుకుందాం
న్యూఢిల్లీ: వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో–పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని విస్తరించుకోవాలని భారత్, ఫ్రాన్స్‌లు నిర్ణయించాయి. భారత రక్షణ మంత్రి, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేల మధ్య శుక్రవారం జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రాంతీయ భద్రత, రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడం తదితర విషయాలు ప్రస్తావనకొచ్చాయి. ఉగ్ర వ్యతిరేక పోరాటంలో కూడా సహకారాన్ని విస్తరించుకోవాలని ఇరు వర్గాలు తీర్మానించాయి. ఈ విషయంలో సముద్ర తీర భద్రతపై ముఖ్యంగా చైనా ప్రాబల్యం పెరుగుతున్న హిందూ పసిఫిక్ ప్రాంతంపై దృష్టిపెట్టాలని అంగీకరించాయి. ఇరు దేశాల రక్షణ సంబంధాల బలోపేతానికి ఇది వరకే ప్రారంభించిన చర్యలను కూడా మంత్రులు సమీక్షించారు. సీతారాంతో తన చర్చలు అద్భుతంగా జరిగాయని పార్లే పేర్కొన్నారు. -
అఫ్గాన్‌కు మరింత రక్షణ సహకారం
► భద్రత, ఇతర రంగాల్లో సహకరిస్తామన్న భారత్ ► అఫ్గాన్‌లో 116 ప్రాజెక్టులు చేపట్టేందుకు సంసిద్ధత న్యూఢిల్లీ: వ్యూహాత్మక భాగస్వామి అయిన అఫ్గానిస్తాన్ భద్రతా వ్యవస్థ పటిష్టతకు మరిం త సహకారం అందిస్తామని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సరిహద్దు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనేందుకు విస్తృత స్థాయిలో కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో అఫ్గాన్ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ సోమవారం భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అఫ్గాన్‌లో రక్షణ వ్యవస్థ పటిష్టతతో పాటు అక్కడ కొత్తగా 116 అత్యున్నత స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు సుష్మా ఈ సందర్భంగా వెల్లడించారు. ఇరు దేశాలకూ ప్రమాదకరంగా మారిన సరిహద్దు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు. ‘భద్రత, సుస్థిరత, శాంతియుత, హింసలేని అఫ్గాన్ నిర్మాణం కోసం అక్కడి ప్రజలు చేస్తున్న కృషికి భారత్ సహకారం కొనసాగుతుంది. వారి కలల సాకారం కోసం ఇరు దేశాలూ కలసి పనిచేస్తాయి’అని సుష్మా పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా సుష్మా–రబ్బాని నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్‌తో మిత్రుత్వం మరో పొరుగు దేశంతో శతృత్వానికి కాదని రబ్బానీ స్పష్టం చేశారు. ఉగ్ర పోరాటానికి మద్దతు: మోదీ అఫ్గాన్‌తో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ పూర్తి మద్దతునిస్తుందని ఉద్ఘాటించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అఫ్గాన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుష్మాతో భేటీ అనంతరం అఫ్గాన్ విదేశాంగ మంత్రి రబ్బానీ.. మోదీని కలిశారు. ప్రజాస్వామిక, శాంతియుత అఫ్గాన్ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం చేస్తున్న కృషికి మానవీయ కోణంలోనూ, అభివృద్ధి పరంగానూ తమ సహకారం ఉంటుందని మోదీ పేర్కొన్నారు.